Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్ రేసు నుంచి బంగ్లాదేశ్ అవుట్
- 143 పరుగుల స్వల్ప ఛేదనలో చతికిల
- ఉత్కంఠ పోరులో వెస్టిండీస్ మెరుపు విజయం
ఉత్కంఠగా సాగిన స్వల్ప స్కోర్ల థ్రిల్లర్‌లో కరీబియన్లు ఖతర్నాక్ విజయం సాధించారు. 143 పరుగుల ఛేదనలో బంగ్లాదేశ్‌ను సమర్థవంతంగా నిలువరించారు. చివరి ఓవర్లలో పరుగుల వేటలో చతికిల పడిన బంగ్లా పులులు 3 పరుగుల తేడాతో పరాజయం పాలయ్యారు. గ్రూప్ దశలో వరుసగా మూడో ఓటమితో సెమీఫైనల్స్ రేసు నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమించింది. తొలి విజయంతో వెస్టిండీస్ సెమీస్ రేసులో ఆశలు సజీవంగా నిలుపుకుంది!.
నవతెలంగాణ-షార్జా
బంగ్లాదేశ్ లక్ష్యం 143 పరుగులు. టాప్ ఆర్డర్లో లిటన్ దాస్ (44, 43 బంతుల్లో 4 ఫోర్లు), లోయర్ ఆర్డర్లో మహ్మదుల్లా (31 నాటౌట్, 24 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా ఆ జట్టుకు భంగపాటు తప్పలేదు. 10 ఓవర్లలో 48/2తో నిలిచిన బంగ్లాదేశ్ చివరికి 139/5 వద్ద ఆగిపోయింది. చివరి 11 బంతుల్లో 16 పరుగులు చేయాల్సి ఉండగా..మహ్మదుల్లా, లిటన్ దాస్ అంచనాలను అందుకోలేదు. సూపర్12 గ్రూప్-1లో హ్యాట్రిక్ పరాజయం చవిచూసిన బంగ్లాదేశ్ ఐసీసీ 2021 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ రేసు నుంచి నిష్క్రమించింది. బౌలర్లకు సహకరించిన పిచ్‌పై నికోలస్ పూరన్ (40, 22 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు), జేసన్ హోల్డర్ (15 నాటౌట్, 5 బంతుల్లో 2 సిక్స్‌లు) వెస్టిండీస్‌కు పోరాడగలిగే స్కోరు అందించారు. ధనాధన్ ఇన్నింగ్స్‌లో రెండు జట్ల మధ్య వ్యత్యాసం చూపించిన నికోలస్ పూరన్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. గ్రూప్ దశలో తొలి రెండు మ్యాచుల్లో ఓడిన వెస్టిండీస్‌కు ఇదే తొలి విజయం కావటం విశేషం.
బంగ్లా చతికిల : స్వల్ప ఛేదనలో బంగ్లాదేశ్ మెరుగ్గానే కనిపించినా.. చివర్లో బోల్తా పడింది. స్టార్ బ్యాటర్ షకిబ్ అల్ హసన్ (9) త్వరగా నిష్క్రమించినా లిటన్ దాస్ (44), మహ్మద్ నయీం (17), సౌమ్య సర్కార్ (17)లు బంగ్లాదేశ్‌ను రేసులో నిలిపారు. తొలి పది ఓవర్లలో 48/2తో నిలిచిన బంగ్లాదేశ్.. ఆఖర్లో శక్తి మించిన పని నిలుపుకుంది. ముష్ఫీకర్ రహీం (8) విఫలమవగా మహ్మదుల్లా (31 నాటౌట్) ధనాధన్ షో చూపించేందుకు ప్రయత్నించాడు. చివరి 11 బంతుల్లో బంగ్లాదేశ్ విజయానికి 16 పరుగులు అవసరం. జోరుమీదున్న లిటన్ దాస్, మహ్మదుల్లా క్రీజులో ఉండటంతో బంగ్లా విజయం ఖాయమే అనిపించింది. కానీ చివరి రెండు ఓవర్లలో బ్రావో, రసెల్‌లు బంగ్లాదేశ్‌ను నిలువరించారు. చివరి వరకు పోరాడిన బంగ్లాదేశ్ గెలుపు గీతకు మూడు పరుగుల దూరంలో ఆగిపోయింది. వెస్టిండీస్ బౌలర్లలో అందరూ ఓ వికెట్ పడగొట్టారు. జేసన్ హోల్డర్ ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు.
