Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్‌కు ఆస్ట్రేలియా!
- చిత్తుగా ఓడిన వెస్టిండీస్
విధ్వంసకారుడు విశ్వరూం దాల్చాడు. డెవిడ్ వార్నర్ (89 నాటౌట్, 56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఫామ్‌లోకి వచ్చిన వేళ డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరో 22 బంతులు ఉండగానే 158 పరుగుల లక్ష్యాన్ని ఊదేసిన కంగారూలు నెట్ రన్‌రేట్‌ను గణనీయంగా మెరుగుపర్చుకుని సెమీఫైనల్ బెర్త్ లాంఛనం చేసుకున్నారు!.
నవతెలంగాణ-అబుదాబి
డెవిడ్ వార్నర్ (89 నాటౌట్, 56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) అదరగొట్టాడు. కరీబియన్ బౌలర్లపై విరుచుకుపడిన వార్నర్ ఆస్ట్రేలియాకు అలవోక విజయాన్ని అందించాడు. మిచెల్ మార్ష్ (53, 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) సైతం అర్థ సెంచరీతో రాణించటంతో 158 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 16.2 ఓవర్లలోనే ముగించింది. వెస్టిండీస్‌ను చిత్తు చేసి గ్రూప్-1లో నాల్గో విజయం నమోదు చేసిన ఆస్ట్రేలియా సెమీఫైనల్ బెర్త్‌ను లాంఛనం చేసుకుంది. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో సఫారీలు గెలుపొందినా.. ఆసీస్ నెట్ రన్‌రేట్‌ను అధిగమించటం వాస్తవికంగా సాధ్యం కాదు. కెప్టెన్ కీరన్ పొలార్డ్ (44, 31 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), ఎవిన్ లూయిస్ (29, 26 బంతుల్లో 5 ఫోర్లు) రాణించటంతో తొలుత వెస్టిండీస్ 157 పరుగులు చేసింది. డెవిడ్ వార్నర్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. ఈ మ్యాచ్‌తో వెస్టిండీస్ దిగ్గజాలు క్రిస్ గేల్, డ్వేన్ బ్రావాలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. బ్రావో, గేల్‌లను ఆసీస్ క్రికెటర్లు గార్డ్ ఆఫ్ హానర్‌తో గౌరవించారు.
వార్నర్ అదరహో : వెస్టిండీస్‌పై విజయంలో ఆసీస్‌కు అతి పెద్ద సానుకూలత డెవిడ్ వార్నర్ మళ్లీ దూకుడు అవతారం ఎత్తటం!. ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 29 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదిన డెవిడ్ వార్నర్.. కరీబియన్ బౌలర్లను ఊచకోత కోశాడు. వార్నర్ మెరుపులతో పవర్‌ప్లేలోనే ఆసీస్ 53 పరుగులు చేసింది. వార్నర్‌కు మిచెల్ మార్ష్ (53) తోడవటంతో స్కోరు బోర్డు మరింత వేగంగా ముందుకెళ్లింది. ఓవర్‌కు సగటున పది పరుగులు సాధించిన ఈ జోడీ ఆసీస్ నెట్ రన్‌రేట్‌ను గణనీయంగా పెంచారు. మార్ష్ సైతం ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 28 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ఛేజ్ ఓవర్లో బౌండరీతో డెవిడ్ వార్నర్ లాంఛనం ముగించాడు. 16.2 ఓవర్లలోనే ఆస్ట్రేలియా 161 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
