Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ20 జట్టు నాయకత్వ పగ్గాలు
- వైస్ కెప్టెన్‌గా కెఎల్ రాహుల్
- కివీస్‌తో సిరీస్‌కు జట్టు ప్రకటన
ముంబయి : ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన సారథి, అత్యధిక టైటిళ్లు సాధించిన నాయకుడు రోహిత్ శర్మకే భారత టీ20 జట్టు పగ్గాలు. 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్ అనంతరం విరాట్ కోహ్లి పొట్టి ఫార్మాట్ సారథ్యానికి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లికి డిప్యూటీగా వ్యవహరించిన రోహిత్ శర్మకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తూ సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. స్వదేశంలో నవంబర్ 17 నుంచి ఆరంభం కానున్న న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్సీ వహించనున్నాడు. కెఎల్ రాహుల్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సీనియర్ సెలక్షన్ కమిటీ మంగళవారం భారత టీ20 జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌తోనే క్రికెట్ జెంటిల్మెన్, ది వాల్ రాహుల్ ద్రవిడ్ భారత జట్టు చీఫ్ కోచ్‌గా తొలి పరీక్ష ఎదుర్కొనున్నాడు. జైపూర్, రాంచీ, కోల్‌కతలు మూడు టీ20 మ్యాచులకు వేదిక కానున్నాయి.
విరాట్‌కు విశ్రాంతి : విరాట్ కోహ్లి సహా పలువురు సీనియర్ క్రికెటర్లు విశ్రాంతి తీసుకున్నారు. పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా, స్టార్ పేసర్ మహ్మద్ షమి సహా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యలకు విశ్రాంతి లభించింది. విరాట్ కోహ్లి తొలి టెస్టుకు సైతం విశ్రాంతి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్ సంచలనాలు రుతురాజ్ గైక్వాడ్, వెంకటేశ్ అయ్యర్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్‌లు తొలిసారి జట్టులోకి ఎంపికయ్యారు. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ సైతం జట్టులోకి ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోని మణికట్టు మాయగాడు యుజ్వెంద్ర చాహల్ కివీస్‌తో సిరీస్‌కు అశ్విన్, అక్షర్ పటేల్‌తో కలిసి మాయ చేయనున్నాడు.
మాలిక్‌కు పిలుపు : ఈ ఏడాది డిసెంబర్లో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. టెస్టులు, వన్డేలు, టీ20 సిరీస్‌ల్లో సఫారీలతో పోటీపడనుంది. సీనియర్ జట్టు పర్యటనకు ముందు భారత-ఏ బృందం అక్కడ బరిలోకి దిగుతోంది. యువ ఆటగాళ్లు పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, ప్రియాంక్ పంచల్, ఇషాన్ పోరెల్, రాహుల్ చాహర్‌లు నాలుగు రోజుల మ్యాచ్‌లో ఆడనున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పీడ్‌గన్ ఉమ్రాన్ మాలిక్ సైతం సఫారీ పర్యటనకు ఎంపికయ్యాడు.
భారత టీ20 జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, యుజ్వెంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్.
సఫారీ పర్యటనకు భారత-ఏ జట్టు : ప్రియాంక్ పంచల్ (కెప్టెన్), పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, బాబా అపరాజిత్, ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్), కృష్ణప్ప గౌతమ్, రాహుల్ చాహర్, సౌరభ్ కుమార్, నవదీప్ సైని, ఉమ్రాన్ మాలిక్, ఇషాన్ పోరెల్, అర్జాన్ నాగ్వశ్వల్ల.