Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంగారూ ఖాతాలో తొలి టీ20 ప్రపంచకప్
- సరైన సమయంలో సరైన ఆటగాళ్ల దూకుడు
ప్రపంచకప్ విజయం ఆస్ట్రేలియాకు కొత్త కాదు. ఐదుసార్లు వన్డే వరల్డ్‌కప్‌ను గెల్చుకున్న ఏకైక జట్టు ఆసీస్. అయినా, పొట్టి ఫార్మాట్లో కంగారూలు మునుపెన్నడూ ప్రపంచకప్ నెగ్గలేదు. 2010లో టైటిల్ పోరుకు చేరుకున్నారు, కానీ ఇంగ్లాండ్ చేతిలో ఓటమి చెందారు.
వరుస వైఫల్యాలు, అసమగ్ర వనరులతో కూడిన జట్టు, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-5కి వెలుపల నిలిచి.. టైటిల్ ఫేవరేట్లలో ఆసీస్ పేరు గల్లంతైంది. ప్రపంచకప్‌కు స్టార్స్‌తో కూడిన జట్టు వచ్చినా సమిష్టిగా అందరూ ఆడింది తక్కువే. టెస్టులు, వన్డేల్లోనే సత్తా చాటుతూ టీ20 ఫార్మాట్లో ఎక్కువగా విశ్రాంతి కోరుకునే నైజం ఆసీస్ ఆటగాళ్లది!.
ఇతర జట్ల తరహాలో అనలిటిక్స్‌పై పెద్దగా మోజు లేదు. డ్రెస్సింగ్‌రూమ్ వాతావరణం, జట్టు శిక్షణ పద్దతులపై కోచ్ జస్టిన్ లాంగర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తరుణం. అయినా, కంగారూలు కలిసికట్టుగా ఆడారు. టోర్నీని నెమ్మదిగా ఆరంభించినా వేగంగా రేసులోకి వచ్చారు. కీలక సమయంలో సరైన ఆటగాళ్లు ఫామ్‌లోకి రావటం, కెప్టెన్ ఫించ్ టాస్‌లు నెగ్గటం బాగా కలిసొచ్చాయి.
రికార్డు ప్రేక్షకుల నడుమ, సొంతగడ్డ మెల్బోర్న్లో 2020 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా అమ్మాయిలు సొంతం చేసుకోగా.. ఏడాది అనంతరం మెన్స్ వారితో జతకలిశారు. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్నారు. 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో సొంతగడ్డపై డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగబోతున్నారు. టైటిల్ రేసులోనే లేని ఆస్ట్రేలియాను చాంపియన్‌గా నిలిపిన ఘనత ఎవరిదో చూద్దామా!.
నవతెలంగాణ క్రీడావిభాగం
డెవిడ్ వార్నర్ : 289 పరుగులు
టాప్ ఆర్డర్లో డెవిడ్ వార్నర్ స్థానంపై ఆస్ట్రేలియా శిబిరంలో ఎటువంటి సందేహాలు లేవు. ఆ నమ్మకమే ఆస్ట్రేలియాను విజేతగా నిలబెట్టింది. ఐపీఎల్ ప్రాంఛైజీ తుది జట్టులో ఉద్వాసనకు గురైన వార్నర్ అత్యంత గడ్డు పరిస్థితులు చవిచూసి ప్రపంచకప్‌కు వచ్చాడు. అదిరే బ్యాటింగ్ ప్రదర్శనతో ఆసీస్‌తో తొలి టీ20 వరల్డ్‌కప్ అందించి.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చిన వార్నర్ 42 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో 56 బంతుల్లోనే 89 పరుగులు చేసిన వార్నర్.. సెమీస్ విజయంలో కీలక భూమిక వహించాడు. 30 బంతుల్లో 49 పరుగులు చేసి ద్వితీయార్థంలో స్టోయినిస్, వేడ్ పని సులభతరం చేశాడు. టైటిల్ పోరులోనూ మ్యాచ్‌ను మలుపు తిప్పే అర్థ సెంచరీతో కదం తొక్కాడు. ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ విజయంలో సింహాభాగం ఘనత డెవిడ్ వార్నర్‌కు దక్కుతుంది.
ఆడం జంపా : 13 వికెట్లు
ప్రపంచంలోనే అత్యుత్తమ ముగ్గురు పేసర్లు మిచెల్ స్టార్క్, జోశ్ హజిల్‌వుడ్, పాట్ కమిన్స్‌లతో కూడిన జట్టులో స్పిన్నర్ ఆడం జంపా ఉత్తమ బౌలర్‌గా నిలిచాడు. బంతితో మ్యాచ్‌ను మలుపుతిప్పగల స్పిన్నర్‌గా జంపా నిరూపించాడు. 2/21తో దక్షిణాఫ్రికాపై మెరిసిన జంపా.. 2/12తో శ్రీలంకపై మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో నిరాశపరిచినా.. బంగ్లాదేశ్‌పై 5/19తో ఐదు వికెట్ల ప్రదర్శన కనబరిచాడు. సెమీఫైనల్లో పాకిస్థాన్‌పై జంపా ప్రదర్శన అసమానం. పాకిస్థాన్ ఇన్నింగ్స్‌కు కళ్లెం వేసిన జంపా (1/22) ఆసీస్‌ను రేసులో నిలిపాడు. న్యూజిలాండ్‌తో ఫైనల్లోనూ 1/26తో జంపా అటువంటి పాత్రే పోషించాడు. సూపర్12 దశ నుంచి అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్‌గా నిలిచాడు. బ్యాట్‌తో వార్నర్ ఉత్తమంగా రాణించగా.. బంతితో ఆ పని జంపా చేశాడు.
