Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోహిత్, రాహుల్ అర్థ శతకాలు
- పాండ్య, పంత్ ఫటాఫట్ మోత
- అఫ్గాన్‌పై భారత్ భారీ విజయం
టీ20 ప్రపంచకప్‌లో ఆలస్యమైనా.. టీమ్ ఇండియా ప్రతాపం మొదలైంది. సెమీఫైనల్ రేసులో ఇతర సమీకరణాలు కలిసొచ్చే విధంగా కోహ్లిసేన రెచ్చిపోయింది. రోహిత్ శర్మ (74), కెఎల్ రాహుల్ (69) అర్థ సెంచరీలతో చెలరేగారు. హార్దిక్ పాండ్య (35 నాటౌట్), రిషబ్ పంత్ (27 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో కదం తొక్కారు. తొలుత 210/2 పరుగుల భారీ స్కోరు చేసిన కోహ్లిసేన.. అఫ్గాన్‌ను 144/7 పరుగులకే పరిమితం చేసింది. 66 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
నవతెలంగాణ-అబుదాబి
భారత బ్యాటర్లు ఫామ్‌లోకి వచ్చారు. అఫ్గనిస్థాన్ పటిష్ట బౌలింగ్ విభాగంపై దండయాత్ర చేశారు. రోహిత్ శర్మ (74, 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెఎల్ రాహుల్ (69, 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో శివమెత్తారు. రిషబ్ పంత్ (27 నాటౌట్, 13 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు), హార్దిక్ పాండ్య (35 నాటౌట్, 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. టాప్-4 బ్యాటర్ల విశ్వరూపంతో టీ20 ప్రపంచకప్‌లో భారత్ తొలి విజయం నమోదు చేసింది. రికార్డు ఛేదనలో అఫ్గనిస్థాన్ చేతులెత్తేసింది. షమి (3/32), అశ్విన్ (2/14) అఫ్గాన్‌ను కట్టడి చేశారు. కెప్టెన్ మహ్మద్ నబి (35, 32 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), కరీం జనత్ (42 నాటౌట్, 22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఓటమి అంతరం కుదించేందుకు పోరాడారు. 144 పరుగులే చేసిన అఫ్గాన్ 66 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఓపెనర్లు ఉతికేశారు : యుఏఈ పిచ్‌లపై కీలక టాస్ మరోసారి భారత్‌కు కలిసి రాలేదు. టాస్ నెగ్గిన అఫ్గాన్ తొలుత భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్లు కెఎల్ రాహుల్ (69), రోహిత్ శర్మ (74) తొలి ఓవర్ నుంచే దూకుడు చూపించారు. రాహుల్, రోహిత్ వికెట్‌కు ఇరువైపులా బౌండరీలు బాదటంతో పవర్‌ప్లే ముగిసే సరికి భారత్ 53/0తో అదిరే ఆరంభం సాధించింది. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో రోహిత్ శర్మ 37 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేశాడు. ఆరంభంలో రోహిత్‌కు స్ట్రయిక్ రొటేట్ చేసిన రాహుల్.. ఆ తర్వాత తనే ముందుండి నడిపించాడు. రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 35 బంతుల్లోనే అర్థ శతకం బాదాడు. రషీద్ ఖాన్‌పై వరుస బంతుల్లో సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ స్టార్ స్పిన్నర్‌పై పైచేయి సాధించాడు. ఓపెనర్లు ఇద్దరూ అర్థ సెంచరీలు చేయగా తొలి వికెట్‌కు భారత్ 140 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసింది. స్వల్ప విరామంలో రోహిత్, రాహుల్ నిష్క్రమించినా.. భారత్ దూకుడు ఏమాత్రం తగ్గలేదు. డెత్ ఓవర్లలో తోడైన హార్దిక్ పాండ్య (35 నాటౌట్), రిషబ్ పంత్ (27 నాటౌట్) అఫ్గనిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. 3.3 ఓవర్లలోనే ఈ జోడీ 63 పరుగులు చేసింది. 18 రన్‌రేట్‌తో పాండ్య, పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. పంత్ మూడు సిక్సర్లు బాదగా.. పాండ్య రెండు సిక్సర్లతో చెలరేగాడు. ఈ ఇద్దరి జోరుతో భారత్ 210 పరుగుల భారీ స్కోరు చేసింది. అఫ్గాన్ బౌలర్లలో గుల్బాదిన్, కరీం జనత్లు చెరో వికెట్ పడగొట్టారు.
