Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్కాట్లాండ్పై భారత్ ఏకపక్ష విజయం
- నిప్పులు చెరిగిన షమి, బుమ్రా.. జడేజా మాయ
- సెమీఫైనల్ రేసులో కోహ్లిసేన ఆశలు సజీవం
భారత్ పని అప్పుడే ముగియలేదు!. సెమీస్ దారిలో ఇంకా దారులు తెరిచే ఉన్నాయి!. స్కాట్లాండ్పై ఏకపక్ష విజయం సాధించిన టీమ్ ఇండియా మెరుగైన నెట్ రన్‌రేట్‌తో నాకౌట్ రేసులో ఆశలు సజీవంగా నిలుపుకుంది. పేసర్లు మహ్మద్ షమి (3/15), జశ్‌ప్రీత్ బుమ్రా (2/10), స్పిన్నర్ రవీంద్ర జడేజా (3/15) చెలరేగటంతో తొలుత స్కాట్లాండ్ను 85 పరుగులకు కుప్పకూల్చిన భారత్.. తేలికపాటి లక్ష్యాన్ని 6.3 ఓవర్లలోనే ఊదేసింది. కెఎల్ రాహుల్ (50) అర్థ శతక విన్యాసంతో భారత్‌కు విలువైన విజయాన్ని కట్టబెట్టాడు.
నవతెలంగాణ-దుబాయ్
టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా మరో విజయం సాధించింది. ఆరంభంలోనే రెండు కీలక మ్యాచుల్లో పరాజయం చవిచూసినా.. తర్వాత వరుస మ్యాచుల్లో ఏకపక్ష విజయాలు నమోదు చేసింది. స్కాట్లాండ్పై 8 వికెట్ల తేడాతో గెలుపొందిన కోహ్లిసేన గ్రూప్-2లో మూడో స్థానంలో నిలిచింది. ఓపెనర్ కెఎల్ రాహుల్ (50, 19 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) విధ్వంసక అర్థ సెంచరీకి తోడు రోహిత్ శర్మ (30, 16 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగటంతో 86 పరుగుల లక్ష్యాన్ని భారత్ 6.3 ఓవర్లలోనే ఊదేసింది. మరో 81 బంతులు మిగిలి ఉండగానే ఏకపక్ష విజయం నమోదు చేసిన కోహ్లిసేన నెట్ రన్‌రేట్‌లో న్యూజిలాండ్, అఫ్గనిస్థాన్లను వెనక్కి నెట్టేసింది. మహ్మద్ షమి, జశ్‌ప్రీత్ బుమ్రాలకు తోడు లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా మాయజాలంతో స్కాట్లాండ్ బ్యాటర్లు విలవిల్లాడారు. 85 పరుగులకే కుప్పకూలి భారత్ ముంగిట తేలిపోయారు. మూడు వికెట్లతో మ్యాచ్‌ను ఆధీనంలోకి తీసుకున్న స్పిన్నర్ రవీంద్ర జడేజా ' మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
స్కాట్లాండ్ విలవిల : తొలిసారి టాస్ నెగ్గిన టీమ్ ఇండియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. మంచు ప్రభావం లేని వేళ భారత బౌలర్లు చెలరేగారు. కివీస్ బౌలర్లతో ఆటాడుకున్న స్కాట్లాండ్ బ్యాటింగ్ లైనప్‌ను వణికించారు. పవర్ ప్లేలో 27/2తో ఫర్వాలేదనిపించిన స్కాట్లాండ్.. ఆ తర్వాతే అసలు పరీక్ష ఎదుర్కొంది. స్పిన్నర్ రవీంద్ర జడేజా, పేసర్ మహ్మద్ షమి జోరుతో బ్యాటర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. కైల్ (0), మాథ్యూ క్రాస్ (2), రిచీ బెర్రింగ్టన్ (2), క్రిస్ గ్రీవ్స్ (1), షరిఫ్ (0), ఎవాన్స్ (0) చేతులెత్తేశారు. స్కాట్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ జార్జ్ మున్సె (24, 19 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), మాక్లాడ్ (16, 28 బంతుల్లో), మార్క్ వాట్ (14, 13 బంతుల్లో 2 ఫోర్లు) చెప్పుకోదగిన పరుగులు సాధించారు. ఈ ముగ్గురి సాయంతో స్కాట్లాండ్ 85 పరుగులైనా చేయగలిగింది. భారత బౌలర్లు సమిష్టిగా చెలరేగటంతో స్కాట్లాండ్ 17.4 ఓవర్లలోనే కుప్పకూలింది.
