Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియా సొంతం
- ఫైనల్లో కివీస్‌పై ఆసీస్ ఘన విజయం
- ఛేదనలో మార్ష్, వార్నర్ ధనాధన్
- కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్ వృథా
5 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీలు, 2 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విజయాలు, ఐసీసీ టెస్టు గదతో అగ్రజట్టుగా దశాబ్దానికి పైగా ఆధిపత్యం.. ఇదీ ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా ప్రస్థానం. ఈ విజయాలు ఏవీ టీ20 ప్రపంచకప్ లేని లోటు పూడ్చలేదు. పొట్టి కప్పు వేటలో ఓ సారి టైటిల్ పోరుకు చేరినా భంగపాటు తప్పలేదు. టీ20 ప్రపంచకప్ వేటలో ఈసారి ఆస్ట్రేలియా గురి తప్పలేదు. ప్రియ ప్రత్యర్థి న్యూజిలాండ్‌పై సాధికారిక ప్రదర్శన చూపిన ఆస్ట్రేలియా తొలిసారి పొట్టి కప్పును ముద్దాడింది. ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో న్యూజిలాండ్‌పై అజేయ రికార్డును కొనసాగించింది.
మిచెల్ మార్ష్ (77 నాటౌట్), డెవిడ్ వార్నర్ (53) అర్థ సెంచరీలతో 173 పరుగుల భారీ ఛేదనలో ఆస్ట్రేలియా అదరగొట్టింది. 18.5 ఓవర్లలోనే న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేన్ విలియమ్సన్ (85) మెరుపు ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్ మంచి స్కోరు సాధించినా.. మరోసారి ఐసీసీ ఫైనల్లో భంగపాటు తప్పలేదు.
నవతెలంగాణ-దుబాయ్
ఐసీసీ 2021 టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియా సొంతమైంది. మిచెల్ మార్ష్ (77 నాటౌట్, 50 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), డెవిడ్ వార్నర్ (53, 38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో చెలరేగారు. రెండో వికెట్‌కు 92 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన వార్నర్, మార్ష్ జోడీ ఆస్ట్రేలియాకు 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించింది. 173 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. తొలుత కేన్ విలియమ్సన్ (85, 48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్ 172/4 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆసీస్ పేసర్ జోశ్ హజిల్‌వుడ్ (3/16), పాట్ కమిన్స్ (0/27) న్యూజిలాండ్‌కు గొప్పగా కట్టడి చేశారు. మిచెల్ మార్ష్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకోగా.. డెవిడ్ వార్నర్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ విజేతగా ఐసీసీ ట్రోఫీతో పాటు రూ.12 కోట్ల నగదు బహుమతి సైతం ఆస్ట్రేలియా సొంతమైంది.
మార్ష్, వార్నర్ ధనాధన్ : 173 పరుగుల లక్ష్యం. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు ఛేదన. ఫామ్‌లో లేని కెప్టెన్ అరోన్ ఫించ్ (5) మరోసారి విఫలం. అయినా ఆస్ట్రేలియా దూకుడు తగ్గలేదు. డెవిడ్ వార్నర్ (53), మిచెల్ మార్ష్ (77)లు ధనాధన్ మోత మోగించారు. రెండో వికెట్‌కు వేగంగా 92 పరుగులు జోడించారు. మిచెల్ మార్ష్ ఎదుర్కొన్న మూడు బంతులను వరుసగా 6, 4, 4 బాదటంతో పవర్‌ప్లేను ఆసీస్ 43/1తో మెరుగ్గా ముగించింది. మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 34 బంతుల్లో వార్నర్ అర్థ సెంచరీ పూర్తి చేసుకోగా.. నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్లతో 31 బంతుల్లోనే మార్ష్ అర్థ శతకం సాధించాడు. ఈ ఇద్దరి భాగస్వామ్యంతో మ్యాచ్ ఆసీస్ గుప్పిట్లోకి వచ్చింది. వార్నర్‌ను బౌల్ట్ వెనక్కి పంపించినా గ్లెన్ మాక్స్వెల్ (28 నాటౌట్, 18 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) తోడుగా మార్ష్ లాంఛనం ముగించాడు. భారీ ఛేదనలో ఆసీస్ ఎక్కడా తడబాటుకు లోనవలేదు. ఆసీస్‌ను ఇరకాటంలో పెడతారుకున్న స్పిన్నర్లు వార్నర్, మార్ష్ ముందు తేలిపోయారు. 18.5 ఓవర్లలోనే ఆస్ట్రేలియా ఛేదన ముగించింది. న్యూజిలాండ్‌ను మరోసారి నైరాశ్యంలోకి నెట్టింది.
