Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెట్ సెషన్లో చెమటోడ్చిన బౌలర్లు
- కీలక పోరు ముంగిట కోహ్లిసేన కసరత్తులు
నవతెలంగాణ-దుబాయ్
ఆతిథ్య జట్టుగా టీ20 ప్రపంచకప్‌ను స్వదేశం తీసుకురావాలనే సంకల్పంతో పొట్టి కప్పు వేట మొదలుపెట్టిన టీమ్ ఇండియా ఆ దిశగా తొలి ప్రయత్నంలోనే ఊహించని షాక్ చవిచూసింది. మూడు బలమైన జట్లు, మూడు బలహీన జట్లతో కూడిన గ్రూప్-2లో పాకిస్థాన్ చేతిలో ఓటమి టీమ్ ఇండియా సెమీఫైనల్స్ అవకాశాలపై ప్రభావం చూపిస్తోంది. అటు న్యూజిలాండ్, ఇటు భారత్‌లపై పాకిస్థాన్ వరుస విజయాలు సాధించి గ్రూప్-2 నుంచి తొలి సెమీస్ బెర్త్‌పై కన్నేసింది. దీంతో రెండో సెమీస్ బెర్త్ కోసం న్యూజిలాండ్, భారత్ నడుమ పోటీ నెలకొంది. ఈ రెండు జట్లు ఆదివారం దుబారు వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టుకు రెండో సెమీఫైనల్ బెర్త్ రేసులో మెరుగైన అవకాశాలు ఉండనున్నాయి. దీంతో భారత్, న్యూజిలాండ్ పోరును క్వార్టర్ఫైనల్గా పరి గణిస్తున్నారు. కోహ్లిసేన చావోరేవో తేల్చుకోవాల్సిన కీలక మ్యాచ్‌కు ముందు బీచ్ వాలీబాల్ ఆడుతూ వార్మప్ చేసింది. భారత క్రికెటర్లు అందరూ బీచ్ వాలీబాల్ ఆడుతున్న వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో ఉంచింది. అంతకముందు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పర్యవేక్షణలో పేసర్లు బౌలింగ్ సాధన చేశారు. భువనేశ్వర్ కుమార్, జశ్‌ప్రీత్ బుమ్రా, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమిలు నెట్స్‌లో చెమటోడ్చారు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య సైతం నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించాడు. నాకౌట్ మ్యాచుల్లో హార్దిక్ బౌలింగ్ సేవలను కోహ్లిసేన వాడుకుంటుందని తొలుత భావించారు. కివీస్‌తో మ్యాచ్ భారత్ నాకౌట్ తరహా సమరం కావటంతో ఆదివారం న్యూజిలాండ్‌పై హార్దిక్ పాండ్య బంతి అందుకునే అవకాశం కనిపిస్తోంది.