Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్కంఠ సెమీస్‌లో ఆస్ట్రేలియా గెలుపు
- ఛేదనలో వేడ్, స్టోయినిస్, వార్నర్ మెరుపుల్
- పాకిస్థాన్ 176/4, ఆస్ట్రేలియా 177/5
ఆస్ట్రేలియా అదరగొట్టింది. హాట్ ఫేవరేట్, భీకర ఫామ్‌లో ఉన్న పాకిస్థాన్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. ఐసీసీ 2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్లోకి చేరుకుంది. 177 పరుగుల భారీ ఛేదనలో డెవిడ్ వార్నర్ (49) గట్టి పునాది వేసినా.. చివర్లో మాథ్యూ వేడ్ (41 నాటౌట్, 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), మార్కస్ స్టోయినిస్ (40 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్‌లతో పాకిస్థాన్‌కు షాకిచ్చారు. పాక్ స్టార్ సీమర్ షహీన్ షా అఫ్రిదిపై వరుసగా మూడు సిక్సర్లు బాదిన వేడ్ మరో ఆరు బంతులు ఉండగానే ఆసీస్‌ను ఫైనల్లోకి చేర్చాడు. పాకిస్థాన్ ఓటమితో టీ20 ప్రపంచకప్ ఫైనల్ పొరుగు దేశాల పోరుగా మారింది. ఆదివారం నాటి ఫైనల్లో చిరకాల ప్రత్యర్థులు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పొట్టి కప్పు కోసం పోటీపడనున్నారు.
నవతెలంగాణ-దుబాయ్
చివరి 12 బంతుల్లో 22 పరుగులు. క్రీజులో మాథ్యూ వేడ్, మార్కస్ స్టోయినిస్. బంతి పాక్ ప్రమాదకర సీమర్ షహీన్ షా అఫ్రిది చేతిలో. మ్యాచ్ పూర్తిగా పాక్ నియంత్రణలోనే ఉంది. అఫ్రిది ఓవర్లో ఆరు పరుగులు చేసినా.. ఆసీస్‌కు అది గొప్పే అనిపించిన సందర్భం. అందుకు తగినట్టుగానే తొలి రెండు బంతులు ఆసీస్‌ను ఇరకాటంలో పెట్టాయి. మూడో బంతికి మాథ్యూ వేడ్ భారీ షాట్‌కు వెళ్లాడు.. డీప్ మిడ్వికెట్లో హసన్ అలీ క్యాచ్ వదిలేయటంతో ఆసీస్ రెండు పరుగులు తీసుకుంది. ఆ తర్వాత వరుసగా మూడు బంతుల్లో అద్వితీయ సిక్సర్లు బాదిన మాథ్యూ వేడ్ పాకిస్థాన్‌ను షాక్‌లోకి నెట్టాడు. రెండు స్కూప్ షాట్లతో వేడ్ సాధించిన సిక్సర్లు మ్యాచ్‌కే హైలైట్. మాథ్యూ వేడ్ (41 నాటౌట్)తో పాటు మార్కస్ స్టోయినిస్ (40 నాటౌట్, 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఓపెనర్ డెవిడ్ వార్నర్ (49, 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించటంతో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ మహ్మద్ రిజ్వాన్ (67, 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఫకర్ జమాన్ (55 నాటౌట్, 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో 176/4 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
వేడ్, స్టోయినిస్ కొట్టేశారు : ఛేదనలో పాక్ బౌలర్లు ఆరంభంలో ఆసీస్ బాగా కట్టడి చేశారు. షహీన్ దెబ్బకు ఫించ్ (0) వికెట్‌తో ఆసీస్ దూకుడుకు కళ్లెం పడగా.. స్పిన్నర్ షాదాబ్ ఖాన్ (4/26) మాయజాలంతో ఆసీస్ బ్యాటర్లు డగౌట్‌కు చేరుకున్నారు. పవర్‌ప్లేలో ఇమద్ వసీంపై దాడితో ఆసీస్ రేసును ఆరంభించిన డెవిడ్ వార్నర్ (49) ఆ జట్టు ఆశలు నిలిపాడు. మార్ష్ (28), స్మిత్ (5), మాక్స్వెల్ (7) సహా వార్నర్ స్వల్ప విరామంలో వికెట్లు కోల్పోయారు. 96/5తో మరో 46 బంతుల్లో 81 పరుగులు అవసరమైన దశలో జతకలిసిన స్టోయినిస్ (40), మాథ్యూ వేడ్ (41)లు మరో ఆరు బంతులు ఉండగానే కథ ముగించారు. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయటంతో ఆసీస్ పని కష్టంగా సాగింది. వికెట్ కాపాడుకుని కాచుకున్న వేడ్, స్టోయినిస్ చివర్లో చెలరేగారు. టోర్నీలోనే అసమాన ప్రదర్శన చేసిన షహీన్ షా అఫ్రిదిపై కండ్లుచెదిరే సిక్సర్లతో ఆసీస్‌ను ఫైనల్లోకి చేర్చాడు వేడ్. మాథ్యూ వేడ్ హీరోయిక్ విన్యాసంతో స్పిన్నర్ షాదాబ్ ఖాన్, బ్యాటర్ ఫకర్ జమాన్ అద్భుత ప్రదర్శనలు వృథా అయ్యాయి.
