Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోహిత్, పంత్, బుమ్రా, షమి, కోహ్లిలకు విశ్రాంతి
- రెండో టెస్టు నుంచి అందుబాటులో విరాట్ కోహ్లి
- తెలుగు తేజం హనుమ విహారికి దక్కని చోటు
- న్యూజిలాండ్‌తో సిరీస్‌కు భారత టెస్టు జట్టు ప్రకటన
ఐసీసీ 2021 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ పునరావృతం కానున్న టెస్టు సిరీస్ కళ తప్పనుంది!. కాన్పూర్, ముంబయిలలో జరిగే ఐదు రోజుల ఆటకు టీమ్ ఇండియా ప్రధాన ఆటగాళ్లు దూరం కానున్నారు. రోహిత్ శర్మ, రిషబ్ పంత్, జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమిలు టెస్టు సిరీస్‌కు దూరం కాగా.. విరాట్ కోహ్లి తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో తెలుగు తేజం హనుమ విహారికి చోటు దక్కలేదు.
నవతెలంగాణ-ముంబయి
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి.. ఈ ఆటగాళ్లు లేని టీమ్ ఇండియా టెస్టు జట్టును ఊహించలేం. ఐసీసీ రెండో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగనున్న కీలక సిరీస్‌కు ప్రధాన ఆటగాళ్లు దూరమయ్యారు. సుదీర్ఘ కాలం పాటు బయో బబుల్‌లో గడుపుతున్న స్టార్ క్రికెటర్లకు విశ్రాంతి ఇచ్చేందుకు సీనియర్ సెలక్షన్ కమిటీ అనివార్య నిర్ణయం తీసుకుంది. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి టీ20 సిరీస్‌తో పాటు తొలి టెస్టుకు దూరం కానున్నాడు. టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ రెండు టెస్టులకూ అందుబాటులో ఉండటం లేదు. విరాట్ కోహ్లి లేని వేళ కాన్పూర్ టెస్టులో భారత జట్టుకు అజింక్య రహానె నాయకత్వం వహించనున్నాడు. టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్ చతేశ్వర్ పుజార వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. నవంబర్ 25-29న తొలి టెస్టు కాన్పూర్‌లో జరుగనుండగా.. డిసెంబర్ 3-7న రెండో టెస్టు ముంబయిలో షెడ్యూల్ చేశారు.
కొత్త కూర్పు : అరంగ్రేట ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ రన్నరప్‌గా నిలిచిన భారత్.. రెండో సీజన్‌ను ప్రధాన ఆటగాళ్లు లేకుండానే ఆరంభించనుంది. డిఫెండింగ్ చాంపియన్‌ను ఎదుర్కొనేందుకు యువ జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. కీలక ఆటగాళ్లు లేని వేళ తుది జట్టు కూర్పు కొత్తగా కనిపించనుంది. రోహిత్ శర్మ స్థానంలో కెఎల్ రాహుల్‌కు జతగా మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్‌లలో ఒకరు తుది జట్టులో నిలిచే అవకాశం ఉంది. మిడిల్ ఆర్డర్లో విరాట్ కోహ్లి స్థానం కోసం శుభమన్ గిల్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ సైతం పోటీ పడనున్నాడు. మిడిల్ ఆర్డర్లో రోహిత్ శర్మకే గట్టి పోటీనిచ్చిన తెలుగు తేజం హనుమ విహారికి జట్టులో చోటు లభించలేదు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్థానంలో వృద్దిమాన్ సాహా, తెలుగు తేజం కెఎస్ భరత్లె ఎంపికయ్యారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి వికెట్ కీపర్ బ్యాటర్‌గా నిలిచిన కెఎస్ భరత్ ఇటీవల ఐపీఎల్‌లోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ తరఫున స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశాడు. బౌలింగ్ విభాగంలో శార్దుల్ ఠాకూర్‌కు చోటు దక్కలేదు. టీ20 సిరీస్‌కు సైతం శార్దుల్ ఠాకూర్ దూరమైన సంగతి తెలిసిందే.
టెస్టు ఫార్మాట్లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు స్పిన్ విభాగాన్ని నడిపించనున్నారు. అక్షర్ పటేల్‌తో పాటు జయంత్ యాదవ్ సైతం జట్టులోకి ఎంపికయ్యారు. చేతి వేలి గాయానికి గురైన వాషింగ్టన్ సుందర్ స్థానంలో జయంత్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. 2016-17 సీజన్లో భారత్‌కు అరంగ్రేటం చేసిన జయంత్ యాదవ్ తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదించాడు.పేస్ విభాగంలో ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్‌లకు తోడు ప్రసిద్ కృష్ణ తొలిసారి టెస్టు జట్టులోకి ఎంపికయ్యాడు.
భారత టెస్టు జట్టు : అజింక్య రహానె (కెప్టెన్), కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజార (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, వృద్దిమాన్ సాహా (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, విరాట్ కోహ్లి ( రెండో టెస్టుకు).