Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేరు మార్పు వినతుల వివరాలపై క్రీడాశాఖ మౌనం
- ఈ ఏడాది 11 మందికి ఖేల్‌రత్న పురస్కారాలు
న్యూఢిల్లీ: భారత అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌రత్న పురస్కారం పేరు మార్చుతూ టోక్యో ఒలింపిక్స్ జరుగుతున్న సమయంలో ప్రధాన మంత్రి నరెంద్ర మోడీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దేశ ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డును మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న పురస్కారంగా మార్పు చేస్తున్నట్టు మోడీ ట్వీట్ చేశారు. సహజంగా అవార్డుల పేరు మార్పు, విధానాలపై కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. భారత ఒలింపిక్ సంఘం, జాతీయ క్రీడా సమాఖ్యలు, భారత క్రీడా ప్రాధికారిక సంస్థ (శారు) సహా రాష్ట్రాలతో సంప్రదింపులు, అభిప్రాయాలు తీసుకోకుండా ప్రతిష్టాత్మక అవార్డు పేరు మార్పు చేసినట్టు తెలుస్తోంది. ఖేల్‌రత్న పురస్కారం పేరు మార్పు కోరుతూ వచ్చిన వినతుల వివరాలను సమాచార హక్కు చట్టం కింద కోరగా.. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వద్ద అటువంటి సమాచారమేమీ లేదని తెలిసింది. ప్రధాని ట్వీట్ ఆధారంగానే అవార్డు పేరు మార్పు చేస్తున్నట్టు మంత్రిత్వ శాఖ కార్యాలయం పత్రాల్లో పొందుపరిచింది. రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న పురస్కారం పేరు మార్పు అంశాన్ని గతంలో అవార్డుల కమిటీ పరిశీలించింది. భారతీయ ఖేల్‌రత్న పురస్కారం పేరు సూచించినా.. అది అమల్లోకి రాలేదు. ఇప్పటికే ధ్యాన్‌చంద్ పేరిటి జీవన కాల సాఫల్య పురస్కారం ఇస్తున్నారు. తాజాగా ఖేల్‌రత్నకు ధ్యాన్‌చంద్ పేరు పెట్టడంతో, ఇప్పటికే ఉన్న ధ్యాన్‌చంద్ పురస్కారం పేరును సైతం మార్చాల్సిన అవసరం ఏర్పడింది. దీని కోసం క్రీడా మంత్రిత్వ శాఖ మిల్కాసింగ్ అవార్డు పేరును ప్రతిపాదించినా ఆమోదం పొందాల్సి ఉంది. భారత దిగ్గజ క్రీడాకారుడు, హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్‌కు 'భారతరత్న' ప్రకటించాలని ప్రజలు, క్రీడాకారుల నుంచి భారీగా విజ్ఞప్తులు వచ్చాయి. భారతరత్న డిమాండ్‌ను పట్టించుకోని మోడీ.. అసలు రికార్డుల్లో లేని పేరు మార్పు సూచనలతో ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న పురస్కారంగా మార్చారు.
రికార్డు ఖేల్రత్నలు : ఒలింపిక్ ఏడాదిలో రికార్డు ఖేల్రత్నలు ప్రదానం చేయనున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులు ఈ ఏడాది ఖేల్‌రత్న అందుకోనున్నారు. పసిడి పతకం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, రజతం సాధించిన రవి దహియా, కాంస్యం సాధించిన లవ్లినా బొర్గొహైన్ సహా పారా అథ్లెట్లు అవని లేఖర, ప్రమోద్ భగత్, సుమిత్ అంతిల్, క్రిష్ట నగార్, నర్వాలు ఖేల్‌రత్న అవార్డుకు సిఫారసు చేయబడ్డారు. మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్, ఫుట్‌బాల్ స్టార్ సునీల్ ఛెత్రి, వెటరన్ హాకీ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్‌లు సైతం ప్రతిష్టాత్మక పురస్కారానికి సిఫారసు చేయబడ్డారు. మేజర్ ధ్యాన్‌చంద్ జన్మదినం ఆగస్టు 29న భారత్ జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటుంది. అదే రోజు జాతీయ క్రీడా పురస్కారాలను ప్రదానం చేస్తారు. ఈ ఏడాది టోక్యో పారాలింపిక్స్ ఉండటంతో అవార్డుల వేడుకను క్రీడా మంత్రిత్వ శాఖ వాయిదా వేసింది. త్వరలోనే అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని ప్రకటించనున్నారు.