Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సెమీస్ నేడు
- ప్రతీకారంపై విలియమ్సన్‌సేన కన్ను
- రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్. 2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్. తాజాగా 2021 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్. ఐసీసీ చివరి మూడు ప్రపంచకప్‌ల్లో మూడు నాకౌట్ సమరాలు. ఇందులో రెండింట ఇంగ్లాండ్‌ను అధిగమించటంలో న్యూజిలాండ్ విఫలమైంది. మూడోసారి ఫలితం భిన్నంగా ఉండాలని బ్లాక్‌క్యాప్స్ గట్టి సంకల్పంతో ఉన్నారు. కివీస్‌ను కొట్టేసి ఇంగ్లాండ్ మరోసారి టైటిల్ పోరుకు చేరుకుంటుందా? ప్రతీకార విజయంతో న్యూజిలాండ్ తుది పోరులో అడుగు పెడుతుందా? ఆసక్తికరం.
నవతెలంగాణ-అబుదాబి
చివరగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తలపడిన ఐసీసీ మెగా సమరం ప్రపంచ క్రికెట్‌ను ఉర్రూతలూగించింది. నాటకీయంగా, నరాలు తెగే ఉత్కంఠతో, ఆద్యంతం రసవత్తరంగా సాగిన 2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌ను క్రికెట్ అభిమానులు అంత సులభంగా మరిచిపోలేరు. అద్వితీయ మ్యాచ్‌లో తుది ఫలితంపై అభిమానుల్లో అసంతృప్తులు ఇంకా అలాగే ఉన్నాయి!. ఈ నేపథ్యంలో ఆ రెండు జట్లు మరోసారి ఐసీసీ టోర్నీ నాకౌట్ పోరుకు సిద్ధమయ్యాయి. సూపర్12 గ్రూప్ దశలో ఇరు జట్లు నాలుగు విజయాలు సాధించాయి. ఇంగ్లాండ్ టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగగా.. న్యూజిలాండ్ ఎప్పట్లాగే హడావిడి లేకుండా టైటిల్ రేసులో ముందుకొచ్చింది. నవంబర్ 14న పొట్టి కప్పు టైటిల్ పోరులో చోటు కోసం నేడు మోర్గాన్, కేన్ సేనలు చావోరేవో తేల్చుకోనున్నాయి. ఇంగ్లాండ్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నా.. టీ20 సమరంలో న్యూజిలాండ్‌ను తక్కువ అంచనా వేయలేం. ఈ రెండు జట్లు తలపడిన చివరి ఐదు మ్యాచుల్లో చెరో రెండింట విజయాలు నమోదు చేశాయి. ఓ మ్యాచ్ టైగా ముగియగా.. సూపర్ ఓవర్లో ఇంగ్లాండ్ పైచేయి సాధించింది. సూపర్ ఓవర్లో పేలవ రికార్డున్న న్యూజిలాండ్ నేడు అసలు పోరులోనే కథ ముగించాలని భావిస్తోంది!.
మిడిల్ నిలిస్తేనే..! : బలమైన టాప్ ఆర్డర్ ఇంగ్లాండ్‌కు సమస్యలు తెచ్చిపెడుతోంది!. మిడిల్ ఆర్డర్‌కు నిలకడగా అవకాశాలు రాకపోవటంతో బ్యాటర్ల సత్తాకు పరీక్ష ఎదురవటం లేదు. భీకర ఓపెనర్ జేసన్ రారు గాయంతో నిష్క్రమించటం మోర్గాన్ సేనకు ఎదురు దెబ్బ. అతడి స్థానంలో జానీ బెయిర్‌స్టో ఓపెనర్‌గా రానున్నాడు. స్పిన్నర్లపై ఎదురులేని రికార్డున్న మోయిన్ అలీని సైతం టాప్ ఆర్డర్లో దింపేందుకు మోర్గాన్ ఆలోచన చేస్తున్నాడు. డెవిడ్ మలాన్, లియాం లివింగ్‌స్టోన్‌లపై మిడిల్ ఆర్డర్ భారం పడింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కీలక మ్యాచ్‌లోనైనా ఫామ్‌లోకి వస్తే ఇంగ్లాండ్‌కు అదే సంతోషం. క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, మార్క్‌వుడ్‌లు పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. ఆదిల్ రషీద్‌తో కలిసి మోయిన్ అలీ మాయకు సిద్ధమవనున్నాడు. గ్రూప్ దశలో వీరవిహారం చేసిన జోశ్ బట్లర్ ప్రదర్శనపై ఇంగ్లాండ్ భారీ ఆశలు పెట్టుకుంది. బట్లర్ ఇన్నింగ్స్ సెమీస్‌లో కీలకంగా మారనుంది.
జట్టుగా ఆడితేనే..! : భారత్‌ను వెనక్కి నెట్టి న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు చేరుకున్నా.. బలమైన ఇంగ్లాండ్‌ను ఓడించేందుకు ఆ జట్టు సమిష్టిగా రాణించాల్సి ఉంది. గ్రూప్ దశలో న్యూజిలాండ్ బ్యాటర్లు తేలిపోయారు. పాక్, భారత్‌లపై అంచనాలను అందుకోలేదు. పసికూనలపై సైతం తడబాటుకు లోనయ్యారు. ఆ బలహీనతను నేడు ఇంగ్లాండ్ వాడుకునే వీలుంది. సీనియర్ బ్యాటర్ మార్టిన్ గప్టిల్ నిలకడ లేమి కివీస్‌కు తంటాలు తెస్తోంది. యువ బ్యాటర్ డార్లీ మిచెల్ భయమెరుగని ఆటతో ఆకట్టుకుంటున్నాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్‌లు మిడిల్ ఓవర్లలో కీలకం కానున్నారు. ఆరంభంలో వికెట్లు కూలితే న్యూజిలాండ్ రన్‌రేట్‌పై అనుమానాలు ఉన్నాయి. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, ఆడం మిల్నెలు పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. శాంట్నర్, సోధిలు స్పిన్ విభాగం చూసుకోనున్నారు.
పిచ్ రిపోర్టు : అబుదాబి పిచ్ క్యూరేటర్ మోహన్ సింగ్ అకాల మరణంతో ఇక్కడి మైదాన సిబ్బంది శోకసంద్రంలో ఉన్నారు. మెగా టోర్నీలో పరుగుల పసందు అందించిన ఏకైక వేదిక అబుదాబి. నేడు మ్యాచ్‌కు సెంటర్ పిచ్ (నం.7)ను వినియోగిస్తున్నారు. దీంతో వికెట్‌కు అన్ని వైపులా సమదూరంలో బౌండరీలు ఉండనున్నాయి. గత మూడు మ్యాచుల్లో ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యాయి. టాస్ నెగ్గిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉండనుంది.
తుది జట్లు (అంచనా) :
న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్, డార్లీ మిచెల్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్, ఆడం మిల్నె, టిమ్ సౌథీ, ఇశ్ సోధి, ట్రెంట్ బౌల్ట్.
ఇంగ్లాండ్ : జోశ్ బట్లర్ (వికెట్ కీపర్), జానీ బెయిర్‌స్టో, డెవిడ్ మలాన్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), లియాం లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, శామ్ బిల్లింగ్స్/డెవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, మార్క్‌వుడ్.