Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాకిస్థాన్ చేతిలో భారత్ పరాజయం
- ఛేదనలో పాక్ ఓపెనర్ల ధనాధన్
- భారత్ 151/7, పాకిస్థాన్ 152/0
టీమ్ ఇండియాను మంచు ముంచేసింది!. విలువైన టాస్ నెగ్గిన పాకిస్థాన్ దుబాయ్ పరిస్థితులపై కచ్చితమైన అవగాహనతో భారత్‌కు తొలుత బ్యాటింగ్ అప్పగించింది. మంచు ప్రభావం లేని వేళ పాక్ పేసర్లు భారత బ్యాటింగ్ లైనప్‌ను వణికించారు. మంచు ప్రభావంతో తడిసిన బంతితో పట్టు చిక్కక భారత బౌలర్లు ఆపసోపాలు పడ్డారు. విరాట్ కోహ్లి (57), రిషబ్ పంత్ (39) పోరాటంతో తొలుత భారత్ 151 పరుగులు చేయగా, పాకిస్థాన్ ఓపెనర్లు బాబర్ ఆజామ్ (69), మహ్మద్ రిజ్వాన్ (79) 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై విజయ వేటలో గతంలో ఐదు సార్లు విఫలమైన పాకిస్థాన్ అంతిమంగా ఓ విజయం సాధించింది.
నవతెలంగాణ-దుబాయ్
ఐసీసీ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై అజేయ రికార్డు చెరిగిపోయింది. టీ20 ప్రపంచకప్ సూపర్12 గ్రూప్-2 తొలి మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. 152 పరుగుల ఛేదనలో ఓపెనర్లు బాబర్ ఆజామ్ (68 నాటౌట్, 52 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), మహ్మద్ రిజ్వాన్ (79 నాటౌట్, 55 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీలతో చెలరేగారు. మంచు బెడదతో బంతిపై బౌలర్లకు పట్టు చిక్కకపోవటంతో పాక్ పని మరింత తేలికైంది. అంతకముందు, విరాట్ కోహ్లి (57, 49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌కు తోడు, రిషబ్ పంత్ (39, 30 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్‌తో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 151/7 పరుగులు చేసింది. పాక్ యువ పేసర్ షహీన్ షా అఫ్రిది (3/31) భారత భారీ స్కోరు ఆశలకు గండి కొట్టాడు.
ఓపెనర్లు కొట్టేశారు : ఛేదనలో పాక్ నిలకడ లేమి, యుఏఈలో స్వల్ప స్కోర్ల థ్రిల్లర్స్‌తో భారత్ రేసులోనే నిలిచింది. కానీ దుబారులో మంచు ప్రభావం కోహ్లిసేన అవకాశాలకు గండి కొట్టింది. భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన లెగ్ కట్టర్స్ సంధించినా పట్టు చిక్కక గతి తప్పాయి. పవర్ ప్లే అనంతరం పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు!. దుబారు పిచ్‌పై విశేష అనుభవం కలిగిన బాబర్ ఆజామ్ (68 నాటౌట్), మహ్మద్ రిజ్వాన్ (79 నాటౌట్) ఈ పరిస్థితిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. పది ఓవర్లలో 71/0తో ఉన్న పాకిస్థాన్ 17.5 ఓవర్లలోనే లాంఛనం ముగించింది. నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 40 బంతుల్లోనే బాబర్ అర్థ సెంచరీ సాధించగా.. రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో రిజ్వాన్ 41 బంతుల్లో ఆ మార్క్ చేరుకున్నాడు. సాధించాల్సిన రన్‌రేట్ దిగిరావటంతో రిస్క్ తీసుకునే అవకాశం లేకుండానే ఓపెనర్లు ఇద్దరే లాంఛనం ముగించారు. స్పిన్నర్లు వరుణ్, జడేజా సహా పేస్ త్రయం బుమ్రా, షమి, భువి వికెట్ల వేటలో విఫలమయ్యారు. భారత ఇన్నింగ్స్ ఆరంభంలో నిప్పులు చెరిగిన షహీన్ అఫ్రిది తన చివరి ఓవర్లో ఏకంగా 17 పరుగులు ఇచ్చుకున్నాడు. భారత్, పాక్ ఇన్నింగ్స్‌ల్లో మంచు ఎంతటి ప్రభావం చూపిందో ఇదే నిదర్శనం!.
