Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2-0పై రోహిత్‌సేన కన్ను
- సమం కోసం కివీస్ పోరాటం
- భారత్, కివీస్ రెండో టీ20 నేడు
- రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
న్యూజిలాండ్ చేతిలో వరుస పరాజయాల (మూడు ఫార్మాట్లలో ఆరు ఓటములు)కు చెక్ పెట్టిన రోహిత్ శర్మ తాజాగా ధోనీ ఇలాకాలో టీ20 సిరీస్‌పై కన్నేశాడు. కెప్టెన్‌గా రోహిత్, కోచ్‌గా ద్రవిడ్ విజయంతో బోణీ కొట్టగా.. నేడు విజయం సాధిస్తే సిరీస్ విజయంతోనే ఆరంభించినట్టు అవనుంది. కివీస్‌పై అన్ని విభాగాల్లోనూ మెరుగైన ప్రదర్శన చూపిన టీమ్ ఇండియా నేడు 2-0తో సిరీస్ విజయంపై కన్నేసింది. భారత్, న్యూజిలాండ్ రెండో టీ20 నేడు.
నవతెలంగాణ-రాంచీ
టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశ నుంచే నిష్క్రమించిన టీమ్ ఇండియా.. స్వదేశంలో వేగంగా పుంజుకుంది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఓటమితో నైరాశ్యంలోకి జారుకున్న న్యూజిలాండ్‌పై సాధికారిక విజయం సాధించింది. టీ20 సిరీస్‌లో ముందంజ వేసింది. నేడు అదే జోరు కొనసాగించి పొట్టి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. భారత క్రికెట్ దిగ్గజం ఎం.ఎస్ ధోని సొంతగడ్డ రాంచీ వేదికగా నేడు రెండో టీ20 జరుగనుంది. సిరీస్ సమంపై న్యూజిలాండ్ ఆశలు పెట్టుకోగా.. మరో మ్యాచ్ ఉండగానే లాంఛనం ముగించాలని రోహిత్‌సేన భావిస్తోంది.
మిడిల్ బలంగా : చాలా కాలం తర్వాత టీమ్ ఇండియా మిడిల్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్‌లు ఓపెనర్లుగా టాప్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. విరాట్ కోహ్లి స్థానం నం.3లో సూర్యకుమార్ యాదవ్ జైపూర్‌లో నిర్ణయాత్మక ఇన్నింగ్స్ నమోదు చేశాడు. శ్రేయస్ అయ్యర్ విరామం అనంతరం జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆల్‌రౌండర్‌గా వెంకటేశ్ అయ్యర్ తొలి మ్యాచ్‌లో నిరాశపరిచినా, అతడిపై జట్టు మేనేజ్మెంట్ గట్టి నమ్మకం ఉంచుతోంది. గత మ్యాచ్‌లో తడబాటుకు లోనైన శ్రేయస్ అయ్యర్ నేడు మెరుపు ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. వెంకటేశ్ అయ్యర్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపించే అవకాశం సైతం కనిపిస్తోంది.
బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్ ఫామ్‌లోకి రావటం సానుకూలాంశం. టీ20 ప్రపంచకప్‌లో నిరాశపరిచిన భువనేశ్వర్ జైపూర్‌లో స్ఫూర్తిదాయక గణాంకాలు నమోదు చేశాడు. మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్‌లతో కలిసి భువి పేస్ బాధ్యతలు చూసుకోనున్నాడు. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం తొలి టీ20లో మ్యాజిక్ చేశాడు. అక్షర్ పటేల్ సైతం అతడికి తోడైతే నేడే సిరీస్ భారత్ వశం కానుంది.
సమం చేస్తారా? : టాప్ ఆర్డర్లో ఇద్దరు బ్యాటర్లు అర్థ సెంచరీలు బాదినా న్యూజిలాండ్ భారీ స్కోరు చేయలేకపోయింది. భారత బౌలర్లకు మిగతా బ్యాటర్లు తలొంచారు. మార్టిన్ గప్టిల్, విలియమ్సన్ స్థానంలో ఆడుతున్న మార్క్ చాప్మాన్ కదం తొక్కారు. ఈ ఇద్దరికి డార్లీ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫర్ట్లలో ఒకరు తోడైతే న్యూజిలాండ్ భారీ స్కోరుకు అలవోకగా చేరుకుంటుంది. బౌలర్లలో టిమ్ సౌథీ, టాడ్ ఆష్లె, ట్రెంట్ బౌల్ట్‌లు ఆశించిన ప్రభావం చూపటంలో విఫలమయ్యారు. నేడు సమిష్టిగా రాణిస్తేనే సిరీస్‌పై న్యూజిలాండ్ ఆశలు సజీవంగా ఉంటాయి.
పిచ్ రిపోర్ట్ : రాంచీ సహజంగానే బ్యాట్‌కు, బంతికి రసవత్తర పోరుకు వేదిక. నేటి మ్యాచ్‌కు సైతం ఆ తరహా పిచ్‌ను సిద్ధం చేశారు. ఇక్కడ బౌలర్లకు సైతం మంచి అనుకూలత లభిస్తుంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునేందుకు మొగ్గు చూపనుంది. టీ20 మ్యాచ్‌కు వాతావరణం సైతం సానుకూలంగా ఉంది. ఎటువంటి వర్ష సూచనలు లేవు.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, అక్షర్ పటేల్, అశ్విన్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్, డార్లీ మిచెల్, మార్క్ చాప్మాన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫర్ట్ (వికెట్ కీపర్), రాచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ (కెప్టెన్), టాడ్ ఆష్లె, లాకీ ఫెర్గుసన్, ట్రెంట్ బౌల్ట్.