Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.7090 కోట్లకు ఆర్‌పీఎస్‌జీకి లక్నో ప్రాంఛైజీ
- రూ.5625 కోట్లకు సీవీసీకి అహ్మదాబాద్ ప్రాంఛైజీ
- ఐపీఎల్ నూతన ప్రాంఛైజీల ప్రకటన
నవతెలంగాణ-దుబాయ్ : ఐపీఎల్ కొత్త ప్రాంఛైజీలు బీసీసీఐపై కాసుల వర్షం కురిపించాయి. అత్యంత ఉత్కంఠ రేపిన ఐపీఎల్ నూతన ప్రాంఛైజీలు రికార్డు ధరకు అమ్ముడుపోయాయి. ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ (ఆర్పీఎస్జీ), సీవీసీ వ్యాపార సంస్థలు వేల కోట్లు వెచ్చించి ఐపీఎల్ ప్రాంఛైజీలు దక్కించుకున్నాయి. దుబాయ్‌లో సోమవారం జరిగిన వాక్ ఇన్ బిడ్డింగ్ కార్యక్రమం సుదీర్ఘంగా ఆరు గంటల పాటు సాగింది. బిడ్ల సాంకేతిక పరిశీలన, ఆర్థిక మదింపు అనంతరం రెండు ఐపీఎల్ ప్రాంఛైజీలను ప్రకటించారు. రూ.7090 కోట్లకు లక్నో ప్రాంఛైజీ ఆర్పీఎస్జీ గ్రూప్ దక్కించుకోగా.. రూ.5625 కోట్లకు సీవీసీ గ్రూప్ సొంతం చేసుకుంది. కొత్త ప్రాంఛైజీల టెండరు పత్రాలను సుమారు 22 సంస్థలు కొనుగోలు చేసినా వాక్ ఇన్ బిడ్డింగ్‌కు 9 సంస్థలు మాత్రమే వచ్చాయి. అహ్మదాబాద్ ప్రాంఛైజీ కోసం ముందు నుంచీ రేసులో నిలిచిన అదానీ గ్రూప్‌కు నిరాశ తప్పలేదు. కొత్త ప్రాంఛైజీల బిడ్డింగ్ ప్రక్రియను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్ కుమార్ ధుమాల్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, సంయుక్త కార్యదర్శి జయేశ్ జార్జ్ పర్యవేక్షించారు. ఐపీఎల్ ప్రాంఛైజీ కోసం లాన్సెర్ గ్రూప్ (మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ యాజమాని), అరబిందో ఫార్మా, టోరెంటో ఫార్మా గ్రూప్‌లు సైతం వాక్ ఇన్ బిడ్‌లో పోటీపడినా విజేతల ధరకు చేరువలోకి కూడా రాలేకపోయారు!. ధర్మశాల, గువహటి, ఇండోర్, కటక్, లక్నో, అహ్మదాబాద్ నగరాలను బీసీసీఐ ఎంపిక చేసింది. ఆర్పీఎస్జీ గ్రూపు ఇండోర్ కోసం సైతం బిడ్ దాఖలు చేయగా.. సీవీసీ సంస్థ లక్నో కోసం బిడ్ దాఖలు చేసినట్టు సమాచారం. ప్రాంఛైజీ కనీస ధర రూ. 2000 కోట్లుగా నిర్ణయించగా, తొలుత బీసీసీఐ రెండు ప్రాంఛైజీల ద్వారా రూ.7000 కోట్లు ఆశించింది. పెద్ద సంస్థలు పోటీలో నిలువటంతో ప్రాంఛైజీల విలువ అమాంతం ఆకాశానికి చేరుకుంది. రెండు ప్రాంఛైజీల ద్వారా బీసీసీఐ రూ.12715 కోట్లు ఆర్జించింది.
' ఐపీఎల్‌లోకి తిరిగి రావటం ఎంతో సంతోషంగా ఉంది. ఇది ఆరంభ అడుగు మాత్రమే. మంచి జట్టును నిర్మించుకుని, గొప్ప ప్రదర్శన చేయాల్సి ఉంది' అని లక్నో ప్రాంఛైజీ సొంతం చేసుకున్న ఆర్పీఎస్జీ యజమాని సంజీవ్ గోయెంకా అన్నారు. చెన్నై సూపర్‌కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ నిషేధం ఎదుర్కొన్న రెండేండ్ల సమయంలో ఆర్పీఎస్జీ గ్రూపు పుణె ప్రాంఛైజీతో ఐపీఎల్లో సందడి చేసింది. ఓ సీజన్లో టైటిల్ పోరు వరకు చేరుకుంది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో అట్లెటికో మోహన్ బగాన్‌ను కొనుగోలు చేసిన గోయెంకా.. గతంలో టేబుల్ టెన్నిస్, బాక్సింగ్ జట్లను సైతం కలిగి ఉన్నాడు. అంతర్జాతీయ ఈక్విటీ, అడ్వజరీ సంస్థ సీవీసీ ఐపీఎల్‌లోకి అడుగుపెట్టింది. యూరోప్, అమెరికా, ఆసియా వ్యాప్తంగా కార్యాలయాలు కలిగిన సీవీసీ గతంలో ఫార్ములా 1 జట్టును సొంతం చేసుకుంది. ఇటీవల స్పెయిన్ ఫుట్‌బాల్ లీగ్ లా లిగాలోనూ కొంత వాటా కొనుగోలు చేసింది. లక్నోలోని అటల్ బిహారి వాజ్‌పేయి స్టేడియం ఆర్పీఎస్జీ గ్రూప్ ప్రాంఛైజీకి సొంత మైదానం కానుండగా, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నరెంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ సీవీసీ గ్రూప్ ప్రాంఛైజీకి సొంత మైదానం అవనుంది. 2022 సీజన్ నుంచి రెండు కొత్త ప్రాంఛైజీలు ఐపీఎల్ రేసులో నిలువనున్నాయి. పది జట్లతో కూడిన ఐపీఎల్ గ్రూప్ దశలో 70 మ్యాచులు, ప్లే ఆఫ్స్‌లో 4 మ్యాచులతో సాగనుంది.