Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కీలక మ్యాచ్‌లో కోహ్లిసేన ఢలాీ
- సెమీఫైనల్ ఆశలు ఆవిరైనట్టే!
- న్యూజిలాండ్ మెరుపు విజయం
- భారత్ 110/7, న్యూజిలాండ్ 111/2
చావోరేవో తేల్చుకోవాల్సిన సమరం. ఓడితే గ్రూప్ దశ నుంచే నిష్క్రమించే ప్రమాదం. ఈ పరిస్థితుల్లో టీమ్ ఇండియా అద్వితీయ ప్రదర్శన ఆశించిన అభిమానులకు అంతులేని నిరాశ మిగిలింది. విరాట్ కోహ్లి (9), రోహిత్ శర్మ (14), ఇషాన్ కిషన్ (4), రిషబ్ పంత్ (12), కెఎల్ రాహుల్ (18) దారుణంగా విఫలమైన వేళ ఐసీసీ టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ రేసు నుంచి భారత్ నిష్క్రమించింది. పేసర్ ట్రెంట్ బౌల్ట్ (3/20), స్పిన్నర్ ఇశ్ సోధి (2/17) అండతో భారత్‌ను 110/7 పరుగులకు పరిమితం చేసిన న్యూజిలాండ్.. స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై వరుసగా మూడో (2007, 2016, 2021) విజయం నమోదు చేసి సెమీస్ రేసులో ఫేవరేట్‌గా నిలిచింది.
నవతెలంగాణ-దుబాయ్
గెలిచి నిలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఢలాీ పడింది. 8 వికెట్ల తేడాతో భారత్‌పై సాధికారిక విజయం సాధించిన న్యూజిలాండ్ గ్రూప్-2 సెమీఫైనల్స్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. ఓపెనర్ డార్లీ మిచెల్ (49, 35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (33 నాటౌట్, 31 బంతుల్లో 3 ఫోర్లు) రాణించటంతో 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ 14.3 ఓవర్లలోనే ముగించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇశ్ సోధి (2/17), స్పీడ్‌గన్ ట్రెంట్ బౌల్ట్ (3/20) విజృంభించటంతో తొలుత భారత్ 110 పరుగులే చేసింది. ప్రధాన బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కోహ్లి (9, 17 బంతుల్లో), రోహిత్ (14, 14 బంతుల్లో), ఇషాన్ కిషన్ (4, 8 బంతుల్లో), రిషబ్ పంత్ (12, 19 బంతుల్లో) చేతులెత్తేశారు. హార్దిక్ పాండ్య (23, 24 బంతుల్లో 1 ఫోర్), రవీంద్ర జడేజా (26 నాటౌట్, 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) భారత్‌కు గౌరవప్రద స్కోరు అందించారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ గ్రూప్2లో వరుసగా పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్ సెమీఫైనల్ ఆశలు గల్లంతు చేసుకుంది!.
అలవోకగా కొట్టేశారు : 111 పరుగుల ఛేదనలో న్యూజిలాండ్ ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు. సీనియర్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (20) పవర్‌ప్లేలో దూకుడుగా ఆడగా.. అతడి నిష్క్రమణ తర్వాత ఆ బాధ్యత డార్లీ మిచెల్ (49) తీసుకున్నాడు. మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో చెలరేగిన మిచెల్ కివీస్ పని మరింత తేలిక చేశాడు. సాధించాల్సిన రన్‌రేట్, లక్ష్యం చిన్నది కావటంతో బ్యాటర్లకు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. భారత బౌలర్లు సైతం న్యూజిలాండ్‌ను ఆశించిన స్థాయిలో ఇరకాటంలో పడేయలేదు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (33 నాటౌట్)తో కలిసి మిచెల్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ ఇద్దరు క్రీజులో ఉండటంతో కివీస్ గెలుపు లాంఛనం చేసుకుంది. అర్థ సెంచరీ ముంగిట డార్లీ మిచెల్ అవుటైనా.. డెవాన్ కాన్వే (2 నాటౌట్) తోడుగా విలియమ్సన్ పని పూర్తి చేశాడు. భారత బౌలర్లలో జశ్‌ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీసుకున్నాడు.
