Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నమీబియాపై భారత్ గెలుపు
- రాణించిన రోహిత్ శర్మ, రాహుల్
- జడేజా, అశ్విన్ మాయజాలం
టీ20 ప్రపంచకప్ నుంచి టీమ్ ఇండియా విజయంతో నిష్క్రమించింది. సూపర్12 గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో నమీబియాపై భారత్ ఏకపక్ష విజయం నమోదు చేసింది. జడేజా (3/16), అశ్విన్ (3/20), బుమ్రా (2/19) విజృంభించటంతో తొలుత నమీబియా 132 పరుగులే చేసింది. స్వల్ప ఛేదనలో రోహిత్ శర్మ (56), కెఎల్ రాహుల్ (54) అర్థ సెంచరీలు బాదటంతో 15.2 ఓవర్లలోనే భారత్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.
నవతెలంగాణ-దుబాయ్
నమీబియాపై భారత్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐసీసీ 2021 టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా కథకు గ్రూప్ దశలోనే తెరపడినా.. పసికూనపై విజయంతో కోహ్లిసేన టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ విజయంతో గ్రూప్-2లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. రోహిత్ శర్మ (56, 37 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెఎల్ రాహుల్ (54 నాటౌట్, 36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో చెలరేగారు. ఓపెనర్ల జోరుతో 133 పరుగుల ఛేదనలో టీమ్ ఇండియా అలవోక విజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 132/8 పరుగులే చేసింది. స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌లు ఆరు వికెట్లు కూల్చగా.. బుమ్రా రెండు వికెట్లతో విరుచుకుపడ్డాడు. నమీబియా తరఫున డెవిడ్ విసే (26, 25 బంతుల్లో 2 ఫోర్లు), స్టీఫెన్ బార్డ్ (21, 21 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడారు.
రోహిత్, రాహుల్ అదుర్స్ : స్వల్ప ఛేదనలో ఓపెనర్లు అర్ధ సెంచరీలతో కదం తొక్కారు. ఆరంభంలో రోహిత్ దూకుడుగా ఆడగా.. రాహుల్ స్ట్రయిక్ రొటేట్ చేశాడు. ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన రోహిత్ గెలుపు లాంఛనం చేశాడు. రోహిత్ నిష్క్రమణ తర్వాత గేర్ మార్చిన రాహుల్ 35 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. సూర్యకుమార్ యాదవ్ (25 నాటౌట్, 19 బంతుల్లో 4 ఫోర్లు) తోడుగా 15.2 ఓవర్లలోనే రాహుల్ పని పూర్తి చేశాడు.
అశ్విన్, జడేజా మాయ : లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా (3/16), ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (3/20) మాయజాలం ముంగిట నమీబియా తేలిపోయింది. టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్‌కు బౌలర్లు ఆశించిన ఆరంభం అందించారు. సమిష్టి ప్రదర్శనతో నమీబియాను స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు. పవర్‌ప్లేలో రెండు వికెట్లు కోల్పోయిన నమీబియా 34/2తో కష్టాల్లో పడింది. ఓపెనర్ స్టీఫెన్ బార్డ్ (21), డెవిడ్ విసే (26) మినహా నమీబియా తరఫున మరో బ్యాటర్ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. ఓవైపు అశ్విన్, మరోవైపు జడేజా నమీబియాను తిప్పేశారు. స్పిన్నర్లకు జశ్‌ప్రీత్ బుమ్రా (2/19) తోడవటంతో నమీబియా బ్యాటర్ల పని మరింత కష్టమైంది. ఎనిమిది వైడ్లు, ఎనిమిది లెగ్ బైస్ వదిలేసిన భారత్ అదనపు పరుగుల రూపంలోనే 17 పరుగులు ఇచ్చుకుంది. దీంతో నమీబియా తొలుత 132 పరుగులు చేసింది. నమీబియా స్టార్ బ్యాటర్లు ఎరాస్మస్ (12), క్రెయిగ్ విలియమ్స్ (0), జేన్ గ్రీన్ (0)లు విఫలమయ్యారు. చివర్లో జాన్ ఫ్రైలింక్ (15 నాటౌట్), రూబెన్ (13 నాటౌట్) మెరవటంతో నమీబియా మెరుగైన స్కోరు సాధించింది. భారత బౌలర్లలో మహ్మద్ షమి, రాహుల్ చాహర్‌లకు వికెట్లు దక్కలేదు.
స్కోరు వివరాలు :
నమీబియా ఇన్నింగ్స్ : స్టీఫెన్ బార్డ్ (ఎల్బీ) జడేజా 21, మైకల్ వాన్ (సి) షమి (బి) బుమ్రా 14, క్రెయిగ్ విలియమ్స్ (స్టంప్డ్) పంత్ (బి) జడేజా 0, ఎరాస్మస్ (సి) పంత్ (బి) అశ్విన్ 12, జాన్ నికోల్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 5, డెవిడ్ విసే (సి) రోహిత్ (బి) బుమ్రా 26, స్మిత్ (సి) రోహిత్ (బి) జడేజా 0, గ్రీన్ (బి) అశ్విన్ 0, జాన్ నాటౌట్ 15, రూబెన్ నాటౌట్ 13, ఎక్స్‌ట్రాలు : 17, మొత్తం :(10 ఓవర్లలో 8 వికెట్లకు) 132.
వికెట్ల పతనం : 1-33, 2-34, 3-39, 4-47, 5-72, 6-93, 7-94, 8-117.
బౌలింగ్ : మహ్మద్ షమి 4-0-39-0, జశ్‌ప్రీత్ బుమ్రా 4-0-19-2, రవిచంద్రన్ అశ్విన్ 4-0-20-3, రవీంద్ర జడేజా 4-0-16-3, రాహుల్ చాహర్ 4-0-30-0.
భారత్ ఇన్నింగ్స్ : కెఎల్ రాహుల్ నాటౌట్ 54, రోహిత్ శర్మ (సి) గ్రీన్ (బి) జాన్ 56, సూర్యకుమార్ యాదవ్ నాటౌట్ 25, ఎక్స్‌ట్రాలు :1, మొత్తం : (15.2 ఓవర్లలో 1 వికెట్) 136.
వికెట్ల పతనం : 1-86.
బౌలింగ్ : రూబెన్ 3-0-26-0, డెవిడ్ విసే 2-0-18-0, బెర్నార్డ్ 1-0-11-0, స్మిత్ 2-0-17-0, జాన్ 2-0-19-1, జాన్ నికోల్ 4-0-31-0, మైకల్ వాన్ 1.2-0-13-0.