Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, న్యూజిలాండ్ ఢి నేడు
- ఓడితే సెమీస్ ఆశలు గల్లంతే!
భారత్, న్యూజిలాండ్ ఢ ప్రపంచ క్రికెట్‌ను ఉర్రూతలూగిస్తున్న సమరం. కోట్లాది అభిమానులు పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను నరాలు తెగే ఉత్కంఠతో చూస్తున్నా.. నిజానికి గత కొన్నేండ్లుగా బ్లాక్‌క్యాప్స్, మెన్ ఇన్ బ్లూ ఆడిన ప్రతిసారి హైవోల్టేజ్తోనే సాగుతోంది. 2019 వరల్డ్‌కప్ సెమీఫైనల్, 2021 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఈ రెండు జట్ల అత్యుత్తమ సమరం కుదిపేసింది. పొట్టి ఫార్మాట్లో ఆడిన చివరి మూడు టీ20ల్లో రెండు మ్యాచులు టైగా ముగిశాయి. దీంతో నేడు టీ20 ప్రపంచకప్‌లో భారత్, న్యూజిలాండ్ పోరుపై భారీ అంచనాలు ఉన్నాయి. సెమీస్ దారిలో నేటి మ్యాచ్‌లో విజయం ఇరు జట్లకు కీలకం కావటంతో గ్రూప్-2లో ఈ మ్యాచ్‌ను క్వార్టర్ఫైనల్గా చూడవచ్చు.
నవతెలంగాణ-దుబాయ్
ఇటు కోహ్లిసేన, ఇటు కేన్సేన.. రెండు జట్లూ బాబర్ బృందం చేతిలో అనూహ్య పరాజయాలు చవిచూశాయి. తొలి మ్యాచ్‌లో ఓటమి రెండు జట్లలోని లోపాలను, బలహీనతలను బయట పెట్టడంతో పాటు విలువైన పాఠాలు నేర్పింది. సెమీఫైనల్స్‌కు చేరాలంటే నేటి మ్యాచ్‌లో విజయం తప్పనిసారి కావటం భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌లో మరింత వేడికి కారణమవుతోంది. పొట్టి ఫార్మాట్లో టీమ్ ఇండియాపై కివీస్‌కు మెరుగైన రికార్డున్నా.. గత ఐదేండ్లలో భారత జట్టుదే తిరుగులేని ఆధిపత్యం. అనధికారిక క్వార్టర్ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ నేడు చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి.
పంజా విసురుతారా? : పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కోహ్లిసేన ప్రణాళికలు పారలేదు. న్యూజిలాండ్‌పై భారీ స్కోరు చేసేందుకు పాక్ చేతిలో ఓటమి దారి చూపించింది!. పవర్ ప్లేలో వికెట్లు నిలుపుకుని, చివరి ఓవర్లలో దండిగా పరుగులు పిండుకునే వ్యూహంతో నేడు కోహ్లిసేన రానుంది. ట్రెంట్ బౌల్ట్‌ను రోహిత్, రాహుల్ ఎదుర్కొవటంపై ఆరంభం ఆధారపడి ఉంది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య నేడు బంతితో బాధ్యత తీసుకుంటాడనే అని పిస్తోంది. అతడు బౌలింగ్ చేస్తే కోహ్లి పని సులువు కానుంది. పవర్‌ప్లేలో వరుణ్ పూర్తి ఓవర్లు, డెత్ ఓవర్లలో బుమ్రా ఓవర్లను వినియోగించుకునే వెసులుబాటు లభించనుంది. తొలి మ్యాచ్‌లో ఓటమి తుది జట్టు కూర్పుపై పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదు. సూర్యకుమార్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ల స్థానాల్లో ఇషాన్ కిషన్, శార్దుల్ ఠాకూర్లు తుది జట్టులోకి వచ్చే వీలుంది. మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ తొలి మ్యాచ్‌లో తేలిపోయిన కోహ్లిసేన నేడు పంజా విసరాలని చూస్తోంది.
ఫినీషర్ కొరత! : ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ గొప్ప ప్రదర్శన చేయటం అలవాటుగా మార్చుకుంది!. విధ్వంసకారుడు మార్టిన్ గప్టిల్ ఫామ్‌లోకి వస్తే టాప్ ఆర్డర్ బ్యాటింగ్ కష్టాలు తీరిపోతాయి. డార్లీ మిచెల్‌ను ఓపెనర్‌గా పంపి ధనాధన్‌కు కేన్ వ్యూహం రచిస్తున్నాడు. ప్రత్యర్థి బౌలర్లకు సవాల్ విసురుతున్న డెవాన్ కాన్వేను త్వరగా అవుట్ చేసేందుకు బుమ్రా బృందం సరికొత్త ప్రణాళికలు తయారు చేసుకోవాల్సిందే. అతడు క్రీజులో నిలిస్తే స్కోరు వేగాన్ని అమాంతం పెంచగలడు. గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, టిమ్ సీఫర్ట్ రూపంలో లోయర్ ఆర్డర్లో ముగ్గురు బ్యాటర్లు ఉన్నా.. కివీస్‌కు ఓ సిసలైన ఫినీషర్ లేడు. మ్యాచులను ముగించటంలో కేన్సేనకు ఇది ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది. బౌల్ట్‌తో కలిసి మిల్నె పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. సోధి, శాంట్నర్‌ల రూపంలో ఇద్దరు స్పిన్నర్లను కేన్ తుది జట్టులోకి తీసుకోనున్నాడు.
పిచ్ రిపోర్టు : ఐపీఎల్ సీజన్ నుంచి దుబారు పిచ్ పరిస్థితులు పరిశీస్తూనే ఉన్నాం. 160-170 పరుగులు చేయగలిగితే ఇక్కడ విజయంపై దీమాగా ఉండవచ్చు. టాస్ నెగ్గిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకునేందుకు చూ స్తుంది. ఈ ఏడాది ఇక్కడ జరిగిన 18 మ్యాచుల్లో 14 సార్లు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్టునే విజయం వరించింది. రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్లపై మంచు ప్రభావం ఉండనుంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్/ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమి, వరుణ్ చక్రవర్తి, జశ్‌ప్రీత్ బుమ్రా.
న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్, డార్లీ మిచెల్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, టిమ్ సీఫర్ట్ (వికెట్ కీపర్), మిచెల్ శాంట్నర్, ఆడం మిల్నె, ఇశ్ సోధి, ట్రెంట్ బౌల్ట్.