Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహ్మద్షమిపై అతివాదుల ఆన్లైన్ దాడి
- సోషల్ మీడియాలో దూషిస్తూ సందేశాలు
- పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమి ఫలితం
నవతెలంగాణ-న్యూఢిల్లీ
ఐసీసీ మెగా టోర్నీల్లో టీమ్ ఇండియా అంచనాలను అందుకోలేని క్లిష్ట పరిస్థితుల్లో క్రికెటర్ల ఇండ్లపై దాడులు చూశాం. 2007 ఐసీసీ వరల్డ్‌కప్ గ్రూప్ దశ నుంచే భారత్ నిష్క్రమించటంతో క్రికెట్ జెంటిల్మెన్ రాహుల్ ద్రవిడ్, ఎం.ఎస్ ధోని సహా ఇతర క్రికెటర్ల ఇండ్లపై అభిమానుల దాడి మరిచిపోయే సంఘటనలు కావు. అయితే, ఇదంతా ఓ దశాబ్ద కాలానికి ముందు మాట. ఇప్పుడు మనం ఇంటర్నెట్ యుగం ఉన్నాం. అందుకే ట్రెండ్ మారింది. దాడి రూపాంతరం చెందింది. సోషల్ మీడియా వేదికగా విద్వేషం చిమ్ముతూ, మానసికంగా కుంగుబాటుకు లోనయ్యే రీతిలో దూషణల పర్వం మొదలైంది. 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ గ్రూప్ దశ మ్యాచ్ అనంతరం ఇటువంటి దుస్థితి ఎదురైంది. గతంలో ఓటమి చెందిన మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన చేసిన క్రికెటర్లకే పరిమితమైన ఈ దాడులు.. ఇప్పుడు మతం రంగు పులుముకుంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత జట్టులో ఆడిన ఏకైక ముస్లిం క్రికెటర్ మహ్మద్ షమిపై అతివాద జాతీయవాదులు సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నారు. 'మోసగాడు. మా దేశం విడిచి వెళ్లిపో' అంటూ తీవ్రమైన సందేశాలు మహ్మద్ షమి సోషల్ మీడియా ఖాతాలపై ఉంచారు. టోక్యో ఒలింపిక్స్ సెమీఫైనల్లో భారత మహిళల హాకీ జట్టు ఓటమికి జట్టులో దళిత క్రీడాకారిణి వందన కటారియ ఉండటమే కారణమని ఆమె ఇంటి దగ్గర కొందరు వ్యక్తులు గొడవ చేసిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్‌లో కుల వివక్ష, వరల్డ్‌కప్‌లో మత వివక్ష దుమారం రేగినా ప్రభుత్వం స్పందించకపోవటం శోచనీయం.
జట్టుగా ఓడారు! : ఐసీసీ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ది అజేయ రికార్డు. తొలిసారి టీమ్ ఇండియా దాయాది చేతిలో ఓడింది. కెప్టెన్ విరాట్ కోహ్లి, యువ బ్యాటర్ రిషబ్ పంత్ మినహా జట్టులో ఎవరూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. పాక్ పేసర్ల విజృంభణకు బ్యాటర్లు తేలిపోయారు. ఇక బౌలింగ్ విభాగంలో ఎవరూ రాణించలేదు. మంచు ప్రభావంతో బంతిపై పట్టు చిక్కక పోవటం అందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. 3.5 ఓవర్లలో మహ్మద్ షమి 43 పరుగులు ఇవ్వగా.. భువనేశ్వర్ కుమార్ 3 ఓవర్లలో 25 పరుగులు, జశ్‌ప్రీత్ బుమ్రా 3 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చారు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 33 పరుగులు, రవీంద్ర జడేజా 4 ఓవర్లలో 28 పరుగులు సమర్పించుకున్నారు. అయినా, కేవలం మహ్మద్ షమిపైనే సోషల్ మీడియాలో అతివాద జాతీయవాదులు విషం కక్కుతున్నారు. మ్యాచ్ అనంతరం పాక్ ఓపెనర్లను విరాట్ కోహ్లి అభినందించగా.. పాక్ క్రికెటర్లతో ఎం.ఎస్ ధోని ఆత్మీయంగా ముచ్చటించాడు. కోహ్లి, ధోని ఫోటోలతో క్రీడా స్ఫూర్తి గెలిచిందని అభినందిస్తున్నవారే.. అదే పని మహ్మద్ షమి చేస్తే ఏం చేసేవారో ఆలోచనలకు అందటం లేదు!. అద్భుత ఫామ్‌లో ఉన్న భారత క్రికెటర్లు మ్యాచ్‌లో ఫేవరేట్లుగా బరిలో నిలిచినా.. పాకిస్థాన్ క్రికెటర్లు అసమాన ప్రదర్శనతో విజయం దక్కించుకున్నారు. బలాబలాలతో నిమిత్తం లేకుండా ఆటలో గెలుపోటములు సహజం.
