Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోహ్లిసేన వైఫల్యంపై విమర్శల జడివాన
ఐసీసీ 2021 టీ20 ప్రపంచకప్ నుంచి భారత జట్టు నిష్క్రమించింది. గ్రూప్ దశలో వరుసగా రెండు మ్యాచుల్లో పేలవ ప్రదర్శన కోహ్లిసేనను సెమీఫైనల్స్‌కు దూరం చేసింది. పాక్, కివీస్ చేతిలో ఓటమితోనే కోహ్లిసేన కథ ముగిసినా.. ఇతర సమీకరణాలపై ఆశలు కనిపించాయి. కివీస్ చేతిలో అఫ్గాన్ ఓటమితో ఆ ఆశలు ఆవిరి కాగా నమీబియాతో మ్యాచ్‌కు ముందే భారత్ ఆశలు వదులుకుంది. గ్రూప్ దశ నిష్క్రమణపై అప్పుడే ప్రకంపనలు మొదలయ్యాయి. మాజీ క్రికెటర్లు కోహ్లిసేన ప్రదర్శన పట్ల మాటల తూటాలు సంధిస్తున్నారు.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
పరుగులు చేయలేదు : సునీల్ గవాస్కర్
'పాకిస్థాన్, న్యూజిలాండ్ బౌలర్లు భారత బ్యాటర్లను పూర్తి నియంత్రణలో ఉంచారు. స్వేచ్ఛగా పరుగులు చేయకుండా కట్టడి చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం బ్యాటింగ్‌ను సులభతరం చేసింది. స్పిన్ బంతులు టర్న్ అవ్వలేదు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ అనుకూలమే, కానీ 180 పరుగులు చేయగలిగితే బౌలర్లకు ఓ అవకాశం ఉంటుంది. 111 పరుగులు చేసి బౌలర్ల నుంచి ఏం ఆశిస్తాం. ఈ ఓటమితో జట్టులో సమూల మార్పులు అవసరం లేదు. అందువల్ల ఉపయోగం ఉండదు. భారత జట్టు దృక్పథంలో మార్పు రావాలి. పవర్ ప్లే ఓవర్లలో బ్యాటింగ్ వ్యూహంపై సమీక్ష చేసుకోవాలి. ఐసీసీ టోర్నీల్లో భారత్ పవర్ ప్లే అనుకూలతను వాడుకోవటం లేదు. మంచి బౌలర్లున్న జట్టుతో ఆడినప్పుడు భారత బ్యాటర్ల బలహీనత బయటపడుతుంది. ఈ అంశంలో మార్పు అవసరం' అని సునీల్ గవాస్కర్ అన్నాడు.
ఐసీసీ టోర్నీల్లో భయపడుతూ.. : నాసిర్ హుస్సేన్
'బరిలోకి దిగితే భయమెరుగని ఆట ప్రదర్శించాలి. భారత జట్టులో ఎంతో ప్రతిభ ఉంది. ఐసీసీ ఈవెంట్లలో భారత్‌ను వెనక్కి లాగుతున్న అంశం అదే అనుకుంటా!. భయమెరుగని క్రికెట్ ఆడేందుకు భారత క్రికెటర్లు జంకుతారు, ఎందుకంటే వారు ప్రతిభావంతులైన క్రికెటర్లు. భారత్ నా ఫేవరేట్. ఇక్కడ ఐపీఎల్ ఆడారు, స్టార్స్‌తో కూడిన జట్టు. షాహీన్ షా అఫ్రిది వేసిన ఆ రెండు బంతులకు రోహిత్, రాహులే కాదు గొప్ప క్రికెటర్లూ వికెట్ కోల్పోతారు. భారత టాప్ ఆర్డర్ భీకర ఫామ్‌తో.. మిడిల్ ఆర్డర్‌కు పెద్దగా అవకాశాలు రావు. హఠాత్తుగా ప్లాన్ బి పని చేయదు' అని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ అన్నాడు.
జాతీయ జట్టుకు ప్రాధాన్యత ఇవ్వాలి : కపిల్ దేవ్
'జాతీయ జట్టు కంటే ఐపీఎల్‌కే ఆటగాళ్లు ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు ఇక ఏం చెప్పగలం? దేశానికి ఆడటాన్ని ఆటగాళ్లు గర్వంగా భావించాలి. ఆటగాళ్ల ఆర్థిక పరిస్థితి నాకు తెలియదు, కాబట్టి దీనిపై ఎక్కువ మాట్లాడలేను. ప్రతి ఆటగాడికి జాతీయ జట్టు తొలి ప్రాధాన్యం కావాలి, ఆ తర్వాత ఐపీఎల్ ప్రాంఛైజీ. ఐపీఎల్లో ఆడవద్దని నేను చెప్పటం లేదు. మెరుగైన క్రికెట్ నిర్వహణ బాధ్యత బీసీసీఐపై ఉంది. ఈ ప్రపంచకప్‌లో చేసిన తప్పిదాలను పునరావృతం చేయకపోవటమే మనం నేర్చుకునే గొప్ప పాఠం' అని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు.
ప్రపంచకప్? ఐపీఎల్? ఏది ముఖ్యం : మదన్‌లాల్
'బయో బబుల్ అలసట ఇక్కడ ముఖ్య పాత్ర పోషించింది. కివీస్‌తో మ్యాచ్‌లో ప్రత్యర్థి బ్యాటర్లు బంతిని స్టేడియం ఆవలకు పంపిస్తే.. మన బ్యాటర్లు కొడితే ఫీల్డర్ల చేతుల్లోకి వెళ్లాయి. మన ఆటగాళ్లు అలసిపోయారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఐపీఎల్ అనంతరం నేరుగా ప్రపంచకప్‌కు వచ్చారు. అంతకముందు ఇంగ్లాండ్ పర్యటనలో సుదీర్ఘంగా ఆడారు. ఐపీఎల్లో ఆడకుంటే బాగుండేది. ఏది ప్రధానమో ఆటగాళ్లు తేల్చుకోవాలి. ప్రపంచకప్? ఐపీఎల్లో ఏది కావాలో నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఇది మరో సిరీస్ కాదు.. ప్రపంచ కప్' అని మదన్‌లాల్ అన్నాడు.