Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఫ్గాన్‌తో భారత్ ఢీ నేడు
- భారీ విజయంపై కోహ్లిసేన గురి
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా సెమీఫైనల్ ఆశలు ఆవిరైనా.. భారత పోరాటం ఇంకా మిగిలే ఉంది. ఇతర సమీకరణాలు, అద్భుతాలు తోడైతే కోహ్లిసేనకు ఇప్పటికీ ఓ అవకాశం ఉండనే ఉంది!. వరుస ఓటముల నైరాశ్యంలో ఉన్న కోహ్లిసేన.. అతి చిన్న అవకాశంపై కన్నేసి నేడు అఫ్గాన్‌తో సవాల్‌కు సిద్ధమవుతున్నారు. భారీ విజయం సాధించి నెట్‌రన్‌రేట్ మెరుగు పర్చుకోవటమే నేడు భారత్ లక్ష్యం!.
నవతెలంగాణ-అబుదాబి
వాస్తవికంగా ప్రపంచ కప్ సెమీఫైనల్ రేసులో భారత్‌కు ఆశలు లేవు. కానీ సాంకేతికంగా ఓ చిన్న అవకాశం లేకపోలేదు. టోర్నీలో అద్వితీయంగా రాణిస్తోన్న అఫ్గనిస్థాన్ బౌలర్లు తమ తర్వాతి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు షాక్ ఇవ్వగలిగితే కోహ్లిసేనకు లైన్‌క్లియర్ కానుంది. అయితే, ఆ అద్భుతం చోటుచేసుకున్నా సద్వినియోగం చేసుకునేందుకు భారత్ చివరి మూడు గ్రూప్ మ్యాచుల్లో తిరుగులేని ఆధిక్యంతో విజయం సాధించాల్సి ఉంది. అందులో భాగంగా నేడు అఫ్గనిస్థాన్‌తో తలపడనుంది. భారత్, అఫ్గనిస్థాన్‌లు నేడు అబుదాబిలో ముఖాముఖి సమరానికి సిద్ధం కానున్నారు.
రేసులో నిలబడతారా? : తొలి రెండు మ్యాచుల్లో టాస్ కోల్పోవటం భారత్‌ను ఘోరంగా దెబ్బతీసింది. 20-30 పరుగులు అదనంగా చేయాల్సిన పరిస్థితుల్లో బ్యాటర్లు తీవ్ర ఒత్తిడిలో పడిపోయారు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఆ ఒత్తిడి కారణంగానే ఎదురుదాడి చేసి వికెట్ కోల్పోయాడు. నేడు అఫ్గాన్ బౌలర్లు సైతం భారత్‌కు గట్టి సవాలే విసురుతారు. రషీద్ ఖాన్, మహ్మద్ నబి, ముజీబ్ రెహమాన్ రూపంలో ముగ్గురు ప్రపంచ శ్రేణి స్పిన్నర్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లు ఓపెనర్లుగా వచ్చే అవకాశం ఉంది. గాయంతో దూరమైన సూర్యకుమార్ అందుబాటులో లేడు. కెఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో ఆడే వీలుంది. విరాట్ కోహ్లి, రిషబ్ పంత్‌లు ఫామ్‌లో ఉన్నారు. అయినా, తొలుత బ్యాటింగ్ చేయాల్సి వస్తే మనోళ్ల ప్రదర్శనపై కాస్త ఆందోళన కనిపిస్తోంది. బుమ్రా, షమి, శార్దుల్‌లు మరోసారి పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. వరుణ్ చక్రవర్తి, జడేజాలు స్పిన్ బాధ్యత చూసుకోనున్నారు.
అఫ్గాన్‌తో ప్రమాదమే! : అఫ్గనిస్థాన్ జట్టును పసికూనగా పరిగణించలేం. ప్రత్యేకించి టీ20 ఫార్మాట్లో ఈ జట్టు అగ్రజట్లకు గట్టి పోటీ ఇవ్వగలదు. నిలకడగా విజయాలు సాధించగల సత్తా ఉంది. రషీద్, నబి, ముజీబ్ వంటి ప్రపంచ స్థాయి స్పిన్నర్లకు అండగా నిలిచే పేస్ జోడీ అఫ్గాన్‌కు కరువైంది. పాక్‌తో మ్యాచ్‌లోనూ ఐదో బౌలర్ అఫ్గాన్ విజయావకాశాలను దెబ్బతీశాడు. బ్యాటింగ్ పరంగా అఫ్గాన్ మెరుగ్గానే కనిపిస్తోంది. టాప్, మిడిల్ ఆర్డర్లో బ్యాటర్లు బాధ్యతగా ఆడుతున్నారు. ప్రత్యర్థి బౌలర్లకు తలొంచకుండా స్వేచ్ఛగా ఆడుతున్నారు. ఇది భారత బౌలర్లను కాస్త ఇరకాటంలో పడేసేదే. ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన భారత్‌పై విజయం సాధించేందుకు ఇప్పుడే సమయమని అఫ్గాన్ భావిస్తోంది.
పిచ్ రిపోర్టు : టీ20 ప్రపంచకప్‌లో టాస్‌తోనే ఫలితం నిర్ణయం అయిపోతుంది!. అబుదా బిలో ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఆరుసార్లు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్టునే విజయం వరించింది. టాస్ నెగ్గిన జట్టు మరో ఆలోచనకు తావులేకుండా తొలుత ఫీల్డింగ్ ఎంచుకోనుంది. మ్యాచ్‌కు ఎటువంటి వర్ష సూచనలు లేవు.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి (కెప్టెన్), కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమి, వరుణ్ చక్రవర్తి, జశ్‌ప్రీత్ బుమ్రా.
అఫ్గనిస్థాన్ : హజ్రతుల్లా జజారు, మహ్మద్ షెహజాద్ (వికెట్ కీపర్), రెహ్మనుల్లా గుర్బాజ్, హస్మతుల్లా షాహిది/ఉస్మాన్ ఘని, మహ్మద్ నబి, నజీబుల్లా జద్రాన్, గుల్బాదిన్ నయిబ్, రషీద్ ఖాన్, ముజీబ్ రెహమాన్, నవీన్ ఉల్ హాక్, హామిద్ హసన్.
టీ20 ప్రపంచకప్‌లో నేడు
న్యూజిలాండ్ X స్కాట్లాండ్
వేదిక : దుబాయ్ , సమయం : మ: 3.30
భారత్ X అఫ్గనిస్థాన్
వేదిక : అబుదాబి , సమయం : రా: 7.30
స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం..