Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, న్యూజిలాండ్‌లకు చావోరేవో
- సెమీస్ రేసులో అమీతుమీ తప్పదు
భారత్, న్యూజిలాండ్ ఒకే స్థితిలో నిలిచాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ రేసులో గ్రూప్-బి నుంచి పాకిస్థాన్ ఓ బెర్త్ లాంఛనం చేసుకుంది. మరో బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ మధ్య పోటీ నెలకొంది. దీంతో ఈ రెండు జట్లు తలపడే ముఖాముఖి మ్యాచ్‌ను క్వార్టర్‌ఫైనల్ పోరుగా చూడవచ్చు!
నవతెలంగాణ క్రీడావిభాగం
బలమైన జట్ల మధ్య సమరం రసవత్తరంగా సాగుతుంది. ఓ మ్యాచ్‌లో తడబాటుకు గురైనా.. మరో మ్యాచ్‌లో పుంజుకునే అవకాశం దక్కుతుంది. 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-1కు ఇది వర్తిస్తుంది. ఈ గ్రూప్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు సెమీస్ బెర్త్ కోసం పోటీపడుతున్నాయి. కానీ గ్రూప్-2లో మూడు బలమైన జట్లు, మూడు బలహీన జట్లు ఉండటంతో సెమీఫైనల్ రేసు వాస్తవికంగా మూడు జట్ల నడుమే సాగుతోంది. ఈ క్రమంలో వరల్డ్ నం.2, వరల్డ్ నం.4 జట్లను వరల్డ్ నం.3 జట్టు పాకిస్థాన్ ఓడించింది. భారత్‌పై పది వికెట్ల తేడాతో గెలుపొందిన పాక్, న్యూజిలాండ్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. భారీ విజయాలతో నెట్ రన్‌రేట్‌ను భారీగా పెంచుకుంది. గ్రూప్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్లోకి అడుగుపెడతాయి. గ్రూప్-2లో అఫ్గనిస్థాన్, స్కాట్లాండ్, నమీబియాలు మరో మూడు జట్లు. ఈ మూడు జట్లపై భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్ విజయాలు దాదాపు ఖాయం. పొట్టి క్రికెట్లో అద్భుతాలు జరిగేందుకు ఆస్కారం మరీ ఎక్కువ. ఈ లెక్కన ఈ మూడు జట్లలో ఏ జట్టు అగ్ర జట్లపై విజయం సాధించినా.. అది సెమీఫైనల్ రేసును మరింత ఆసక్తికరం చేయనుంది. భారత్, న్యూజిలాండ్ అక్టోబర్ 31న దుబారు వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అనధికారిక క్వార్టర్ఫైనల్గా మారింది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టును సెమీఫైనల్స్ బెర్త్ వరించనుంది. ఓడిన జట్టు గ్రూప్ దశ నుంచే నిష్క్రమించాల్సి ఉంటుంది. అగ్ర జట్లు భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్‌లు పసికూనలు అఫ్గనిస్థాన్, నమీబియా, స్కాట్లాండ్లపై గెలుపొందాయని అనుకుంటే గ్రూప్-బి సెమీఫైనల్స్ సమీకరణం ఏ విధంగా ఉంటుందో చూద్దాం.
1.కివీస్‌పై భారత్ గెలిస్తే..!: భారత్, న్యూజిలాండ్ ముఖాముఖి మ్యాచ్‌లో కోహ్లిసేన కివీస్‌పై విజయం సాధిస్తే అప్పుడు టీమ్ ఇండియా ఖాతాలో 8 పాయింట్లు చేరతాయి. (అఫ్గాన్, స్కాట్లాండ్, నమీబియాలపై విజయాలు సైతం పరిగణనలోకి తీసుకుంటే). దీంతో న్యూజిలాండ్ ఆరు పాయింట్లు మాత్రమే సాధిస్తుంది. పాకిస్థాన్ 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచినా, రెండో స్థానంలో నిలిచి భారత్ సెమీస్‌కు చేరనుంది.
2. భారత్‌పై కివీస్ గెలిస్తే..! : ఒకవేళ భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌లో విలియమ్సన్ సేనదే పైచేయి అనుకుందాం. అప్పుడు కివీస్ ఖాతాలో 8 పాయింట్లు చేరతాయి. భారత్ ఆరు పాయింట్లతో నిలుస్తుంది. పాక్‌తో పాటు న్యూజిలాండ్ సెమీస్‌కు చేరుకుంటుంది. గ్రూప్ దశ నుంచే భారత్ నిష్క్రమించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. పై రెండు సందర్భాల్లోనూ అఫ్గాన్, నమీబియా, స్కాట్లాండ్లపై అగ్ర జట్ల విజయాలను స్వేచ్ఛగా తీసుకున్నాం. పసికూన జట్లు తమదైన రోజున విజృంభించి అగ్ర జట్లలోని టాప్-2 స్థానాల్లో నిలిచిన వారిపై విజయం సాధిస్తే అప్పుడు సెమీస్ సమీకరణం రక్తి కట్టనుంది. అప్పుడూ భారత్, కివీస్ మ్యాచ్‌లో ఓడిన జట్టుకు సైతం సెమీస్ ద్వారాలు తెరిచే ఉంటాయి. పసికూన జట్లపై గెలుపు అంతరం నెట్‌రన్‌రేట్ ఆధారంగా రెండో స్థానం తేలుతుంది.
ఐసీసీ ర్యాంకింగ్స్ పరంగా న్యూజిలాండ్ కంటే భారత్ మెరుగైన స్థానంలో ఉంది. కానీ టీ20 ఫార్మాట్లో టీమ్ ఇండియాపై బ్లాక్‌క్యాప్స్‌కు స్పష్టమైన ఆధిపత్యం ఉంది. ఈ ఫార్మాట్లో భారత్, న్యూజిలాండ్ 16 సార్లు ముఖాముఖి తలపడగా కివీస్ 8 మ్యాచుల్లో విజయాలు సాధించింది. భారత్ ఆరు విజయాలు సాధించగా, రెండు మ్యాచులు టై అయ్యాయి. ఐసీసీ టోర్నీల్లో ఇటీవల భారత్‌పై కివీస్ మంచి రికార్డు కలిగి ఉంది. 2021 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో కోహ్లిసేనపై విజయంతో విశ్వవిజేతగా నిలిచింది న్యూజిలాండ్. 2019 వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో భారత్‌పై కివీస్ గెలుపొందింది. 2016 టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లోనూ ఆతిథ్య జట్టు భారత్‌కు కివీస్ షాకిచ్చింది. 2007 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై న్యూజిలాండ్ విజయం సాధించింది. చివరగా 2003 వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌పై భారత్ గెలుపొందింది.