Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెస్టు జట్టు నుంచి ఉద్వాసన
- భారత్-ఏతో సఫారీ పర్యటనకు ఎంపిక
నవతెలంగాణ క్రీడావిభాగం
తెలుగు తేజం, లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హనుమ విహారి చివరగా భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన టెస్టులో ఒంటికాలుతో ఆడాడు. తొడ కాండరం గాయంతో తీవ్ర నొప్పి వేధిస్తున్నా రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి సిడ్నీ టెస్టులో భారత్‌ను ఓటమి కోరల్లోంచి బయట పడేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా రెండో టెస్టు సిరీస్ విజయానికి పునాది పడింది అక్కడే. ఆ టెస్టులో విహారి రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాకపోతే.. తర్వాతి టెస్టులో విరాట్ కోహ్లి పితృత్వ సెలవులో ఉన్నందున మిడిల్ ఆర్డర్లో మరో విలువైన అవకాశం లభించే అవకాశం ముందుంది. అయినా, సిడ్నీ టెస్టులో క్రీజులోకి వచ్చిన వీరోచిత ఇన్నింగ్స్‌తో చిరస్మరణీయ టెస్టు సిరీస్ విజయానికి గట్టి పునాది వేయటంతో పాటు డ్రెస్సింగ్‌రూమ్‌లో వెలకట్టలేని ఆత్మవిశ్వాసం నింపాడు. అంత గొప్ప ఇన్నింగ్స్‌తో కదం తొక్కిన హనుమ విహారి ఫిట్నెస్ సాధించగానే నేరుగా జట్టులోకి వస్తారనే ఆశించటం అత్యంత సహజం. అందుకు విరుద్ధంగా సీనియర్ సెలక్షన్ కమిటీ హనుమ విహారిని టెస్టు జట్టులోకి తీసుకోలేదు. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేసిన కొద్ది వ్యవధిలోనే హనుమ విహారికి దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత్-ఏ జట్టులోకి ఎంపిక చేస్తూ బీసీసీఐ ట్వీట్ చేసింది.
వేటా? ముందుచూపా?! : వాస్తవానికి, ఆస్ట్రేలియాతో సిరీస్‌లో సిడ్నీ టెస్టు తర్వాత హనుమ విహారి మళ్లీ భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించలేదు. గాయం కారణంగానే ఇంగ్లాండ్ పర్యటనకు, అంతకముందు ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కూ దూరమయ్యాడు. ఫిట్నెస్ సాధించిన విహారి ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు ఇద్దరూ విశ్రాంతి తీసుకుంటున్న టెస్టు సిరీస్ నుంచి హనుమ విహారికి ఉద్వాసన పలుకటం క్రికెట్ వర్గాలో ఆశ్చర్యానికి కారణమైంది. రోహిత్, పంత్, బుమ్రా, షమి సహా కోహ్లిలకు విశ్రాంతి ఇస్తున్నారనే తెలుస్తోంది. సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ ఎవరిని తప్పించటం వెనుక కారణాన్ని వెల్లడించలేదు. చాలా కాలంగా బయో బబుల్‌లో ఉంటున్న ఆటగాళ్లను టెస్టు సిరీస్‌కు దూరం ఉంచితే విశ్రాంతిగా భావించవచ్చు. కానీ గాయంతో జట్టుకు దూరమై.. ఫిట్నెస్ సాధించి సెలక్టర్ల పిలుపు కోసం ఎదురుచూస్తున్న విహారిని దూరం పెడితే వేటు వేశారనే అనిపిస్తోంది.
హనుమ విహారిని పక్కనపెట్టడానికి మరో కారణం సైతం బలంగా వినిపిస్తోంది. హనుమ విహారి ఆడిన 12 టెస్టుల్లో స్వదేశంలో ఒకే ఒక్క టెస్టులో బరిలోకి దిగాడు. స్వదేశంలో భారత్ సహజంగా ఐదుగురు బ్యాటర్లతో ఆడుతుంది. విదేశీ గడ్డపై అదనపు బ్యాటర్‌ను తుది జట్టులోకి తీసుకుంటారు. దీంతో హనుమ విహారి విదేశీ టెస్టులోనే తుది జట్టులో నిలిచేందుకు అధిక అవకాశాలు ఉంటాయి. న్యూజిలాండ్‌తో సిరీస్ అనంతరం భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. దీంతో కీలక సిరీస్‌కు ముందు అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు హనుమ విహారికి విలువైన అవకాశం కల్పించేందుకు అతడిని భారత్-ఏ జట్టుకు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. సీనియర్ సెలక్షన్ కమిటీ మీడియా ముందుకు రాకపోవటంతో అసలు ఉద్దేశం ఏమిటనేది అవగతం కావటం లేదు. ఒకవేళ న్యూజిలాండ్‌తో సిరీస్‌లో మిడిల్ ఆర్డర్లో శుభ్‌మన్ గిల్ మెరిస్తే.. అప్పుడే సఫారీ పర్యటనలోనూ అతడినే మిడిల్ ఆర్డర్లో కొనసాగించే ప్రమాదం లేకపోలేదు. గాయపడిన ఆటగాడు ఫిట్నెస్ సాధిస్తే నేరుగా జట్టులోకి తీసుకోవాలనేది కొంతకాలంగా కోహ్లిసేన డ్రెస్సింగ్‌రూమ్ అనధికారిక నియమం. ఆ నిబంధన మన తెలుగు కుర్రాడు హనుమ విహారి విషయంలో సెలక్షన్ కమిటీ, జట్టు మేనేజ్మెంట్ మరువటం బాధాకరం.