రిజ్వాన్, జమాన్ ధనాధన్ : ఆరంభంలో లభించిన జీవనదానాలతో ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్ (67), బాబర్ ఆజామ్ (39)లు మంచి ఆరంభం అందించారు. పవర్‌ప్లేను 47/0తో మెరుగ్గా ముగించిన ఓపెనర్లు.. మిడిల్ ఆర్డర్ దూకుడుకు చక్కటి పునాది వేశారు. జంపాపై ఎదురుదాడికి ప్రయత్నించిన బాబర్ ఆజామ్ బౌండరీ లైన్ వద్ద క్యాచౌట్‌గా నిష్క్రమించాడు. బాబర్ ఆజామ్ నిష్క్రమణ సమయానికి పాకిస్థాన్ పది ఓవర్లలో 71/1 పరుగులతో నిలిచింది. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పరుగుల ప్రవాహం చివరి ఓవర్లలోనే సాగింది. సెమీఫైనల్లోనూ బాబర్‌సేన అదే కొనసాగించింది. ప్రథమార్థంలో 28 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్.. విరామం అనంతరం రెచ్చిపోయాడు. మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో 41 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. రిజ్వాన్‌కు ఫకర్ జమాన్ (55 నాటౌట్) తోడయ్యాడు. దీంతో పాక్ స్కోరు వేగంగా ముందుకెళ్లింది. రిజ్వాన్ నిష్క్రమణ అనంతరం ఫకర్ జమాన్ విశ్వరూపం దాల్చాడు. అసిఫ్ అలీ (0), షోయబ్ మాలిక్ (1) నిరాశపరిచినా.. ఫకర్ జమాన్ బ్యాంగ్ బ్యాంగ్‌తో పాక్ భారీ స్కోరు చేసింది. స్టార్క్ వేసిన చివరి ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టిన ఫకర్ 31 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ఫకర్ జోరుతో చివరి పది ఓవర్లలో పాకిస్థాన్ 105 పరుగులు పిండుకుంది.
స్కోరు వివరాలు :
పాకిస్థాన్ ఇన్నింగ్స్ : మహ్మద్ రిజ్వాన్ (సి) స్మిత్ (బి) స్టార్క్ 67, బాబర్ ఆజామ్ (సి) వార్నర్ (బి) జంపా 39, ఫకర్ జమాన్ నాటౌట్ 55, అసిఫ్ అలీ (సి) స్మిత్ (బి) కమిన్స్ 0, షోయబ్ మాలిక్ (బి) స్టార్క్ 1, మహ్మద్ హఫీజ్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 13, మొత్తం : (20 ఓవర్లలో 4 వికెట్లకు) 176.
వికెట్ల పతనం : 1-71, 2-143, 3-158, 4-162.
బౌలింగ్ : మిచెల్ స్టార్క్ 4-0-38-2, జోశ్ హజిల్‌వుడ్ 4-0-49-0, గ్లెన్ మాక్స్వెల్ 4-0-20-0, పాట్ కమిన్స్ 4-0-30-1, ఆడం జంపా 4-0-22-1, మిచెల్ మార్ష్ 1-0-11-0.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ : డెవిడ్ వార్నర్ (సి) రిజ్వాన్ (బి) షాదాబ్ 49, అరోన్ ఫించ్ (ఎల్బీ) షహీన్ షా అఫ్రిది 0, మిచెల్ మార్ష్ (సి) అసిఫ్ అలీ (బి) షాదాబ్ ఖాన్ 28, స్టీవెన్ స్మిత్ (సి) ఫకర్ జమాన్ (బి) షాదాబ్ ఖాన్ 5, గ్లెన్ మాక్స్వెల్ (సి) రవూఫ్ (బి) షాదాబ్ ఖాన్ 7, మార్కస్ స్టోయినిస్ నాటౌట్ 40, మాథ్యూ వేడ్ నాటౌట్ 41, ఎక్స్‌ట్రాలు : 7, మొత్తం :(19 ఓవర్లలో 5 వికెట్లకు) 177.
వికెట్ల పతనం : 1-1, 2-52, 3-77, 4-89, 5-96.
బౌలింగ్ : షహీన్ షా అఫ్రిది 4-0-35-1, ఇమద్ వసీం 3-0-25-0, హరీశ్ రవూఫ్ 3-0-32-0, హసన్ అలీ 4-0-44-0, షాదాబ్ ఖాన్ 4-0-26-4, మహ్మద్ హఫీజ్ 1-0-13-0.