Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిరీస్ క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి
- ఊరట విజయంపై కివీస్ కన్ను
- భారత్, న్యూజిలాండ్ మూడో టీ20 నేడు
- రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
న్యూజిలాండ్‌ను ఆ జట్టు సొంతగడ్డపై 5-0తో ఓడించి, టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. ఇప్పుడు తన సొంతగడ్డపై మరో క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. పొట్టి సిరీస్‌ను 2-0తో ఇప్పటికే ఖాతాలో వేసుకున్న రోహిత్‌సేన నేడు ఈడెన్గార్డెన్స్న్లో ముచ్చటగా మూడో విజయంతో బ్లాక్క్యాప్కు వైట్‌వాష్ ఓటమిని రుచి చూపించేందుకు సిద్ధమవుతోంది. కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శకంలో తొలి సిరీస్‌నే క్లీన్‌స్వీప్ విజయంగా మలిచేందుకు రంగం సిద్ధమైంది. భారత్, న్యూజిలాండ్ మూడో టీ20 పోరు నేడు.
నవతెలంగాణ-కోల్‌కత
టీ20 ప్రపంచకప్ పరాభవం నుంచి తేరుకున్న టీమ్ ఇండియా స్వదేశంలో క్లీన్‌స్వీప్ విజయం దిశగా సాగుతోండగా.. టీ20 ప్రపంచకప్ ఫైనల్ పరాజయం నుంచి కోలుకున్నట్టు కనిపించటం లేదు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ సేవలు లేని వేళ ఆ జట్టు మరో టీ20 సిరీస్ వైట్‌వాష్ ముంగిట నిలిచింది. మరోవైపు అచ్చొచ్చిన ఈడెన్‌గార్డెన్స్‌లో పూర్తి స్థాయి కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే క్లీన్‌స్వీప్ విజయం కొట్టాలని రోహిత్ శర్మ ఉత్సాహంగా దూసుకెళ్తున్నాడు. ఊరటం విజయం కోసం ఎదురుచూస్తున్న న్యూజిలాండ్ పలు మార్పులు చేర్పులతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న టీమ్ ఇండియా చివరి టీ20లో కొత్త కుర్రాళ్లకు తుది జట్టులో చోటు కల్పించాలని భావిస్తోంది. నేడు రాత్రి 7 గంటల నుంచి కోల్‌కత ఈడెన్‌గార్డెన్స్‌లో మూడో టీ20 పోరు ఆరంభం.
కుర్రాళ్లకు చాన్స్ : టీ20 సిరీస్‌ను 2-0తో ఇప్పటికే ఖాతాలో వేసుకున్న టీమ్ ఇండియా చివరి మ్యాచ్‌లో కుర్రాళ్లకు అవకాశం కల్పించనుంది. టాప్ ఆర్డర్లో, మిడిల్ ఆర్డర్లో ఇద్దరు బ్యాటర్లు.. ఓ పేసర్, ఓ స్పిన్నర్‌కు కొత్తగా తుది జట్టులో చోటు లభించే అవకాశం కనిపిస్తోంది. వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ స్థానంలో యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ స్థానంలో ఇషాన్ కిషన్‌లను ఆడించనున్నారు. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ స్థానంలో యుజ్వెంద్ర చాహల్, పేసర్ దీపక్ చాహర్ స్థానంలో అవేశ్ ఖాన్ తుది జట్టులో నిలిచేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ ధనాధన్ ఇన్నింగ్స్ బాకీ పడ్డాడు. తొలి టీ20లో తడబడిన అయ్యర్‌కు రెండో టీ20లో బ్యాటింగ్ చాన్స్ రాలేదు. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ అయిన వెంకటేశ్ అయ్యర్ నేడు సైతం క్రీజులోకి ముందుగానే రానున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో నిరాశపరిచిన ఇషాన్ కిషన్ నేడు తిరిగి మైదానంలోకి బరిలోకి దిగి సత్తా చాటాలని చూస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో యుజ్వెంద్ర చాహల్ విరామం అనంతరం మ్యాజిక్కు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్ సంచనం అవేశ్ ఖాన్ టీ20 అరంగ్రేటానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. స్వింగ్‌స్టర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించనున్నాడు.
ఊరట దక్కేనా? : టీ20 ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన వెంటనే భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ బిజీ షెడ్యూల్‌కు అలవాటు పడినట్టుగా లేదు. ప్రయాణ బడలిక సైతం ఆ జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపించి ఉంటుందని చెప్పవచ్చు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ లేని కివీస్‌ను భారత్ వరుస మ్యాచుల్లో అలవోకగా ఓడించింది. సొంతగడ్డపై భారత్‌కు 0-5తో టీ20 సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్.. ఇప్పుడు భారత సొంత గడ్డపై మరో వైట్‌వాష్ ఓటమి అంచుల్లో నిలిచింది. చివరి మ్యాచ్‌లోనైనా నెగ్గిన ఊరట పొందాలని ఆ జట్టు ఎదురుచూస్తోంది. సీనియర్ బ్యాటర్ మార్టిన్ గప్టిల్ వరుస మ్యాచుల్లో మెరుస్తున్నా.. భారత బౌలర్లు సమర్థవంతంగా ఆ జట్టును స్వల్ప స్కోరుకే నిలువరిస్తున్నారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు సైతం మెరిస్తేనే కివీస్ ఆశించిన స్కోరు చేయగలదు. బౌలింగ్ విభాగంలోనూ కివీస్ పేసర్లు అంచనాలను అందుకోవటం లేదు. కెప్టెన్ టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్‌లు బంతితో రాణిస్తే కివీస్ బ్యాటర్ల పని సులువు కానుంది.
పిచ్ రిపోర్టు : కోల్‌కత ఈడెన్ గార్డెన్లో భారత్‌కు తిరుగులేని రికార్డుంది. ఐసీసీ టోర్నీలు మినహా ద్వైపాక్షిక సిరీస్‌ల్లో కివీస్‌పై టీమ్ ఇండియా పైచేయి సాధించింది. ఈడెన్ గార్డెన్ పిచ్ సహజసిద్ధంగానే బంతికి, బ్యాట్‌కు రసవత్తర పోటీకి వేదిక. ఇక్కడ పేసర్లతో పాటు స్పిన్నర్లకు మంచి సహకారం లభిస్తుంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ చేసేందుకు మొగ్గుచూపవచ్చు. నేటి మ్యాచ్‌కు వాతావరణం అనుకూలంగా ఉంది. ఎటువంటి వర్ష సూచనలు లేవు.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్/రుతురాజ్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్/ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, అక్షర్ పటేల్, అశ్విన్/ యుజ్వెంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్/అవేశ్ ఖాన్, మహ్మద్ సిరాజ్/హర్షల్ పటేల్.
న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్, మిచెల్, చాప్మాన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫర్ట్ (వికెట్ కీపర్), జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్, ఆడం మిల్నె, టిమ్ సౌథీ (కెప్టెన్), ఇశ్ సోధి, ట్రెంట్ బౌల్ట్.