Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిప్పులు చెరిగిన రబాడ, ఎన్రిచ్
- బంగ్లాదేశ్‌పై 6 వికెట్లతో ఘన విజయం
అబుదాబి : పేసర్లు కగిసో రబాడ (3/20), ఎన్రిచ్ నొకియా (3/8) నిప్పులు చెరిగే ప్రదర్శనతో చెలరేగారు. టీ20 ప్రపంచకప్ గ్రూప్-1లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో అలవోక విజయం అందించారు. గ్రూప్ దశలో మూడో విజయం నమోదు చేసిన దక్షిణాఫ్రికా సెమీఫైనల్ రేసులో అవకాశాలను మెరుగుపర్చుకుంది. చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై విజయం సాధిస్తే సఫారీలు సెమీస్‌కు చేరుకోవటం లాంఛనమే. దక్షిణాఫ్రికా పేసర్ల విజృంభణతో తొలుత బంగ్లాదేశ్ కకావికలమైంది. 18.2 ఓవర్లలో బంగ్లాదేశ్ 84 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ లిటన్ దాస్ (24, 36 బంతుల్లో 1 ఫోర్), మెహది హసన్ (27, 25 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్)లు బంగ్లాదేశ్ ఆ మాత్రం పరుగులైనా చేసేలా చూశారు. ప్రధాన బ్యాటర్లు మహ్మద్ నయీం (9), సౌమ్య సర్కార్ (0), ముష్ఫీకర్ రహీం (0)లను కగిసో రబాడ అవుట్ చేసి బంగ్లాదేశ్ కష్టాల్లోకి నెట్టాడు. మహ్మదుల్లా (3), మెహెది హసన్ (27), నుసుమ్ అహ్మద్ (0) వికెట్లను ఎన్రిచ్ నొకియా తన ఖాతాలో వేసుకున్నాడు. మరో పేసర్ షంషి దెబ్బకు లిటన్ దాస్, షమీమ్ హోస్సేన్ (11) వికెట్లు కోల్పోయారు. ఆరు ఓవర్లలోనే 28/3తో పీకల్లోతు కష్టాల్లో పడిన బంగ్లాదేశ్ ఏ దశలోనూ కోలుకోలేదు.
స్వల్ప లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 13.3 ఓవర్లలోనే ఊదేసింది. కెప్టెన్ తెంబ బవుమా (31 నాటౌట్, 28 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), వాన్‌డర్ డుసెన్ (22, 27 బంతుల్లో 2 ఫోర్లు), క్వింటన్ డికాక్ (16, 15 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. మార్కరం (0), రీజా హెండ్రిక్స్ (4) విఫలమయ్యారు. మరో 39 బంతులు మిగిలి ఉండగానే ఛేదన పూర్తి చేసిన దక్షిణాఫ్రికా నెట్ రన్‌రేట్‌ను భారీగా పెంచుకుంది. గ్రూప్ దశలో మూడో విజయంతో సెమీస్ రేసులో ఆశలు సజీవంగా నిలుపుకుంది. సఫారీ విజయంతో బంగ్లాదేశ్, శ్రీలంక సెమీస్ రేసు నుంచి నిష్క్రమించాయి. బంగ్లాదేశ్‌కు గ్రూప్ దశలో ఇది వరుసగా నాల్గో ఓటమి. సఫారీ పేసర్ కగిసో రబాడ ' మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
స్కోరు వివరాలు :
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ : 84/10 (మహెది హసన్ 27, లిటన్ దాస్ 24, రబాడ 3/20, ఎన్రిచ్ 4/8)
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ : 86/4 (తెంబ బవుమా 31, డుసెన్ 22, టస్కిన్ అహ్మద్ 2/18, హసన్ 1/19)