బౌండరీల మోత : లక్ష్యం 86 పరుగులు. బలమైన భారత్‌కు ఇదో విషయం కాదు. కానీ సెమీఫైనల్ రేసులో ఆశలు సజీవంగా నిలుపుకునేందుకు భారత్ ఈ టార్గెట్‌ను 7.1 ఓవర్లలోనే ఛేదించాలి. అప్పుడే నెట్ రన్‌రేట్‌లో న్యూజిలాండ్, అఫ్గనిస్థాన్లను వెనక్కి నెట్టేందుకు అవకాశం ఉంటుంది. దీంతో స్వల్ప ఛేదనను భారత్ సవాల్‌గా తీసుకుంది. ఓపెనర్లు కెఎల్ రాహుల్ (50), రోహిత్ శర్మ (30) స్కాట్లాండ్ బౌలర్లను ఏమాత్రం కనికరించలేదు. ధనాధన్ మోత మోగించారు. ప్రతి ఓవర్లోనూ సిక్సర్ల మోత మోగించారు. కెఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా విజృంభించాడు. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 18 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. రోహిత్ శర్మ సైతం ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 16 బంతుల్లోనే 30 పరుగులు పిండుకున్నాడు. ఓపెనర్లు ఇద్దరూ పోటాపోటీగా పరుగులు పిండుకున్నారు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి భారత్ 82/2తో తిరుగులేని నెట్ రన్‌రేట్‌కు మార్గం సుగమం చేసుకుంది. ఓపెనర్ల నిష్క్రమించినా కెప్టెన్ విరాట్ కోహ్లి (2 నాటౌట్) తోడుగా సూర్య కుమార్ యాదవ్ (6 నాటౌట్) భారీ సిక్సర్‌తో లాంఛనం ముగించాడు. 6.3 ఓవర్లలోనే 89 పరుగులు చేసిన భారత్ సూపర్12 దశ గ్రూప్-2లో వరుసగా రెండో విజయం నమోదు చేసింది.
స్కాట్లాండ్ ఇన్నింగ్స్ : జార్జ్ మున్సె (సి) పాండ్య (బి) షమి 24, కైల్ (బి) బుమ్రా 1, మాథ్యూ క్రాస్ (ఎల్బీ) జడేజా 2, రిచీ బెర్రింగ్టన్ (బి) జడేజా 0, మాక్లాడ్ (బి) షమి 16, మైకల్ లీస్క్ (ఎల్బీ) జడేజా 21, క్రిస్ గ్రీవ్స్ (సి) పాండ్య (బి) అశ్విన్ 1, మార్క్ వ్యాట్ (బి) బుమ్రా 14, షరిఫ్ రనౌట్ 0, బ్రాడ్ వీల్ నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు : 4, మొత్తం : (17.4 ఓవర్లలో ఆలౌట్) 85.
వికెట్ల పతనం : 1-13, 2-27, 3-28, 4-29, 5-58, 6-63, 7-81, 8-81, 9-81, 10-85.
బౌలింగ్ : జశ్‌ప్రీత్ బుమ్రా 3.4-1-10-2, వరుణ్ చక్రవర్తి 3-0-15-0, రవిచంద్రన్ అశ్విన్ 4-0-29-1, మహ్మద్ షమి 3-1-15-3, రవీంద్ర జడేజా 4-0-15-3.
భారత్ ఇన్నింగ్స్ : కెఎల్ రాహుల్ (సి) మెక్లాడ్ (బి) వాట్ 50, రోహిత్ శర్మ (ఎల్బీ) వీల్ 30, విరాట్ కోహ్లి నాటౌట్ 2, సూర్యకుమార్ యాదవ్ నాటౌట్ 6, ఎక్స్‌ట్రాలు : 1, మొత్తం : (6.3 ఓవర్లలో 2 వికెట్లకు) 89.
వికెట్ల పతనం : 1-70, 2-82.
బౌలింగ్ : మార్క్ వాట్ 2-0-20-1, బ్రాడ్ వీల్ 2-0-32-1, ఎవాన్స్ 1-0-16-0, షరిఫ్ 1-0-14-0, క్రిస్ గ్రీవ్స్ 0.3-0-7-0.
టీ20 ప్రపంచకప్‌లో నేడు
ఆస్ట్రేలియా X వెస్టిండీస్
వేదిక : అబుదాబి , సమయం : మ: 3.30
ఇంగ్లాండ్ X దక్ష్షిణాఫ్రికా
వేదిక : షార్జా , సమయం : రా: 7.30
స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం..