Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్లాక్ లైవ్స్ మ్యాటర్‌కు మనస్ఫూర్తిగా మద్దతు
- వివాదానికి తెరదించిన సఫారీ క్రికెటర్ డికాక్
షార్జా (యుఏఈ)
దక్షిణాఫ్రికా క్రికెట్లో రేగిన వివాదానికి వికెట్ కీపర్, బ్యాటర్ క్వింటన్ డికాక్ తెరదించాడు. జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమానికి సంఘీభావంగా 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' నినాదంతో క్రికెటర్లు మోకాలిపై కూర్చోవాలని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఆదేశించింది. టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు ముందు బోర్డు ఆదేశాలు రావటంతో క్వింటన్ డికాక్ ఆ మ్యాచ్‌కు దూరమయ్యాడు. బోర్డు నిర్ణయంతో విభేదిస్తూ బెంచ్‌కు పరిమితం అయ్యాడు. జాతి వివక్ష అంశంలో దక్షిణాఫ్రికా చరిత్ర దృష్ట్యా ఈ ఉద్యమానికి మద్దతుగా నిలువటం అవసరమని సఫారీ బోర్డు నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయం తీసుకునే ముందు ఆటగాళ్లతో సంప్రదించకుండా, ఏకపక్షంగా తేల్చటంపై డికాక్ అసంతృప్తికి లోనైనట్టు వెల్లడించాడు. బోర్డు ఉన్నతాధికారులతో భావోద్వేగంగా మాట్లాడిన డికాక్.. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి సంఘీభావంగా మోకాలిపై కూర్చునేందుకు అంగీకారం తెలిపాడు. ఈ మేరకు డికాక్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశాడు.
ఆ వ్యాఖ్యలు బాధించాయి
' ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం, మనస్తాపం, సందిగ్ధతకు కారణమైనందుకు ముందుగా క్షమాపణలు. ఎంతో ముఖ్యమైన ఈ అంశంపై ఇన్నాండ్లూ నేను మౌనంగా ఉన్నాను. ఈ విషయంలో నేను కొంత వివరంగా మాట్లాడాల్సి అవసరం ఏర్పడింది. దక్షిణాఫ్రికా జట్టు వరల్డ్‌కప్‌కు ఎప్పుడు వెళ్లినా ఏదో ఒక నాటకీయత ఉంటుంది. ఇది అంత మంచిది కాదు. ఈ సమయంలో మద్దతుగా నిలిచిన సహచర క్రికెటర్లు, సహాయక సిబ్బంది, కెప్టెన్ బవుమాకు కృతజ్ఞతలు. ప్రజలు గుర్తించకపోవచ్చు కానీ బవుమా మంచి నాయకుడు. దక్షిణాఫ్రికా జట్టులో నేను ఉండాలని అతడు భావిస్తే దేశం తరఫున ఆడేందుకు ఎంతగానో సంతోషిస్తాను. నా కుటుంబ నేపథ్యం చాలా మందికి తెలియదు. నేను మిశ్రమ కుటుంబం నుంచి వచ్చాను. నా పినతల్లి నల్ల జాతీయురాలు. నా చెల్లెళ్లు శ్వేత-నల్లజాతీయులు. ఇప్పుడేదో అంతర్జాతీయంగా ఉద్యమం నడుస్తుందని కాదు.. నా వరకు, నా పుట్టుకతోనే నాకు బ్లాక్ లైవ్స్ మ్యాటర్. మనుషులు అందరికీ హక్కులు ఉంటాయి, అవి అత్యంత ప్రధానమైనవే సృహతోనే నేను పెరిగాను. ఏకపక్షంగా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అంశంలో బోర్డు నిర్ణయం నా హక్కులను హరించిందని భావించాను. బోర్డుతో భావోద్వేగంగా సాగిన సంభాషణల్లో దీని వెనుక పూర్తి ఉద్దేశాలు అర్థమయ్యాయి. వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు ముందు పరిస్థితి జరిగి ఉండాల్సింది కాదు. ఈ అవగాహన ముందే ఉండాల్సింది. ఓ సంకేతంతో నా నిబద్దతను నిరూపించుకోవటం నాకు అర్థం కాలేదు. నాతో కలిసి పెరిగిన వాళ్లు, నా గురించి బాగా తెలిసిన వాళ్లు, స్నేహితులు సైతం ఈ విషయంలో అపార్థం చేసుకున్నారు. ఇవేవీ నన్ను బాధ పెట్టలేదు. కానీ నేను జాత్యంహకారిని అనే మాటలు నన్ను బాధించాయి. గర్భంతో ఉన్న నా భార్యను, నా కుటుంబాన్ని ఆ వ్యాఖ్యలు బాధపెట్టాయి. నేను జాత్యంహకారిని కాదు. నా మనసుకు ఆ విషయం తెలుసు. బ్లాక్ లైవ్స్ మ్యాటర్‌కు మద్దతుగా మోకాలి కూర్చోని సంఘీభావం తెలుపటంతో ప్రజల్లో అవగాహన వస్తుందంటే నేను అందుకు సిద్ధమే' అని క్వింటన్ డికాక్ ఓ ప్రకటనలో తెలిపాడు.