Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీవీఎస్‌ను ఒప్పించిన బీసీసీఐ బాస్
న్యూఢిల్లీ : రాహుల్ ద్రవిడ్‌ను జాతీయ జట్టు చీఫ్ కోచ్‌గా తీసుకురావటంలో విజయవంతమైన సౌరవ్ గంగూలీ.. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్‌గా హైదరాబాదీ సొగసరి బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను ఒప్పించటంలోనూ సక్సెస్ సాధించాడు. అక్టోబర్ 15న ఐపీఎల్ 14 ఫైనల్ అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షాలు వీవీఎస్‌తో చర్చలు జరిపారు. తొలుత టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా లక్ష్మణ్‌ను తీసుకోవాలని భావించారు. రాహుల్ ద్రవిడ్ చీఫ్ కోచ్‌గా వచ్చేందుకు నిరాకరిస్తే ఆ బాధ్యత తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేసిన లక్ష్మణ్.. జాతీయ క్రికెట అకాడమీ బాధ్యతలకు మాత్రం విముఖత చూపినట్టు సమాచారం. రాహుల్ ద్రవిడ్ భారత జట్టు చీఫ్ కోచ్‌గా రావటంతో.. ఎన్సీఏలో అతడు మొదలుపెట్టిన బృహత్తర ప్రణాళికలను కొనసాగించేందుకు బోర్డుకు మరో జెంటిల్మెన్ అవసరం ఏర్పడింది. జాతీయ జట్టుకు, జాతీయ క్రికెట్ అకాడమీ నడుమ సత్సంబంధాలు ఉండాలని బోర్డు అభిలాష. లక్ష్మణ్, ద్రవిడ్ మధ్య అపూర్వ స్నేహబంధం ఉంది. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన గంగూలీ ఈమేరకు లక్ష్మణ్‌ను ఒప్పించారు. త్వరలోనే ఎన్సీఏ డైరెక్టర్ పదవికి బోర్డు దరఖాస్తులు ఆహ్వానించనుండగా.. వీవీఎస్‌ను ఎంపిక చేయటం లాంఛనం కానుంది. 'ఎన్సీఏ చీఫ్‌గా వచ్చేందుకు లక్ష్మణ్ అంగీకారం తెలిపారు. ఎన్సీఏలో ద్రవిడ్ అనంతరం ఆ స్థాయి వ్యక్తి రావాలని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా బలంగా కోరుకున్నారు. ద్రవిడ్, లక్ష్మణ్ నడుమ మంచి బంధం ఉంది. జాతీయ జట్టు, క్రికెట్ అకాడమీ నడుమ పరస్పర అంగీకార భావం ఉండాలని బోర్డు భావిస్తోంది. ఎన్సీఏలో లక్ష్మణ్ బాధ్యతలపై ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఎన్సీఏలో కొత్త ప్రణాళికలపై వీవీఎస్ ఇప్పటికే పలు ఆలోచనలు పంచుకున్నారు' అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాంఛైజీ మెంటార్‌గా వ్యవహరిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్ జీత భత్యాలపై బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎన్సీఏ డైరెక్టర్‌గా లక్ష్మణ్ తన మకాం హైదరాబాద్ నుంచి బెంగళూర్‌కు మార్చాల్సి ఉంటుంది.