Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబాయ్ : పాకిస్థాన్ చేతిలో పరాజయం అనంతరం పేస్ బౌలర్ మహ్మద్ షమిపై సోషల్ మీడియాలో దుమారం రేపిన మత విద్వేషంపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందించాడు. బయటి వ్యక్తుల అభిప్రాయాలు, విమర్శలకు టీమ్ ఇండియాలో విలువ ఉండదని స్పష్టం చేశాడు. ' మత విశ్వాసం ఆధారంగా ఓ వ్యక్తిపై విమర్శలు చేయటం అత్యంత నీచమైన పని. ప్రతి అంశంపై అభిప్రాయాలు వెల్లడికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. కానీ మత వివక్ష, విద్వేషం నేను ఊహించలేదు. మతం వ్యక్తిగత పవిత్ర విశ్వాసం, దానిని అక్కడి వరకే చూడాలి' అని విరాట్ కోహ్లి అన్నాడు. ఊరు, పేరు లేని వ్యక్తులు సోషల్ మీడియాలో చేసే విమర్శలపై స్పందించి ఒక్క నిమిషం కూడా వృథా చేయనని కోహ్లి ఘాటుగా స్పందించాడు. ' మహ్మద్ షమి భారత్‌కు ఎన్నో విజయాలు అందించాడు. టెస్టు క్రికెట్లో బుమ్రా తోడుగా షమి భారత ప్రధాన పేసర్. దేశానికి షమి చేసిన సేవలను విమర్శకులు మరిచిపోతే, ఆ విమర్శకుల గురించి ఆలోచన వ్యర్థం. టీమ్ ఇండియా షమికి మద్దతుగా ఉంది. 200 శాతం షమి తోడుగా ఉన్నాం. షమిపై మరింత విద్వేషం చిమ్మాలని చూసినా.. జట్టులో అతడి పట్ల సోదరభావం, స్నేహభావంలో ఎటువంటి మార్పు ఉండదు. ఇటువంటి అంశాలు లేని డ్రెస్సింగ్‌రూమ్ సంస్కృతిని టీమ్ ఇండియా డ్రెస్సింగ్‌రూమ్‌లో నెలకొల్పాం. జట్టు నాయకుడిగా ఆ విషయం గట్టిగా చెప్పగలను' అని విరాట్ కోహ్లి అన్నాడు.