Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాణించిన బాబర్ ఆజామ్
- ఆసీస్‌పై పాకిస్థాన్ 176/4
నవతెలంగాణ-దుబాయ్
మహ్మద్ రిజ్వాన్ (67, 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఫకర్ జమాన్ (55 నాటౌట్, 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో చెలరేగారు. టాప్ ఆర్డర్లో మహ్మద్ రిజ్వాన్, మిడిల్ ఆర్డర్లో ఫకర్ జమాన్ చెలరేగటంతో ఐసీసీ టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ 176/4 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజామ్ (39, 34 బంతుల్లో 5 ఫోర్లు) మరో బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. పాకిస్థాన్ బ్యాటర్లు ఆధిపత్యం చూపించిన పోరులో ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా (1/22), మిచెల్ స్టార్క్ (2/38) రాణించారు.
ఆరంభంలో నెవ్మదిగా..! : కీలక టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. పవర్ ప్లేలో నెమ్మదిగా ఆడే అలవాటున్న పాకిస్థాన్ సెమీఫైనల్లో కాస్త మెరుగుదల చూపించింది. ఆరంభంలో డెవిడ్ వార్నర్, జంపాలు వదిలేసిన క్యాచులు సైతం పాకిస్థాన్‌కు కలిసొచ్చాయి. ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్ (67), బాబర్ ఆజామ్ (39)లు మంచి ఆరంభం అందించారు. పవర్‌ప్లేను 47/0తో మెరుగ్గా ముగించిన ఓపెనర్లు.. మిడిల్ ఆర్డర్ దూకుడుకు చక్కటి పునాది వేశారు. ఫీల్డింగ్ నిబంధనలు తొలగిన అనంతరం ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో పాకిస్థాన్‌కు ఆశించిన మేరకు పరుగులు పిండుకోలేదు. జంపాపై ఎదురుదాడికి ప్రయత్నించిన బాబర్ ఆజామ్ బౌండరీ లైన్ వద్ద క్యాచౌట్‌గా నిష్క్రమించాడు. బాబర్ ఆజామ్ నిష్క్రమణ సమయానికి పాకిస్థాన్ పది ఓవర్లలో 71/1 పరుగులతో నిలిచింది.
బ్యాంగ్‌బ్యాంగ్ : టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పరుగుల ప్రవాహం చివరి ఓవర్లలోనే సాగింది. సెమీఫైనల్లోనూ బాబర్‌సేన అదే కొనసాగించింది. ప్రథమార్థంలో 28 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్.. విరామం అనంతరం రెచ్చిపోయాడు. మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో 41 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. రిజ్వాన్‌కు ఫకర్ జమాన్ (55 నాటౌట్) తోడయ్యాడు. దీంతో పాక్ స్కోరు వేగంగా ముందుకెళ్లింది. రిజ్వాన్ నిష్క్రమణ అనంతరం ఫకర్ జమాన్ విశ్వరూపం దాల్చాడు. అసిఫ్ అలీ (0), షోయబ్ మాలిక్ (1) నిరాశపరిచినా.. ఫకర్ జమాన్ బ్యాంగ్ బ్యాంగ్‌తో పాక్ భారీ స్కోరు చేసింది. స్టార్క్ వేసిన చివరి ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టిన ఫకర్ 31 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ఫకర్ జోరుతో చివరి పది ఓవర్లలో పాకిస్థాన్ 105 పరుగులు పిండుకుంది.
స్కోరు వివరాలు :
పాకిస్థాన్ ఇన్నింగ్స్ : మహ్మద్ రిజ్వాన్ (సి) స్మిత్ (బి) స్టార్క్ 67, బాబర్ ఆజామ్ (సి) వార్నర్ (బి) జంపా 39, ఫకర్ జమాన్ నాటౌట్ 55, అసిఫ్ అలీ (సి) స్మిత్ (బి) కమిన్స్ 0, షోయబ్ మాలిక్ (బి) స్టార్క్ 1, మహ్మద్ హఫీజ్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 13, మొత్తం : (20 ఓవర్లలో 4 వికెట్లకు) 176.
వికెట్ల పతనం : 1-71, 2-143, 3-158, 4-162.
బౌలింగ్ : మిచెల్ స్టార్క్ 4-0-38-2, జోశ్ హజిల్‌వుడ్ 4-0-49-0, గ్లెన్ మాక్స్వెల్ 4-0-20-0, పాట్ కమిన్స్ 4-0-30-1, ఆడం జంపా 4-0-22-1, మిచెల్ మార్ష్ 1-0-11-0.