రాణించిన బౌలర్లు : 211 పరుగుల ఛేదనలో అఫ్గాన్ చతికిల పడింది. రికార్డు లక్ష్యంపై గురిపెట్టి దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించినా భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు కూల్చారు. షెహజాద్ (0) వికెట్‌తో భారత్ బ్రేక్ సాధించింది. హజ్రతుల్లా (13), రెహ్మానుల్లా (19), గుల్బాదిన్ (18) వికెట్ నిలుపుకోలేదు. కెప్టెన్ మహ్మద్ నబి (35), కరీం జనత్ (42)లు అఫ్గాన్ ఓటమి అంతరాన్ని తగ్గించగలిగారు. మహ్మద్ షమి మూడు వికెట్లు పడగొట్టగా, స్పిన్నర్ అశ్విన్ రెండు వికెట్లతో మెరిశాడు. ఏ దశలో అఫ్గాన్ లక్ష్యం దిశగా సాగలేదు. 20 ఓవర్లలో 7 వికెట్లకు 144 పరుగులే చేసింది.
స్కోరు వివరాలు :
భారత్ ఇన్నింగ్స్ : రాహుల్ (బి) గుల్బాదిన్ 69, రోహిత్ (సి) నబి (బి) జనత్ 74, రిషబ్ పంత్ నాటౌట్ 27, హార్దిక్ పాండ్య నాటౌట్ 35, ఎక్స్‌ట్రాలు : 5, మొత్తం : (20 ఓవర్లలో 2 వికెట్లకు) 210.
వికెట్ల పతనం : 1-140, 2-147.
బౌలింగ్ : మహ్మద్ నబి 1-0-7-0, అష్రాఫ్ 2-0-25-0, నవీన్ ఉల్ హాక్ 4-0-59-0, హమిద్ హసన్ 4-0-34-0, గుల్బాదిన్ నయిబ్ 4-0-39-1, రషీద్ ఖాన్ 4-0-36-0, కరీం జనత్ 1-0-7-1.
అఫ్గనిస్థాన్ ఇన్నింగ్స్ : హజ్రతుల్లా (సి) శార్దుల్ (బి) బుమ్రా 13, షెహజాద్ (సి) అశ్విన్ (బి) షమి 0, రెహ్మానుల్లా (సి) పాండ్య (బి)జడేజా 19, గుల్బాదిన్ (ఎల్బీ) అశ్విన్ 18, నజీబుల్లా (బి) అశ్విన్ 11, నబి (సి) జడేజా (బి) షమి 25, జనత్ నాటౌట్ 42, రషీద్ ఖాన్ (సి) పాండ్య (బి) షమి 0, అష్రాఫ్ నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు : 4, మొత్తం : (20 ఓవర్లలో 7 వికెట్లకు) 144.
వికెట్ల పతనం : 1-13, 2-13, 3-48, 4-59, 5-69, 6-126, 7-127.
బౌలింగ్ : మహ్మద్ షమి 4-0-32-3, జశ్‌ప్రీత్ బుమ్రా 4-0-25-1, హార్దిక్ పాండ్య 2-0-23-0, రవీంద్ర జడేజా 3-0-19-1, అశ్విన్ 4-0-14-2, శార్దుల్ ఠాకూర్ 3-0-31-0.