Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ20 ప్రపంచకప్‌లో అనూహ్య భంగపాటు
- ఫేవరేట్‌గా బరిలోకి దిగి అపజయాలు
- అత్యంత గడ్డు పరిస్థితుల్లో భారత జట్టు
పొట్టి ప్రపంచకప్ మొదలైన వారం ముగిసింది. ఆతిథ్య భారత జట్టు రెండు మ్యాచులు ఆడింది. సిక్సర్లు కొట్టిన జట్టునే విజయం వరించే ఫార్మాట్లో కోహ్లిసేన 40 ఓవర్లలో 6 సిక్స్‌లు కొట్టారు, మన బౌలర్లు రెండు మ్యాచుల్లో కలిపి 2 వికెట్లే పడగొట్టారు. గ్రూప్-2 పాయింట్ల పట్టికలో నమీబియా తర్వాతి స్థానంలో నిలిచారు. వరుస మ్యాచుల్లో ఓటమితో సెమీఫైనల్ అవకాశాలను ఆవిరి చేసుకున్నారు!. క్రీడల్లో గెలుపు ఓటమి సహజం, ఆటలో భాగం. భారత అభిమానులను, క్రికెట్ ఔత్సాహికులను వేధిస్తున్నది ఓటములు కాదు.. ఓడిన తీరు!. ఈ పేలవ ప్రదర్శనకు దారితీసిన పరిస్థితులు ఏమిటీ?.
నవతెలంగాణ క్రీడావిభాగం
2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్ టైటిల్ ఫేవరేట్లలో భారత్ ఒకటి. ఆతిథ్య జట్టుగా టీమ్ ఇండియా మరోసారి ప్రపంచకప్ అందుకోవటం లాంఛనమనే అంచనాలు. కెప్టెన్‌గా విరాట్ కోహ్లికి ఇదే చివరి టీ20 ప్రపంచకప్ కావటం అంచనాలను మరింత పెంచింది. వేగవంతమైన క్రికెట్లో పదునైన వ్యూహలు అమలు చేయటంలో దిట్ట ఎం.ఎస్ ధోని సేవలను సైతం అందుబాటులో ఉంచారు. అన్ని విభాగాల్లోనూ భారత జట్టు పటిష్టంగానే కనిపించింది. యుఏఈ ఎడారిలో కోహ్లిసేన తుఫాన్ ఆపగలిగేది ఎవరు? అనే దీమా అభిమానుల్లో నెలకొన్న సమయంలో వరుస మ్యాచుల్లో ఓటమి నైరాశ్యంలోకి నెట్టింది. 2007 వరల్డ్‌కప్ తర్వాత భారత జట్టుకు ఎదురైన దారుణ చేదు అనుభవం ఇదే. అయితే, 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత అభిమానులతో పాటు క్రికెటర్లకూ మింగుడు పడని మరో చేదు గుళిక. 2007 వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఈ సారి టోర్నీ నుంచి నిష్క్రమించినా, మరో మూడు మ్యాచులు ఆడాల్సి రావటం అత్యంత గడ్డు పరిస్థితి. ఈ పేలవ ప్రదర్శనకు లోపం ఎక్కడుంది?.
పవర్ లేని పవర్‌ప్లే
ఫీల్డింగ్ నిబంధనలు ఉండే పవర్ ప్లేలో (6 ఓవర్లు) వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయటంతో పాటు వికెట్లు నిలుపుకోవటం కీలకం. మ్యాచ్ గమనాన్ని నిర్దేశించే ఓవర్లు ఇవి. పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచుల్లో కోహ్లిసేన పవర్‌ప్లేలో పవర్‌లెస్ ఆటతో నిరాశపరిచింది. 36/3, 33/2తో బేలగా మొదలెట్టింది. మంచు ప్రభావంతో స్వల్ప స్కోర్లు కాపాడుకోవటం కష్టమనే విషయం తెలిసినా.. పస లేని పవర్‌ప్లే భారత్‌ను వెనక్కి లాగేసింది. దీనికి తోడు టాప్ ఆర్డర్ కూర్పుపై కోహ్లి స్పష్టతతో ఉన్నట్టు లేడు. వార్మప్ మ్యాచుల్లో రాహుల్, ఇషాన్.. రోహిత్, రాహుల్‌లను ఓపెనర్లుగా ఆడించారు. అసలు సమరంలోనూ కోహ్లి ఇదే ప్రయోగం చేశాడు. రెండు కాంబినేషన్లను ప్రయోగించి ఏ ఒక్కదాంట్లోనూ సక్సెస్ కాలేదు. ఐపీఎల్లో పరుగుల సునామీ సృష్టించే కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ నిసహాయ బ్యాటింగ్ చూసేందుకు సైతం అభిమానులు ఇష్టపడలేదు!.
పస లేని కొత్త బంతి దాడి
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్టు బంతిపై మెరుపు ఉన్నప్పుడే వికెట్లు పడగొట్టాలి. ఈ సూత్రం ప్రత్యర్థి బౌలర్లు పక్కాగా అమలు చేయగా.. మనోళ్లు తేలిపోయారు. స్వింగ్స్టార్ భువనేశ్వర్ కుమార్ నిజానికి ఐపీఎల్ నుంచే ఫామ్‌లో లేడు. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తాడనుకున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మాయ చేయలేకపోయాడు. కొత్త బంతితో షమి ప్రభావశీలుడు కాకపోవటం, భుమి ఫామ్ లేమి బుమ్రాను సైతం బ్యాటర్లు తేలిగ్గా ఆడేలా చేసింది. ఇక స్వల్ప స్కోర్లను ఛేదించే సమయంలో ఎంతటి బౌలరైనా బ్యాటర్‌కు పెద్ద లెక్క కాదు. పరుగుల వేటలో రిస్క్ తీసుకున్నప్పుడే బౌలర్ ఎంత ప్రమాదకారో తెలిస్తుంది. భారత బౌలర్లపై రిస్క్ చేయాల్సిన అవసరమే పాక్, కివీస్ బ్యాటర్లకు ఏర్పడలేదు. 151, 110 పరుగులు చేసి బౌలర్ల నుంచి స్ఫూర్తిదాయక ప్రదర్శన ఆశించటం తగదు. అదే సమయంలో మూడెంకల స్కోరు అందుకునేందుకు ప్రత్యర్థి బ్యాటర్లను కనీసం ఇరకాటంలో పడేయలేని పేలవ ప్రదర్శనపై సమీక్ష అవసరం.
అసలు సమస్య 'టాస్'
టాస్ నెగ్గటంలో విరాట్ కోహ్లికి ఏమంత మంచి రికార్డు లేదు. టీ20 ప్రపంచకప్‌లోనూ అదే పునరావృతం అయ్యింది. నిజానికి టాస్ నెగ్గటం ఎవరి చేతుల్లో ఉండదు. మంచు ప్రభావం తీవ్రంగా ఉన్న చోట టాస్ కోల్పోవటం భారత జట్టు అతిపెద్ద ప్రతికూలత. ఇక్కడ తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు 19 మ్యాచుల్లో 15 సార్లు ఓటమి పాలయ్యాయి. వరుస మ్యాచుల్లో టాస్ ఓడటంతోనే సగం మ్యాచ్ పోయింది!. నిజానికి భారత జట్టు ఛేదనలో ఎదురులేని జట్టు. 2016 టీ20 వరల్డ్‌కప్ నుంచి ఛేదనలో 32 మ్యాచుల్లో 23 సార్లు విజయం సాధించింది. అదే సమయంలో తొలుత బ్యాటింగ్ చేసిన 41 మ్యాచుల్లో 22 మ్యాచుల్లోనే గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు భారత జట్టు సంప్రదాయ పరుగుల వేట నుంచి బయట పడటం లేదు. అదే ఛేదనలో లక్ష్యాన్ని గమనంలో ఉంచుకుని అద్భుతంగా రాణించింది.
