Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హరియాణా సోసైటీల రిజిస్ట్రార్ ఉత్తర్వులు
- నూతన కార్యదర్శిగా తేజ్‌రాజ్ సింగ్ ఏకగ్రీవం
న్యూఢిల్లీ : జాతీయ హ్యాండ్‌బాల్ సమాఖ్యలో వివాదానికి దారితీసిన అడ్మినిస్ట్రేటర్ నియామకానికి హరియాణా సోసైటీల రిజస్ట్రార్ ముగింపు పలికారు. అడ్మినిస్ట్రేటర్ నియామకం అక్రమమని అధ్యక్షుడు జగన్మోహన్ రావు వర్గం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. పది రోజుల్లో పరిష్కారం చూపాలని హరియాణా రిజిస్ట్రార్‌కు కోర్టు సూచించింది. విచారణ అనంతరం అడ్మినిస్ట్రేటర్ నియామకం చెల్లదని రిజిస్ట్రార్ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ప్రస్తుత కార్యవర్గం యథావిధిగా కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి అడ్డంకులు తొలగిపోయాయి. పూర్తి స్థాయి కార్యదర్శిగా తేజ్‌రాజ్ సింగ్ గత నెలలో హైదరాబాద్‌లో జరిగిన ఏజీఎంలో ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. వివాదం నేపథ్యంలో అధికారిక ప్రకటన వాయిదా పడింది. లక్నోలోని హెచ్ఎఫ్ఐ ప్రధాన కార్యాలయంలో తేజ్ రాజ్‌ను నూతన కార్యదర్శిగా ఎన్నుకున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యక్షులుగా డి.కె. సింగ్, హిమానియ సింగ్‌లను ఎన్నుకున్నట్టు హెచ్ఎఫ్ఐ తెలిపింది. ' హ్యాండ్‌బాల్ సమాఖ్యలో రాజకీయాలకు పూర్తిగా చరమగీతం పాడాం. ఇక క్రీడాభివృద్ది తప్ప రాజకీయాలకు తావు లేదు. మౌళిక సదుపాయాల అభివృద్దిపై దృష్టి సారిస్తూ దేశవ్యాప్తంగా టోర్నీలు నిర్వహిస్తామని' హెచ్ఎఫ్ఐ అధ్యక్షులు జగన్మోహన్ రావు అన్నారు.