Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి టెస్టుకు రహానె సారథ్యం
- కివీస్‌తో భారత్ టెస్టు సిరీస్
ముంబయి : బయో బబుల్ యుగంలో ఆటగాళ్లకు అవసరమైన విశ్రాంతి, కుటుంబంతో తగిన మోతాదులో విలువైన సమయం గడిపే విధంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కసరత్తులు మొదలుపెట్టింది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు విరాట్ కోహ్లికి విశ్రాంతి ఇచ్చిన సెలక్టర్లు.. తాజాగా టెస్టు సిరీస్ నుంచి రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వనున్నారు. ఈ మేరకు గురువారం సమావేశమైన సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు విరాట్ కోహ్లి సైతం దూరం కానుండటంతో అజింక్య రహానె తొలి టెస్టులో భారత్‌కు నాయకత్వం వహించనున్నాడు. విరాట్ కోహ్లి పితృత్వ సెలవులో ఉండగా ఆస్ట్రేలియాలో అద్వితీయ విజయాన్ని అందించిన రహానె.. ఇప్పుడు స్వదేశంలో సవాల్‌కు సిద్ధం కానున్నాడు. టెస్టు ఫార్మాట్లో భారత కీలక ఆటగాల్లు రిషబ్ పంత్ సహా పేసర్లు జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమిలకు సైతం విశ్రాంతి లభించనుంది. మరో పేసర్ శార్దుల్ ఠాకూర్ సైతం టెస్టు సీరీస్‌కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. రోహిత్ శర్మ గైర్హాజరీతో ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్‌లను కెఎల్ రాహుల్‌కు జతగా ఎంపిక చేయనున్నారు. రిషబ్ పంత్ స్థానంలో వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా జట్టులోకి రానున్నాడు. పేస్ దళానికి హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ నాయకత్వం వహించే సూచనలు కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టును సీనియర్ సెలక్షన్ కమిటీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.