కేన్ మెరుపులు వృథా : కీలక టాస్ ఆసీస్ నెగ్గింది. తొలుత ఆసీస్ పేసర్లు జోశ్ హజిల్‌వుడ్, పాట్ కమిన్స్ నిప్పులు చెరిగారు. దీంతో పవర్‌ప్లేలో న్యూజిలాండ్ తడబడింది. పది ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోరు 57/1. ఈ పరిస్థితుల్లో న్యూజిలాండ్ గౌరవప్రద స్కోరు సాధిస్తుందనే అంచనాలు ఎవరికీ లేవు. సంప్రదాయ విధ్వంసకారుడు కేన్ విలియమ్సన్ (85, 48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో మిచెల్ స్టార్క్ ఓవర్లో హజిల్‌వుడ్ క్యాచ్ వదిలేయటంతో బతికిపోయిన విలియమ్సన్ (అప్పటికి కేన్ స్కోరు 21) అక్కడ్నుంచి రెచ్చిపోయాడు. స్టార్క్‌పై హ్యాట్రిక్ ఫోర్లతో దండెత్తిన విలియమ్సన్.. ఆ తర్వాత మాక్స్‌వెల్‌పై వరుస సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో వరుసగా 4, 4, 6, 0, 4, 4 బాదిన విలియమ్సన్ ఆ ఓవర్లో ఏకంగా 22 పరుగులు పిండుకున్నాడు. స్టార్క్‌పై 12 బంతుల్లోనే 39 పరుగులు పిండుకున్న విలియమ్సన్ 32 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. కేన్ దెబ్బకు స్టార్క్ నాలుగు ఓవరలో 60 పరుగులు ఇచ్చుకున్నాడు. ఆరంభంలో మార్టిన్ గప్టిల్ (28), మిడిల్లో గ్లెన్ ఫిలిప్స్ (18)లు కేన్‌కు చక్కటి సహకారం అందించారు. జేమ్స్ నీషమ్ (13 నాటౌట్), సీఫర్ట్ (8 నాటౌట్) మెరుగైన ముగింపు ఇచ్చారు. కేన్ విలియమ్సన్ దూకుడుతో చివరి పది ఓవర్లలో న్యూజిలాండ్ 115 పరుగులు సాధించింది. ఆసీస్ పేసర్లలో జోశ్ హజిల్‌వుడ్ (3/16) అద్భుతంగా రాణించాడు. స్పిన్నర్ ఆడం జంపా (1/26) సైతం ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. 172/4 పరుగులు చేసిన న్యూజిలాండ్ ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించింది.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : గప్టిల్ (సి) స్టోయినిస్ (బి) జంపా 28, మిచెల్ (సి) వేడ్ (బి) హజిల్‌వుడ్ 11, విలియమ్సన్ (సి) స్మిత్ (బి) హజిల్‌వుడ్ 85, ఫిలిప్స్ (సి) మాక్స్వెల్ (బి) హజిల్‌వుడ్ 18, నీషమ్ నాటౌట్ 13, సీఫర్ట్ నాటౌట్ 8, ఎక్స్‌ట్రాలు : 9, మొత్తం : (20 ఓవర్లలో 4 వికెట్లకు) 172. వికెట్ల పతనం : 1-28, 2-76, 3-144, 4-148. బౌలింగ్ :స్టార్క్ 4-0-60-0, హజిల్‌వుడ్ 4-0-16-3, మాక్స్వెల్ 3-0-28-0, కమిన్స్ 4-0-27-0, జంపా 4-0-26-1, మార్ష్ 1-0-11-0.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ : వార్నర్ (బి) బౌల్ట్ 53, ఫించ్ (సి) మిచెల్ (బి) బౌల్ట్ 5, మార్ష్ 77 నాటౌట్, మాక్స్వెల్ 28 నాటౌట్, ఎక్స్‌ట్రాలు : 10, మొత్తం : (18.5 ఓవర్లలో 2 వికెట్లకు) 173. వికెట్ల పతనం : 1-15, 2-107. బౌలింగ్ : బౌల్ట్ 4-0-18-2, సౌథీ 3.5-0-43-0, సోధి 4-0-30-0,శాంట్నర్ 3-0-23-0, నీషమ్ 1-0-15-0.