Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నమీబియాపై భారీ విజయం
అబుదాబి : అఫ్గనిస్థాన్ బౌలర్లు ఆ జట్టుకు మరో భారీ విజయం అందించారు. నమీబియాను 98/9 పరుగులకే పరిమితం చేసిన అఫ్గనిస్థాన్ బౌలర్లు 62 పరుగుల తేడాతో అదిరే విజయం సాధించారు. పేసర్ నవీన్ ఉల్ హాక్ (3/26), హమిద్ హసన్ (3/9), గుల్బాదిన్ (2/19) నిప్పులు చెరగటంతో ఛేదనలో నమీబియా చిత్తుగా ఓడింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్12 గ్రూప్-2లో అఫ్గనిస్థాన్‌కు ఇది రెండో విజయం. అఫ్గాన్ పేసర్ నవీన్ ఉల్ హాక్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
అష్గార్ వీడ్కోలు ఆట : పాకిస్థాన్ చేతిలో పరాజయంతో మనస్థాపానికి లోనైన అఫ్గాన్ మాజీ కెప్టెన్ అష్గార్ అఫ్గాన్ నమీబియాతో మ్యాచ్‌లో కెరీర్ చివరి ఆట ఆడేశాడు. ఈ మ్యాచ్‌తో అష్గార్ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. చివరి ఇన్నింగ్స్‌లో అష్గార్ (31, 23 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) అలరించాడు. ఓపెనర్లు హజరత్ జజారు (33), మహ్మద్ షెహజాద్ (45) తొలి వికెట్‌కు 53 పరుగులు జోడించారు. చివర్లో మహ్మద్ నబి (32 నాటౌట్, 17 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ ముగింపు ఇచ్చాడు.
ఛేదనలో చిత్తు : బలమైన అఫ్గాన్ బౌలర్ల ముందు నమీబియా బ్యాటింగ్ లైనప్ తలొంచింది. మిడిల్ ఆర్డర్లో డెవిడ్ మిసె (26, 30 బంతుల్లో 2 ఫోర్లు) మినహా ఆ జట్టులో ఎవరూ క్రీజులో నిలబడలేదు. విలియమ్స్ (1), మైకల్ (11), జాన్ నికోల్ (14), ఎరాస్మస్ (12), జాన్ గ్రీన్ (1) ప్రపంచ శ్రేణి బౌలింగ్ ముందు దాసోహం అయ్యారు. 20 ఓవర్లలో 9 వికెట్లకు 98 పరుగులు చేసిన నమీబియా ఏ దశలోనూ విజయంపై ఆలోచనకు సాహాసం చేయలేదు.
స్కోరు వివరాలు :
అఫ్గనిస్థాన్ ఇన్నింగ్స్ : 160/5 (షెహజాద్ 45, హజరత్ 33, మహ్మద్ నబి 32, రూబెన్ 2/34)
నమీబియా ఇన్నింగ్స్ : 98/9 (డెవిడ్ విసె 26, జాన్ నికోల్ 14, నవీన్ 3/26, హసన్ 3/9)