మాథ్యూ వేడ్ : 74 పరుగులు, 9 క్యాచులు
టీ20 ప్రపంచకప్‌లో మాథ్యూ వేడ్ బ్యాటింగ్ అవసరం ఆస్ట్రేలియాకు మూడుసార్లే ఏర్పడింది. అందులో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన మ్యాచ్‌లో 18 బంతుల్లో 18 పరుగుల ఇన్నింగ్స్ ఒకటి. మాథ్యూ వేడ్ మిగతా రెండు ఇన్నింగ్స్‌లు లేకుండా ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకునే పరిస్థితి లేదు. దక్షిణాఫ్రికాపై 120 పరుగుల ఛేదనలో 81/5తో ఉండగా కగిసో రబాడ బౌలింగ్‌లో ఐదు బంతుల్లో 10 పరుగులు పిండుకుని ఆసీస్‌ను రేసులోకి తీసుకొచ్చాడు. ఒత్తిడి తొలగటంతో మార్కస్ స్టోయినిస్ ఆ మ్యాచ్‌ను ముగించాడు. సెమీఫైనల్లో మాథ్యూ వేడ్ ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. 17 బంతుల్లో అజేయంగా 41 పరుగులు చేసి ఆసీస్‌ను ఫైనల్‌కు చేర్చాడు. టోర్నీలో బ్యాటర్లను గడగడలాడించిన పేసర్ షహీన్ షా అఫ్రిదిపై హ్యాట్రిక్ సిక్సర్ల సునామీ అభిమానులు ఎవరూ మరిచిపోలేరు.
మార్కస్ స్టోయినిస్ : 80 పరుగులు
ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్‌లో ఏదైనా లోటు ఉందంటే అది నాణ్యమైన ఫినీషర్. మార్కస్ స్టోయినిస్ ఆ బాధ్యతను తీసుకున్నాడు. ఫైనల్‌కు చేరుకునే క్రమంలో ఆసీస్‌కు అవసరమైన సమయంలో స్టోయినిస్ ముగింపు మహిమ చూపించాడు. దక్షిణాఫ్రికాపై 16 బంతుల్లో 24 పరుగులతో రెండు బంతులు ఉండగానే విజయాన్ని అందించాడు. నెట్ రన్‌రేట్ మెరుగు పర్చుకోవాల్సిన పరిస్థితుల్లో శ్రీలంకపై మ్యాచ్‌ను వేగంగా ముగించాడు. సెమీఫైనల్లో మాథ్యూ వేడ్ తోడుగా 31 బంతుల్లో 40 పరుగుల ఇన్నింగ్స్‌కు తిరుగులేదు. ఫినీషర్‌గా మార్కస్ స్టోయినిస్ బాధ్యతను వంద శాతం నిర్వర్తించాడు.
మిచెల్ మార్ష్ : 185 పరుగులు
టీ20 ప్రపంచకప్‌లో మిచెల్ మార్ష్ కొత్త పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. నం.3 బ్యాటర్‌గా ఆసీస్‌కు కొత్త మ్యాచ్ విన్నర్ దొరికాడు. స్మిత్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కి నెట్టి పవర్ఫుల్ ఆల్‌రౌండర్‌ను ప్రమోట్ చేసి ఆసీస్ ఫలితం రాబట్టింది. ఆరు ఇన్నింగ్స్‌ల్లో రెండు అర్థ సెంచరీలు బాదిన మిచెల్ మార్ష్ 61.66 సగటుతో 185 పరుగులు సాధించాడు. అరోన్ ఫించ్ నిష్క్రమణతో పవర్‌ప్లేలోనే క్రీజులోకి వచ్చిన మిచెల్ మార్ష్ న్యూజిలాండ్ బౌలర్లపై తిరుగులేని ఆధిపత్యం చూపించాడు. ఎదుర్కొన్న తొలి మూడు బంతులను బౌండరీలుగా మలిచాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్‌లో ఎక్కడా దూకుడు తగ్గించలేదు. ఫైనల్లో అజేయ అర్థ సెంచరీతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మిచెల్ మార్ష్ భయమెరుగని బ్యాటింగ్ ప్రదర్శన ఆస్ట్రేలియాకు బాగా కలిసొచ్చింది.
జోశ్ హజిల్‌వుడ్ : 11 వికెట్లు
2019 వన్డే వరల్డ్‌కప్ జట్టు నుంచి ఉద్వాసనకు గురైన జోశ్ హజిల్‌వుడ్.. అన్ని ఫార్మాట్లలోనూ తనెంత కీలకమో యుఏఈలో నిరూపించాడు. 2/19తో దక్షిణాఫ్రికాపై మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన హజిల్‌వుడ్.. శ్రీలంక, బంగ్లాదేశ్‌లపైనా సుమారుగా ఆ స్థాయిలోనే రాణించాడు. వెస్టిండీస్‌పై 4/39తో ఆస్ట్రేలియాకు సెమీఫైనల్లో స్థానం సాధించిపెట్టాడని చెప్పవచ్చు. సెమీస్‌లో అంచనాలను అందుకోకపోయినా.. ప్రతిష్టాత్మక ఫైనల్లో విజృంభించాడు. మిచెల్ స్టార్క్ 60 పరుగులు ఇచ్చిన చోట 3/16తో మ్యాచ్‌లో వ్యత్యాసం చూపించాడు. పవర్‌ప్లేలో పాట్ కమిన్స్‌తో కలిసి జోశ్ హజిల్‌వుడ్ సంధించిన డాట్ బాల్స్ అంతిమంగా ఆసీస్ విజయంలో గుణాత్మక పాత్ర పోషించాయి.