కెప్టెన్సీ ఇన్నింగ్స్ : దుబాయ్ పిచ్ పరిస్థితులపై చక్కటి అవగాహనతో మంచు ప్రభావం దృష్టిలో ఉంచుకుని పాకిస్థాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆరంభంలోనే పాక్ యువ పేసర్ షహీన్ షా అఫ్రిది కోలుకోలేని దెబ్బ కొట్టాడు. బంతిని వికెట్ల మీదకు స్వింగ్ చేసి రోహిత్ శర్మ (0), కెఎల్ రాహుల్ (3) వికెట్లు పడగొట్టాడు. షహీన్‌కు తోడు హసన్ అలీ రాణించటంతో పవర్‌ప్లేలో భారత్ 36/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. సూర్య (11, 8 బంతుల్లో 1 ఫోర్,1 సిక్స్) ఎదురుదాడి ప్రయత్నం ఫలించలేదు. ఈ పరిస్థితులో కెప్టెన్ కోహ్లి, రిషబ్ పంత్ (39) భారత్‌ను ఆదుకున్నారు. నాల్గో వికెట్‌కు 53 పరుగులు జోడించారు. హసన్ అలీ ఓవర్లో ఒంటిచేత్తో వరుస సిక్సర్లు బాదిన పంత్, తర్వాతి ఓవర్లో స్పిన్నర్ షాదాబ్‌కు రిటర్న్ క్యాచ్‌తో నిష్క్రమించాడు. ఆరంభంలోనే షహీన్పై సిక్సర్ బాదిన విరాట్ సాధికారిక ఆటతో 45 బంతుల్లో అర్థ సెంచరీ చేశాడు. అర్థ సెంచరీ అనంతరం అతడికే వికెట్ కోల్పోయాడు. టీ20 వరల్డ్‌కప్‌లో విరాట్ వికెట్ తీయటం పాక్‌కు ఇదే ప్రథమం. జడేజా (13, 13 బంతుల్లో 1 ఫోర్), పాండ్య (11, 8 బంతుల్లో 2 ఫోర్లు) ఆశించిన మెరుపులు చూపించలేదు. 15 ఓవర్లలో 100 పరుగులు చేసిన భారత్ చివరి ఐదు ఓవర్లలో 51 పరుగులు పిండుకుంది.
స్కోరు వివరాలు :
భారత్ ఇన్నింగ్స్ : కెఎల్ రాహుల్ (బి) షహీన్ అఫ్రిది 3, రోహిత్ శర్మ (ఎల్బీ) షహీన్ అఫ్రిది 0, విరాట్ కోహ్లి (సి) రిజ్వాన్ (బి) షహీన్ అఫిద్రి 57, సూర్యకుమార్ యాదవ్ (సి) రిజ్వాన్ (బి) హసన్ అలీ 11, రిషబ్ పంత్ (సి,బి) షాదాబ్ ఖాన్ 39, రవీంద్ర జడేజా (సి) నవాజ్ (బి) హసన్ అలీ 13, హార్దిక్ పాండ్య (సి) బాబర్ (బి) హారిస్ రవూఫ్ 11, భువనేశ్వర్ కుమార్ నాటౌట్ 5, మహ్మద్ షమి నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 12, మొత్తం : (20 ఓవర్లలో 7 వికెట్లకు) 151.
వికెట్ల పతనం : 1-1, 2-6, 3-31, 4-84, 5-125, 6-133, 7-146. బౌలింగ్ : షహీన్ షా అఫ్రిది 4-0-31-3, ఇమద్ వసీం 2-0-10-0, హసన్ అలీ 4-0-44-2, షాదాబ్ ఖాన్ 4-0-22-1, మహ్మద్ హఫీజ్ 2-0-12-0, హారిస్ రవూఫ్ 4-0-25-1.
పాకిస్థాన్ ఇన్నింగ్స్ : మహ్మద్ రిజ్వాన్ నాటౌట్ 78, బాబర్ ఆజామ్ నాటౌట్ 68, ఎక్స్‌ట్రాలు : 06, మొత్తం :(17.5 ఓవర్లలో) 152.
బౌలింగ్ : భువనేశ్వర్ 3-0-25-0, షమి 3.5-0-42-0, బుమ్రా 3-0-22-0, వరుణ్ 4-0-33-0, జడేజా 4-0-28-0.