కివీస్‌కు దాసోహం! : పవర్‌ప్లేలో ముగిసేసరికి ఇద్దరు ఓపెనర్లు నిష్క్రమణ. సగం ఓవర్ల ఆట పూర్తి కాగానే టాప్-4 బ్యాటర్లు డగౌట్లో దర్శనం. 6 ఓవర్లలో 35/2, 10 ఓవర్లలో 48/3తో నిలిచిన టీమ్ ఇండియా చెమటోడ్చి 110 పరుగులు చేసింది. టాస్ నెగ్గి తొలుత బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ కోహ్లిసేనకు పక్కా ప్రణాళిక అమలు చేసింది. భారత బ్యాటర్లలో ఏ ఒక్కరూ వైవిధ్యంగా ఆడేందుకు ప్రయత్నించలేదు. టాప్ బ్యాటర్లు అందరూ కివీస్ బౌలర్లకు తలొంచి సుమారుగా ఒకే తరహాలో వికెట్లు కోల్పోయారు. క్రమం తప్పకుండా వికెట్లు కూల్చిన కివీస్ బౌలర్లు భారత్‌ను స్వల్ప స్కోరుకు పరిమితం చేయటంలో విజయవంతం అయ్యారు. కొత్త బంతితో ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీలు హడలెత్తించారు. ఇషాన్ కిషన్ (4) డీప్ లెగ్‌లో క్యాచౌట్ కాగా.. కెఎల్ రాహుల్ (16) డీప్ స్క్వేర్ లెగ్‌లో క్యాచ్‌తో నిష్క్రమించాడు. ఎదుర్కొన్న తొలి బంతికే మిల్నె క్యాచ్ చేజార్చటంతో బతికిపోయిన రోహిత్ శర్మ (14) పుల్ షాట్‌కు ప్రయత్నించి వికెట్ కోల్పోయాడు. పరుగుల వేటలో తప్పనిసరి ఎదురుదాడికి దిగిన విరాట్ కోహ్లి (9) ఆ క్రమంలో లాంగ్‌ఆన్‌లో క్యాచౌట్‌గా వెళ్లిపోయాడు. రిషబ్ పంత్ (12) సైతం నిరాశపరిచాడు.
బ్యాటింగ్ బలోపేతం చేసేందుకు టాప్ ఆర్డర్లో ఇషాన్ కిషన్, టెయిలెండర్లలో శార్దుల్ ఠాకూర్‌ను చేర్చినా ఫలితం లేకపోయింది. హార్దిక్ పాండ్య (23), రవీంద్ర జడేజా (26 నాటౌట్) భారత్ వంద పరుగులు చేసేందుకు పోరాడారు. డెత్ ఓవర్లలోనూ బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వలేదు. స్పిన్నర్ ఇశ్ సోధి (2/17), పేసర్ ట్రెంట్ బౌల్ట్ (3/20) భారత్‌ను దారుణ దెబ్బ తీశారు.
భారత్ ఇన్నింగ్స్ : కెఎల్ రాహుల్ (సి) మిచెల్ (బి) సౌథీ 18, ఇషాన్ కిషన్ (సి) మిచెల్ (బి) బౌల్ట్ 4, రోహిత్ శర్మ (సి) గప్టిల్ (బి) సోధి 14, విరాట్ కోహ్లి (సి) బౌల్ట్ (బి) సోధి 9, రిషబ్ పంత్ (బి) మిల్నె 12, హార్దిక్ పాండ్య (సి) గప్టిల్ (బి) బౌల్ట్ 23, రవీంద్ర జడేజా నాటౌట్ 26, శార్దుల్ ఠాకూర్ (సి) గప్టిల్ (బి) బౌల్ట్ 0, మహ్మద్ షమి నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 04, మొత్తం :(20 ఓవర్లలో 7 వికెట్లకు) 110.
వికెట్ల పతనం : 1-11, 2-35, 3-40, 4-48, 5-70, 6-94, 7-94.
బౌలింగ్ : ట్రెంట్ బౌల్ట్ 4-0-20-3, టిమ్ సౌథీ 4-0-26-1, మిచెల్ శాంట్నర్ 4-0-15-0, ఆడం మిల్నె 4-0-30-1, ఇశ్ సోధి 4-0-17-2.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : మార్టిన్ గప్టిల్ (సి) ఠాకూర్ (బి) బుమ్రా 20, డార్లీ మిచెల్ (సి) రాహుల్ (బి) బుమ్రా 49, కేన్ విలియమ్సన్ నాటౌట్ 33, డెవాన్ కాన్వే నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు : 07, మొత్తం : (14.3 ఓవర్లలో 2 వికెట్లకు) 111.
వికెట్ల పతనం : 1-24, 2-96.
బౌలింగ్ : వరుణ్ చక్రవర్తి 4-0-23-0, జశ్‌ప్రీత్ బుమ్రా 4-0-19-2, రవీంద్ర జడేజా 2-0-23-0, మహ్మద్ షమి 1-0-11-0, శార్దుల్ ఠాకూర్ 1.3-0-17-0, హార్దిక్ పాండ్య 2-0-17-0.