పూరన్, హోల్డర్ జోరు : బౌలర్లకు సహకరించిన షార్జా పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌కు పరుగులు అంత సులువుగా రాలేదు. 12.4 ఓవర్లలో వెస్టిండీస్ 62/4తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. క్రిస్ గేల్ (4), ఎవిన్ లూయిస్ (6), షిమ్రోన్ హెట్మయర్ (9), అండ్రీ రసెల్ (0)లు విఫలమయ్యారు. కెప్టెన్ కీరన్ పొలార్డ్ (14 నాటౌట్, 18 బంతుల్లో 1 సిక్స్) క్రీజులో తడబాటుకు లోనయ్యాడు. ఈ సమయంలో నికోలస్ పూరన్ (40) వెస్టిండీస్ ఇన్నింగ్స్ స్వరూపం మార్చివేశాడు. నాలుగు సిక్సర్లతో విరుచుకుపడిన పూరన్ విండీస్‌కు ఊరట కల్పించాడు. జేసన్ హోల్డర్ (15 నాటౌట్) రెండు సిక్సర్లతో ధనాధన్ షో చూపించాడు. హోల్డర్ మెరుపులతో చివరి 5 బంతుల్లో వెస్టిండీస్ ఏకంగా 19 పరుగులు పిండుకుంది. బ్యాట్‌తో తడబడిన పొలార్డ్ చివరి బంతికి సిక్సర్ బాదాడు. చివరి ఓవర్ పరుగులే బంగ్లాదేశ్ విజయావకాశాలను ప్రతికూలం చేశాయి!.
స్కోరు వివరాలు :
వెస్టిండీస్ ఇన్నింగ్స్ : క్రిస్ గేల్ (బి) మహెది హసన్ 4, ఎవిన్ లూయిస్ (సి) ముష్ఫీకర్ (బి) ముస్తాఫిజుర్ 6, రోస్టన్ ఛేజ్ (సి) ఇస్లాం 39, హెట్మయర్ (సి) సర్కార్ (బి) మహెది హసన్ 9, కీరన్ పొలార్డ్ నాటౌట్ 14, రసెల్ రనౌట్ 0, నికోలస్ పూరన్ (సి) నయీం (బి) ఇస్లాం 40, డ్వేన్ బ్రావో (సి) సర్కార్ (బి) ముస్తాఫిజుర్ 1, జేసన్ హోల్డర్ నాటౌట్ 15, ఎక్స్‌ట్రాలు : 14, మొత్తం : (20 ఓవర్లలో 7 వికెట్లకు) 142.
వికెట్ల పతనం : 1-12, 2-18, 3-32, 4-62, 5-119, 6-119, 7-123.
బౌలింగ్ : మహెది హసన్ 4-0-27-2, టస్కిన్ అహ్మద్ 4-0-17-0, ముస్తాఫిజుర్ రెహమాన్ 4-0-43-2, షోరిఫుల్ ఇస్లాం 4-0-20-2, షకిబ్ అల్ హసన్ 4-0-28-0.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ : మహ్మద్ నయీం (బి) హోల్డర్ 17, షకిబ్ అల్ హసన్ (సి) హోల్డర్ (బి) రసెల్ 9, లిటన్ దాస్ (సి) హోల్డర్ (బి) బ్రావో 44, సౌమ్య సర్కార్ (సి) గేల్ (బి) హోసేన్ 17, ముష్ఫీకర్ రహీం (బి) రాంపాల్ 8, మహ్మదుల్లా నాటౌట్ 31, అటిఫ్ హోస్సెన్ నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 139.
వికెట్ల పతనం : 1-21, 2-29, 3-60, 4-90, 5-130.
బౌలింగ్ : రవి రాంపాల్ 4-0-25-1, జేసన్ హోల్డర్ 4-0-22-1, అండ్రీ రసెల్ 4-0-29-1, హోసేన్ 4-0-24-1, డ్వేన్ బ్రావో 4-0-36-1.