Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్ నేడు
- తొలి టైటిల్‌పై ఆసీస్, కివీస్ కన్ను
- రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
2015 వన్డే వరల్డ్‌కప్. 2019 వన్డే వరల్డ్‌కప్. 2021 టీ20 వరల్డ్‌కప్. ఐసీసీ చివరి మూడు ప్రపంచకప్‌లలో న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరుకుంది. ప్రపంచ క్రికెట్లో అత్యంత నిలకడగా అద్వితీయ ప్రదర్శన చేస్తున్న న్యూజిలాండ్ ఈ ఏడాది ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ గదను గెల్చుకుంది. ఐసీసీ ఈవెంట్లలో ఆ విజయ పరంపరను దుబాయ్ లోనూ కొనసాగించేందుకు సిద్ధమవుతోంది.
ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియాది తిరుగులేని ఆధిపత్యం. 1981 తర్వాత ఈ రెండు జట్లు 16 నాకౌట్ మ్యాచుల్లో తలపడగా అన్నింటా కంగారూలదే విజయం. నాకౌట్ సమరంలో 40 ఏండ్ల ఆసీస్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు న్యూజిలాండ్ నేడు ప్రయత్నించనుంది.
పొరుగు దేశాలు, సహజ ప్రత్యర్థులు. గ్రూప్ దశలో, సెమీఫైనల్లోనూ ఒకే తరహా ప్రదర్శన. ఆసీస్ బ్యాటింగ్ విభాగంలో బలంగా ఉండగా, కివీస్ బౌలింగ్ విభాగంలో దుర్బేద్యంగా కనిపిస్తోంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను తొలిసారి అందుకునేందుకు దుబారులో నేడు ఆసీస్, కివీస్ మహా పోరుకు రెఢ అయ్యాయి. విజయం ఎవరిని వరించినా పొట్టి కప్పుకు కొత్త హీరో ఖాయం!.
నవతెలంగాణ- దుబాయ్
ఆధునిక క్రికెట్ అవకాశాల సృష్టిలో ముందు నిలుస్తోంది!. రెండేండ్ల క్రితం ' నేను క్రికెటర్ కాకపోయి ఉంటే బాగుండేది' అంటూ 2019 వరల్డ్‌కప్ ఫైనల్లో ఓటమి అనంతరం జేమ్స్ నీషమ్ అంతులేని ఆవేదనతో కూడిన ట్వీట్ చేశాడు. క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు చెప్పే ఆలోచన సైతం నీషమ్ మదిలో మెదిలింది. ఓ ఏడాది క్రితం.. నెట్ బౌలర్, టీ20 స్పెషలిస్ట్‌లతో కూడిన జట్టు చేతిలో ఆస్ట్రేలియా స్వదేశీ టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. వెస్టిండీస్, బంగ్లాదేశ్ చేతుల్లోనూ భంగపడింది. జస్టిన్ లాంగర్ శిక్షణ పద్దతులపై, ఆసీస్ ప్రదర్శనపై ఎన్నడూ లేని స్థాయిలో సమీక్ష కనిపించింది. ఈ పరిస్థితులను అధిగమిస్తూ అటు న్యూజిలాండ్, ఇటు ఆస్ట్రేలియాలు నేడు ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకున్నాయి. తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను అందుకునేందుకు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఆరాట పడుతున్నాయి. కివీస్‌పై చారిత్రక ఆధిపత్యంతో ఆసీస్ గెలుపుపై దీమా ప్రదర్శిస్తుండగా.. ఐసీసీ ఈవెంట్లలో ఈ శకం ఇక మాదేనంటూ కివీస్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది.
