Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పనున్న విరుద్ధ ప్రయోజనాల ముప్పు
కోల్‌కత: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి మరోసారి విరుద్ధ ప్రయోజనాల సెగ తగిలింది!. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లోని అట్లెటికో డీ కోల్‌కత మోహన్ బగాన్ ఫుట్‌బాల్ క్లబ్ డైరెక్టర్‌గా గంగూలీ కొనసాగుతున్నారు. సంజీవ్ గోయెంకాకు చెందిన ఆర్పీఎస్జీ సంస్థ ఈ క్లబ్ యజమాని. గంగూలీకి సైతం స్వల్ప వాటా ఉంది. ఈ సంస్థ తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో లక్నో ప్రాంఛైజీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం బోర్డు ఏదేని సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటే.. సదరు సంస్థతో ఆఫీస్ బేరర్లకు ఎటువంటి సంబంధం ఉండకూడదు. బీసీసీఐ అధ్యక్షుడిగా, ఏటీకే మోహన్ బగాన్ డైరెక్టర్‌గా గంగూలీ విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలు ఎదుర్కొవడానికి ముందే.. దాదా ఏటీకే మోహన్ బగాన్ డైరెక్టర్‌గా వైదొలగనున్నాడు. ఈ విషయాన్ని ఆర్పీఎస్జీ అధిపతి సంజీవ్ గోయెంకా వెల్లడించారు. గంగూలీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
సీవీసీ క్యాపిటల్స్‌పై దుమారం! : ఐపీఎల్ ప్రాంఛైజీల వేలంలో అహ్మదాబాద్ ప్రాంఛైజీని దక్కించుకున్న సీవీసీ క్యాపిటల్స్ సంస్థపై వ్యతిరేక వార్తలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ ఈక్విటీ, అడ్వజరీ సంస్థగా సీవీసీకి ప్రపంచ వ్యాప్తంగా కార్యాలయాలు ఉన్నాయి. అమెరికా, యూరోప్ దేశాల్లోని బెట్టింగ్ కంపెనీల్లో సీవీసీ క్యాపిటల్స్ పెట్టుబడులు పెట్టిందనే కారణంతో ఆ సంస్థ దక్కించుకున్న ప్రాంఛైజీ హక్కులపై బీసీసీఐ పునరాలోచన చేసే అవకాశం ఉందని ఓ వార్త కథనం వెలువడింది. అంతర్జాతీయ సంస్థగా భిన్న దేశాల్లో వ్యాపారం నిర్వహించుకునే సీవీసీ క్యాపిటల్స్ ఆ దేశ చట్టాలకు అనుగుణంగానే నడుచుకుంటోంది. విదేశాల్లో బెట్టింగ్ చట్ట బద్దం కావటంతో ఆ సంస్థల్లో సీవీసీ పెట్టుబడి పెట్టింది. బెట్టింగ్ నిజానికి మన అవగాహన, అంచనాలకు సంబంధించిన విషయం, మ్యాచ్ ఫిక్సింగ్‌తో బెట్టింగ్‌ను చూడవద్దని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. భారత చట్టాలకు లోబడి భారత్‌లో పనిచేసినంత వరకు సీవీసీ క్యాపిటల్స్‌కు ఎటువంటి ఇబ్బంది ఉండదనే అభిప్రాయం సదరు అధికారి వెల్లడించారు. వాన్ ఇన్ బిడ్డింగ్ ప్రక్రియలో అన్ని సంస్థల వ్యాపార లావాదేవీలు, వార్షిక ఆదాయం, సంస్థ పూర్తి వివరాలపై బీసీసీఐ అధికారులు సుదీర్ఘ పరిశీలిన జరిపిన సంగతి తెలిసిందే.