పేలవ షాట్ల ఎంపిక
యుఏఈలో ప్రపంచకప్ కోసం కొత్త పిచ్‌లను వాడారు. ఐపీఎల్లో వాడిన పిచ్‌లను వినియోగించలేదు. కొత్త పిచ్‌లు నెమ్మదిగా ఉన్నాయి. ఈ పిచ్‌లకు భారత బ్యాటర్లు అలవాటు పడలేదు. షాట్ల ఎంపికలో ఇక్కడే పొరపాటు జరిగింది. రిస్క్ తీసుకోవటంలోనే టీ20 క్రికెట్ రివార్డు దాగి ఉంటుంది. ప్రణాళిక బద్దంగా పాక్, కివీస్ బౌలర్లు బంతులేస్తుంటే పరుగుల వేటకు భిన్నమైన మార్గం ఆలోచన చేయలేదు. కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లకు డీప్ లెగ్, డీప్ స్క్వేర్ లెగ్‌లో ఫీల్డర్‌ను మొహరించిన కేన్ విలియమ్సన్ షాట్లు ఆడేలా ఉసిగొల్పి వికెట్ పడగొట్టాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్‌ను దాటేసి సిక్సర్ బాదగలననే నమ్మకం బ్యాటర్లలో ఉండవచ్చు. కానీ షాట్‌కు సరైన టైమింగ్ లభించనప్పుడు ఉత్తమ షాట్‌ను సైతం విరమించుకోవటం శ్రేయస్కరం. ప్రత్యర్థి ప్రణాళికలను తారుమారు చేసే ప్రదర్శన చేయడానికి బదులు.. ప్రత్యర్థి పద్మవ్యూహంలోకి చిక్కుకుని విలవిల్లాడారు.
మైదానంలోని సహేతుక కారణాలకు తోడు గత ఆరు నెలలుగా బిజీ షెడ్యూల్ సైతం పేలవ ప్రదర్శనకు దోహదం చేసిందని చెప్పలేం. కరోనా మహమ్మారి పరిస్థితుల్లో భారత్‌తో పాటు ఇతర జట్లు సైతం ఒక బబుల్ నుంచి మరో బబుల్‌కు మారుతూ పరిస్థితులను ఆకళింపు చేసుకుంటున్నారు. బయో బుడగ జీవితం క్రికెటర్లపై మానసికంగా కచ్చితంగా ప్రభావం చూపుతుంది. కానీ ఫేవరేట్‌గా బరిలో నిలిచిన జట్టు వైఫల్యానికి దాన్ని కారణం చేయలేం. నిజానికి ప్రస్తుత టోర్నీలో టీమ్ ఇండియా వైఫల్యం ఒకింత మంచికే అనుకోవాలి!. 2016 సెమీఫైనల్లో వెస్టిండీస్ చేతిలో ఓటమికి ముందు టీ20ల్లో భారత వ్యూహం వికెట్ల మధ్య పరుగుకు ప్రాధాన్యత కల్పించేది. ఆ ఓటమితో సింగిల్స్, డబుల్స్ కాదు సిక్సర్లు బాదాలనే ఫార్ములాను జట్టులో ప్రవేశపెట్టారు. ఈ ఓటమితో వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు కొత్త నాయకుడు, సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగేందుకు అవకాశం ఉంటుంది. అంతిమంగా ఈ ఓటమి భారత క్రికెట్ టీ20 సంస్కృతిలో మార్పునకు నాంది కానుంది.
టీ20 ప్రపంచకప్‌లో నేడు
బంగ్లాదేశ్ X దక్షణాఫ్రిికా
వేదిక : అబుదాబి , సమయం : మ: 3.30
నమిబియా X పాకిస్తాన్
వేదిక : అబుదాబి , సమయం : రా: 7.30
స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం..