Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోచ్‌పై ఆరోపణలు మిస్‌ఫైర్!
న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనిక బత్ర ఇరకాటంలో పడింది!. ఈ ఏడాది మార్చిలో దోహాలో జరిగిన ఒలింపిక్ క్వాలిఫయర్‌లో సహచర క్రీడాకారిణి సుతీర్థ ముఖర్జీకి మ్యాచ్‌ను కోల్పోవాలని టేబుల్ టెన్నిస్ కోచ్ సౌమ్యదీప్ రారు ఒత్తిడి తీసుకొచ్చినట్టు మనిక బత్ర తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ మ్యాచ్‌లో విజయంతో దక్షిణాసియా కోటాలో సుతీర్థ ఒలింపిక్స్‌కు అర్హత సాధించగా, మెరుగైన ర్యాంక్‌తో మనిక టోక్యో బెర్త్ సాధించింది. ఈ వ్యవహారంపై హైకోర్టు ఆదేశాలతో క్రీడా మంత్రిత్వ శాఖ విచారణ కమిటీ వేయగా, టేబుల్ టెన్నిస్ సంఘం సైతం స్వీయ విచారణ జరుపుతోంది. ఈ విషయంలో ఓ నివేదికను అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్యకు అందజేశారు. ఈ నివేదికలోని అంశాలు మనిక బత్రను ఇరకాటంలో పడేయనున్నాయి. సుతీర్థతో మ్యాచ్ అనంతరం మనిక బత్ర కోచ్ సన్మరు ఓ మాజీ ఆటగాడికి పంపిన మెసేజ్ ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ' మనికపై గౌరవం రెట్టింపైంది. కఠోర శ్రమతో, ఎన్నో సవాళ్లు అధిగమించి ఉన్నత స్థాయికి చేరినా సుతీర్థకు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. మనిక తీసుకున్న నిర్ణయం గొప్పది' అని సన్మరు మెసేజ్ చేశారు. మనిక, సుతీర్థ మ్యాచ్‌కు అంపైరింగ్ చేసిన అధికారి వ్యాఖ్యలు సైతం ఆసక్తికరంగా ఉన్నాయి. 'మార్చి 18న మ్యాచ్‌కు ముందు నేను చూసిన విషయాలనే పంచుకుంటాను. ఇద్దరు అమ్మాయిలు ఒలింపిక్స్‌కు వెళ్తున్నారా? అని నేను అడుగగా.. మీ అంచనా నిజమేనని సన్మరు బదులిచ్చారు' అని ఆ అధికారి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా మనిక బత్ర వ్యవహరించినట్టు స్పష్టమైన ఆధారాలు ఉండటంతో భారత టేబుల్ టెన్నిస్ సంఘం, మనిక బత్ర, ఆమె కోచ్‌పైనా అంతర్జాతీయ సమాఖ్య చర్యలు తీసుకునే అవకాశం ఉంది.