Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోహిత్-ద్రవిడ్ శకానికి శ్రీకారం
- భారత్, కివీస్ తొలి టీ20 నేడు
- రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఇక ముగిసిన అధ్యాయం. గ్రూప్ దశలో నిష్క్రమణతో భారత్, ఫైనల్లో పరాజయంతో న్యూజిలాండ్‌లు మానసికంగా ఎంతో వ్యథ అనుభవించాయి. మరో 11 నెలల్లో రానున్న పొట్టి ప్రపంచకప్ కోసం ఇటు భారత్, అటు న్యూజిలాండ్ సిద్ధమవుతున్నాయి. ద్రవిడ్ శిక్షణ సారథ్యంలో, రోహిత్ నాయకత్వంలో టీమ్ ఇండియా సరికొత్త పంథాలో నడిచేందుకు రంగం సిద్ధం చేసుకుంది. కొత్త బాధ్యతలు, కొత్త సవాళ్లతో టీమ్ ఇండియా సరికొత్త ఆరంభానికి తెరలేపనుంది. నేడు భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 పోరు.
నవతెలంగాణ-జైపూర్
నూతన పంథా! :
2021 టీ20 ప్రపంచకప్ ఓటమితో భారత్ సమీక్ష చేసుకుంది. బ్యాటింగ్ లైనప్‌లో ఫైర్ హిట్టర్లను జోడించనుంది. ఐపీఎల్లో విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ కోచ్ రాహుల్ ద్రవిడ్ శకం నేడు కివీస్‌తో టీ20 సిరీస్‌తో ఆరంభం కానుంది. మరో 11 నెలల్లోనే టీ20 ప్రపంచకప్‌కు ఆసీస్ ఆతిథ్యం ఇవ్వనుంది. కంగారూ గడ్డపై పొట్టి కప్పే లక్ష్యంగా రోహిత్, ద్రవిడ్ ద్వయం ప్రణాళికలు రచిస్తోంది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య స్థానంలో వెంకటేశ్ అయ్యర్‌ను కివీస్‌పై ప్రయోగించనున్నారు. ఐపీఎల్లో కోల్‌కత తరఫున మెరిసిన వెంకటేశ్ అయ్యర్, పేస్ బౌలర్‌గానూ మెప్పించాడు. ఐపీఎల్లో మెరిసిన రుతురాజ్ గైక్వాడ్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, యుజ్వెంద్ర చాహల్‌లు సైతం నేడు బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఆస్ట్రేలియా పరిస్థితులను గమనంలో ఉంచుకుని సూర్యకుమార్ యాదవ్‌ను మిడిల్ ఆర్డర్లో కొనసాగించనున్నారు. జట్టులో ఓపెనింగ్‌లో ఆడే బ్యాటర్లు ఎక్కువున్నారు. రోహిత్, రాహుల్ ఓపెనర్లుగా రానుండగా ఇషాన్ కిషన్, వెంకటేశ్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్‌లను మిడిల్ ఆర్డర్లో ఉపయోగించనున్నారు. ఫామ్‌లో లేని భువనేశ్వర్ కుమార్‌కు మరో అవకాశం. బుమ్రా లేని వేళ అవేశ్ ఖాన్, మహ్మద్ సిరాజ్‌లతో కలిసి భువి తన మ్యాజిక్కు తిరిగి సాధిస్తాడేమో చూడాలి. స్పిన్ విభాగంలో అశ్విన్, చాహల్‌లు తుది జట్టులో నిలిచేందుకు అవకాశం ఉంది. గెలుపు ఓటమిలతో పోల్చితే రోహిత్, ద్రవిడ్ ద్వయం ప్రణాళిక, వ్యూహంలో గుణాత్మక మార్పులు ఎలా ఉన్నాయనే అంశంపై ఎక్కువగా ఆసక్తి కనిపిస్తోంది.
కేన్ లేకుండానే..! :
కెప్టెన్ కేన్ విలియమ్సన్ టీ20 సిరీస్‌కు దూరంగా ఉండనున్నాడు. జట్టుతో పాటు జైపూర్‌కు చేరుకున్న విలియమ్సన్ టెస్టు బృందంతో కలిసి సాధన చేస్తున్నాడు. విలియమ్సన్ లేని వేళ పేసర్ టిమ్ సౌథీ నాయకత్వం వహించనున్నాడు. మరో ఐసీసీ టోర్నీ ఫైనల్లో న్యూజిలాండ్ క్రికెటర్లను కుదిపేసింది. ఆ బాధ నుంచి తేరుకునేందుకు కివీస్‌కు భారత్‌తో సిరీస్ రూపంలో మంచి అవకాశం. యుఏఈలో అవకాశాలు లభించని క్రికెటర్లకు ఎక్కువగా ఈ సిరీస్‌లో చోటు కల్పించే చాన్సుంది. కైల్ జెమీసన్, లాకీ ఫెర్గుసన్లు బౌలింగ్ విభాగంలో తిరిగి జట్టులోకి రానున్నారు. మార్టిన్ గప్టిల్, డార్లీ మిచెల్, జేమ్స్ నీషమ్, టాడ్ ఆష్లెలు బ్యాటింగ్ బాధ్యతలను చూసుకోనున్నారు. చివరగా భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ను 0-5తో న్యూజిలాండ్ కోల్పోయింది. కానీ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై విజయం సాధించిన న్యూజిలాండ్ నేడు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.