ఇటీవల పాకిస్థాన్ చేతిలో ఎదురైన రెండో ఓటమి ఇది. 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ 180 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. ఆ తర్వాత ఇరు జట్లు తలపడిన తొలి మ్యాచ్ టీ20 ప్రపంచకప్‌లోనే. న్యూజిలాండ్ జట్టు అర్థాంతరంగా పాక్ పర్యటనను రద్దు చేసుకోవటం.. ఇంగ్లాండ్ సైతం అదే బాటలో నడవటంతో పీసీబీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రపంచకప్‌లో భారత్ సహా ఇతర అగ్ర జట్లను ఓడించి సత్తా చాటాలనే కసి పాక్ శిబిరంలో ప్రస్ఫుటం. పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా సైతం ఆటగాళ్లలో అదే నూరిపోశాడు. అత్యుత్తమ జట్టుగా నిలిస్తేనే అన్ని జట్లు పాక్‌తో ఆడేందుకు ముందుకొస్తాయని బాబర్‌సేన భావిస్తోంది. అందుకే పాకిస్థాన్ జట్టు 'మేమున్నాం, మేముంటాం' నినాదంతో టీ20 ప్రపంచకప్ వేటను ఆరంభించింది. భారత క్రికెటర్ మహ్మద్ షమిపై సోషల్ మీడియా విద్వేషంపై మాజీ క్రికెటర్లు స్పందించారు. వీరెందర్ సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, హర్బజన్‌సింగ్, యుజ్వెంద్ర చాహల్‌లు షమికి మద్దతుగా నిలిచారు.
పాక్‌తో మ్యాచ్‌లో ఓడిన 11 మంది ఆటగాళ్లలో మహ్మద్ షమి ఒకడు. మైదానంలో ఉన్నది షమి ఒక్కడే కాదు. మహ్మద్ షమిపై సోషల్ మీడియా విద్వేషానికి, ట్రోలింగ్‌కు వ్యతిరేకంగా నిలబడకపోతే టీమ్ ఇండియా 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' మద్దతుకు అర్థమే ఉండదు'
- ఒమర్ అబ్దుల్లా, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం
భారత్, పాక్ మ్యాచుల్లో నేనూ ఆడాను. మేమూ పాక్ చేతిలో ఓడినా ఎన్నడూ దేశం విడిచి వెళ్లాలనే విద్వేషం ఎదురవలేదు. నేను మాట్లాడేది గత కొన్నేండ్ల పరిస్థితి గురించే. ఈ చెత్తకు ముగింపు అవసరం'
- ఇర్ఫాన్ పఠాన్
మహ్మద్ షమిపై ఆన్లైన్ దాడి షాక్‌కు గురి చేసింది. నేను షమికి మద్దతుగా నిలుస్తాను. అతడు ఓ చాంపియన్. భారత జెర్సీ ధరించే ఏ ఆటగాడి గుండెల్లోనైనా ఆన్లైన్ మూకల కంటే ఎక్కువ భారతీయత ఉంటుంది. మేము నీతో ఉన్నాం షమి. వచ్చే మ్యాచ్‌లో నీ సత్తా చూపింపు'
- వీరెందర్ సెహ్వాగ్