బలమైన బ్యాటింగ్ : సూపర్12 గ్రూప్ దశలో నాలుగు విజయాలు సాధించిన ఆస్ట్రేలియాకు భీకర బ్యాటింగ్ లైనప్ ప్రధాన బలం. కెప్టెన్ అరోన్ ఫించ్ మినహా అందరూ ఫామ్‌లో ఉన్నారు. డెవిడ్ వార్నర్ మునుపటి స్థాయిలో విరుచుకుపడుతున్నాడు. మిచెల్ మార్ష్ ప్రమాదకరంగా ఆడుతున్నాడు. మాథ్యూ వేడ్, మార్కస్ స్టోయినిస్‌లు ముగింపులో రాటుదేలారు. మిడిల్ ఆర్డర్లో స్టీవ్ స్మిత్ బాధ్యతాయుత బ్యాటింగ్‌తో సమతూకం తీసుకొస్తున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసినా, లక్ష్యాన్ని ఛేదించినా ఆసీస్ సంతోషమే. న్యూజిలాండ్ స్పిన్నర్ల నుంచి ఎదురయ్యే ప్రమాదం ఒక్కటే కంగారూలను కంగారు పెడుతోంది. ఇశ్ సోధి, మిచెల్ శాంట్నర్‌లు ఆసీస్ బ్యాటర్లపై నియంత్రణ సాధించారు. సెమీస్‌లో పాక్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ నాలుగు వికెట్లతో ఆసీస్‌ను విలవిల్లాడించాడు. పవర్‌ప్లేలో బౌల్ట్, సౌథీ పట్టు కోల్పోతే.. విలియమ్సన్ తక్షణమే సోధిని రంగంలోకి దంపే అవకాశం ఉంది. వార్నర్ సహా ఇతర బ్యాటర్లు అందరూ కివీస్ స్పిన్ ఫోబియో ఎదుర్కొంటున్నారు. సోధి, శాంట్నర్ ఎనిమిది ఓవర్లను ఎదుర్కొవటంపై ఆసీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. కమిన్స్, స్టార్క్, హజిల్వుడ్లు పేస్ బాధ్యతలు చూసుకోనున్నారు. ఆడం జంపా అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. వైవిధ్యం చూపిస్తూ లెంగ్త్‌లు మార్పు చేస్తూ జంపా బ్యాటర్లపై పైచేయి సాధిస్తున్నాడు.
బౌలింగ్ బలంతో.. : సూపర్12 గ్రూప్ దశలో న్యూజిలాండ్ సైతం నాలుగు విజయాలే సాధించి గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచింది. మిడిల్ ఆర్డర్లో డెవాన్ కాన్వే లోటు కివీస్‌కు ప్రతికూలంగా మారనుంది. సీనియర్ బ్యాటర్ మార్టిన్ గప్టిల్, కెప్టెన్ కేన్ విలియమ్సన్‌లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయటం లేదు. డార్లీ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్‌లు కివీస్‌కు కీలకం కానున్నారు. వికెట్ కీపర్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్ తన విలక్షణ బ్యాటింగ్ శైలిలో డెత్ ఓవర్లలో ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారే అవకాశం లేకపోలేదు. టిమ్ సౌథి ఈ టోర్నీలోనే అత్యంత విజయవంతమైన పేసర్. పవర్‌ప్లేలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న సౌథిని ఎదుర్కొవటం ఆసీస్‌కు సవాల్‌గా నిలువనుంది. ట్రెంట్ బౌల్ట్, ఆడం మిల్నెలు సైతం మంచి ఫామ్‌లో ఉన్నారు. వీరికి తోడు స్పిన్నర్లు సోధి, శాంట్నర్‌లు ఉండటంతో బౌలర్ల అండతోనే కివీస్ టీ20 ప్రపంచకప్ ట్రోఫీపై కన్నేసింది.
పిచ్ రిపోర్టు : టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు కొత్త పిచ్‌ను వాడనున్నారు. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుందని చెప్పవచ్చు. సెమీస్ మ్యాచ్‌లో ఇక్కడ మంచు ప్రభావం అంతగా కనిపించలేదు. అయినా, టైటిల్ పోరులో టాస్ నెగ్గిన జట్టు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసేందుకు మొగ్గు చూపవచ్చు. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 180 ప్లస్ పరుగులు చేస్తే గెలుపుపై దీమాగా ఉండవచ్చు.
తుది జట్లు (అంచనా) :
ఆస్ట్రేలియా : డెవిడ్ వార్నర్, అరోన్ ఫించ్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడం జంపా, జోశ్ హజిల్‌వుడ్.
న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్, డార్లీ మిచెల్, కేన్ విలియమ్సన్, టిమ్ సీఫర్ట్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, ఆడం మిల్నె, ట్రెంట్ బౌల్ట్, ఇశ్ సోధి.