హజిల్‌వుడ్ అదుర్స్ : టాస్ నెగ్గిన తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. వెస్టిండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించింది. పాట్ కమిన్స్, జోశ్ హజిల్‌వుడ్ పవర్‌ప్లేలోనే పంజా విసరటంతో విండీస్ కీలక వికెట్లు కోల్పోయింది. క్రిస్ గేల్ (15) వికెట్లను కమిన్స్ గిరాటేయగా.. నికోలస్ పూరన్ (4), రోస్టన్ ఛేజ్ (0)లను ఒకే ఓవర్లో అవుట్ చేసిన హజిల్‌వుడ్ ఆసీస్‌కు బ్రేక్ అందించాడు. 35/3తో కరీబియన్లు పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. ఈ సమయంలో ఎవిన్ లూయిస్ (29), షిమ్రోన్ హెట్మయర్ (27)లు నాల్గో వికెట్‌కు 35 పరుగులు జోడించారు. క్రీజులో నిలదొక్కుకుని చెలరేగే సమయంలో ఆసీస్ బౌలర్లు ఈ ఇద్దరిని వెనక్కి పంపించారు. కెప్టెన్ కీరన్ పొలార్డ్ (44, 31 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), అండ్రీ రసెల్ (18 నాటౌట్, 7 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) చివర్లో విండీస్‌కు పోరాడగలిగే స్కోరు అందించారు. రసెల్ మినహా మరో బ్యాటర్ స్వేచ్ఛగా ఆడలేకపోయాడు. బ్యాటింగ్‌కు సహకరించే పిచ్‌పై వెస్టిండీస్ స్వల్ప స్కోరుతో సరిపెట్టుకుంది. డ్వేన్ బ్రావో (10, 12 బంతుల్లో 1 సిక్స్) చివరి ఇన్నింగ్స్ ఆడేశాడు. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు బ్రావో వీడ్కోలు పలికాడు. ఆసీస్ పేసర్ జోశ్ హజిల్‌వుడ్ (4/39) నాలుగు వికెట్ల ప్రదర్శనతో రాణించాడు. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, ఆడం జంపాలు తలా ఓ వికెట్ పడగొట్టారు.
స్కోరు వివరాలు :
వెస్టిండీస్ ఇన్నింగ్స్ : క్రిస్ గేల్ (బి) కమిన్స్ 15, ఎవిన్ లూయిస్ (సి) స్మిత్ (బి) జంపా 29, నికోలస్ పూరన్ (సి) మార్ష్ (బి) హజిల్‌వుడ్ 4, రోస్టన్ ఛేజ్ (బి) హజిల్‌వుడ్ 0, షిమ్రోన్ హెట్మయర్ (సి) వేడ్ (బి) హజిల్‌వుడ్ 27, కీరన్ పొలార్డ్ (సి) మాక్స్వెల్ (బి) స్టార్క్ 44, డ్వేన్ బ్రావో (సి) వార్నర్ (బి) హజిల్‌వుడ్ 10, అండ్రీ రసెల్ నాటౌట్ 18, జేసన్ హోల్డర్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 9, మొత్తం : (20 ఓవర్లలో 7 వికెట్లకు) 157.
వికెట్ల పతనం : 1-30, 2-35, 3-35, 4-70, 5-91, 6-126, 7-143.
బౌలింగ్ : మిచెల్ స్టార్క్ 4-0-33-1, జోశ్ హజిల్‌వుడ్ 4-0-39-4, పాట్ కమిన్స్ 4-0-37-1, గ్లెన్ మాక్స్వెల్ 1-0-6-0, మిచెల్ మార్ష్ 3-0-16-0, ఆడం జంపా 4-0-20-1.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ : డెవిడ్ వార్నర్ నాటౌట్ 89, అరోన్ ఫించ్ (బి) హోసెన్ 9, మిచెల్ మార్ష్ (సి) హోల్డర్ (బి) గేల్ 53, గ్లెన్ మాక్స్వెల్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 10, మొత్తం :(16.2 ఓవర్లలో 2 వికెట్లకు) 161.
వికెట్ల పతనం : 1-33, 2-157.
బౌలింగ్ : అకీల్ హొసెన్ 4-0-29-1, రొస్టన్ ఛేజ్ 1.2-0-17-0, జేసన్ హోల్డర్ 2-0-26-0, డ్వేన్ బ్రావో 4-0-36-0, హేడెన్ వాల్ష్ 2-0-18-0, అండ్రీ రసెల్ 2-0-25-0, క్రిస్ గేల్ 1-0-7-1.