Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3-0తో టీ20 సిరీస్ భారత్ వశం
- చివరి మ్యాచ్‌లోనూ కివీస్ ఓటమి
- రాణించిన రోహిత్.. అక్షర్ మ్యాజిక్
ఐసీసీ టోర్నీల్లో బ్లాక్‌క్యాప్స్ ఆధిపత్యం చూపిస్తే.. ద్వైపాక్షిక సమరంలో మెన్ ఇన్ బ్లూ ఏకంగా క్లీన్‌స్వీప్‌లు కొట్టేస్తుంది. న్యూజిలాండ్‌ను 5-0తో వారి గడ్డపై క్లీన్‌స్వీప్ చేసిన టీమ్ ఇండియా.. తాజాగా సొంతగడ్డపై 3-0తో మరో క్లీన్‌స్వీప్ విజయం అందుకుంది. రోహిత్ శర్మ (56) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో 184 పరుగులు చేసిన భారత్.. ఛేదనలో న్యూజిలాండ్‌ను 111 పరుగులకు కుప్పకూల్చింది. టీ20 సిరీస్‌ను భారత్ 3-0తో గెల్చుకుంది. న్యూజిలాండ్‌పై భారత్‌కు ఇది వరుసగా రెండో టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్ కావటం విశేషం.
నవతెలంగాణ-కోల్‌కత
టీమ్ ఇండియా క్లీన్‌స్వీప్ కొట్టేసింది. న్యూజిలాండ్‌పై ముచ్చటగా మూడో టీ20లోనూ ఘన విజయం సాధించిన భారత్ టీ20 సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. 185 పరుగుల ఛేదనలో స్పిన్నర్ అక్షర్ పటేల్ (3/9) మ్యాజిక్‌తో విలవిల్లాడిన న్యూజిలాండ్ 111 పరుగులకు ఆలౌటైంది. 73 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం సాధించింది. ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (51, 36 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీతో మెరిసినా భారత బౌలర్ల ధాటికి ఆ జట్టులో ఇతర బ్యాటర్లు తేలిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 184 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (56, 31 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీతో కదం తొక్కాడు. ఇషాన్ కిషన్ (29), దీపక్ చాహర్ (21 నాటౌట్, 8 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
అక్షర్ మ్యాజిక్ : బంతిపై పట్టు చిక్కటం లేదు. ఛేదనలో కివీస్‌కు అదనపు అనుకూలత. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్ (51), డార్లీ మిచెల్ (5) తొలి వికెట్‌కు వేగంగా 21 పరుగులు జోడించారు. పేసర్లను గప్టిల్ అలవోకగా ఆడుతున్న సమయంలో స్పిన్నర్ అక్షర్ పటేల్ చేతికి బంతినిచ్చిన రోహిత్ శర్మ ఫలితం రాబట్టాడు. డార్లీ మిచెల్ (5), మార్క్ చాప్మాన్ (0), గ్లెన్ ఫిలిప్స్ (0)లను అవుట్ చేసి న్యూజిలాండ్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. సహచర బ్యాటర్లు నిష్క్రమిస్తున్నా ఓ ఎండ్‌లో గప్టిల్ జోరు చూపించాడు. 33 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అర్థ సెంచరీ బాదాడు. ప్రమాదకరంగా మారుతున్న గప్టిల్‌ను చాహల్ మాయ చేసి డగౌట్‌కు చేర్చటంతో కివీస్ పరాజయం లాంఛనమైంది. కిషన్ మెరుపు ఫీల్డింగ్‌తో సీఫర్ట్ (17), శాంట్నర్ (2) రనౌట్ కాగా..నీషమ్ (3) కథ హర్షల్ ముగించాడు. 17.2 ఓవర్లలో 111 పరుగులకే చేతులెత్తేసి న్యూజిలాండ్ 73 పరుగుల తేడాతో దారుణ ఓటమి చవిచూసింది.
రోహిత్ ధనాధన్ : టాస్ నెగ్గిన భారత్.. ప్రతికూల పరిస్థితుల్లో స్వీయ సవాల్ విసురుకుంది. ఛేదన సులువైన పిచ్‌పై రోహిత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రాహుల్ స్థానంలో వచ్చిన ఇషాన్ కిషన్ (29, 21 బంతుల్లో 6 ఫోర్లు) తోడుగా కెప్టెన్ రోహిత్ శర్మ (56) చెలరేగాడు. మూడు సిక్సర్లు, ఐదు ఫోర్లతో కదం తొక్కాడు. రోహిత్ మెరవటంతో పవర్‌ప్లేలో భారత్ 69/0తో పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ ఆ తర్వాతే లయ కోల్పోయింది. స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ వరుసగా మూడు వికెట్లు కూల్చటంతో స్కోరు వేగం మందగించింది. పవర్‌ప్లే అనంతరం నాలుగు ఓవర్లలో భారత్ బౌండరీ సాధించలేదు. కిషన్, సూర్య (0), పంత్ (4)లు వెన్వెంటే నిష్క్రమించారు. 27 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదిన రోహిత్ శర్మ సైతం నిష్క్రమించాడు. 10 ఓవర్లలో భారత్ 90/3తో కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో వెంకటేశ్ అయ్యర్ (20, 15 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (25, 20 బంతుల్లో 2 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఈ జోడీ క్రీజులో కుదురుకోవటంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగింది. స్వల్ప విరామంలోనే అయ్యర్ జంటను వెనక్కి పంపిన న్యూజిలాండ్ మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఓ దశలో 160 పరుగులకే పరిమితం అయ్యేలా కనిపించిన భారత్ టెయిలెండర్ల దూకుడుతో మెరుగైన స్కోరు నమోదు చేసింది. దీపక్ చాహర్ (21 నాటౌట్) ఆఖరు ఓవర్లో ఏకంగా 19 పరుగులు పిండుకోగా.. హర్షల్ పటేల్ (18, 11 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) బ్యాటింగ్ నైపుణ్యం చూపించాడు. తొలి పది ఓవర్లలో 90 పరుగులు చేసిన చివరి పది ఓవర్లలో 94 పరుగులు సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్, మిల్నె, ఫెర్గుసన్, సోధిలు తలా ఓ వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
భారత్ ఇన్నింగ్స్ : రోహిత్ (సి,బి) సోధి 56, ఇషాన్ (సి) సీఫర్ట్ (బి) శాంట్నర్ 29, సూర్య (సి) గప్టిల్ (బి) శాంట్నర్ 0, పంత్ (సి) నీషమ్ (బి) శాంట్నర్ 4, శ్రేయస్ (సి) డార్లీ (బి) మిల్నె 25, వెంకటేశ్ (సి) చాప్మాన్ (బి) బౌల్ట్ 20, అక్షర్ నాటౌట్ 2, హర్షల్ (హిట్ వికెట్) ఫెర్గుసన్ 18, దీపక్ నాటౌట్ 21, ఎక్స్‌ట్రాలు : 9, మొత్తం : (20 ఓవర్లలో 7 వికెట్లకు) 184.
వికెట్ల పతనం : 1-69, 2-71, 3-83, 4-103, 5-139, 6-140, 7-162.
బౌలింగ్ : బౌల్ట్ 4-0-31-1, మిల్నె 4-0-47-1, ఫెర్గుసన్ 4-0-45-1, శాంట్నర్ 4-0-27-3, సోధి 4-0-31-1.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : గప్టిల్ (సి) సూర్య (బి) చాహల్ 51, మిచెల్ (సి) హర్షల్ (బి) అక్షర్ 5, చాప్మాన్ (స్టంప్డ్) పంత్ (బి) అక్షర్ 0, ఫిలిప్స్ (బి) అక్షర్ 0, సీఫర్ట్ (రనౌట్) 17, నీషమ్ (సి)పంత్ (బి) హర్షల్ 3, శాంట్నర్ (రనౌట్) 2, మిల్నె (సి) రోహిత్ (బి)వెంకటేశ్ 9, సోధి (సి) సూర్య (బి) హర్షల్ 9, ఫెర్గుసన్ (సి,బి) చాహర్ 14, బౌల్ట్ నాటౌట్ 2, ఎక్స్టాలు : 1, మొత్తం : (17.2 ఓవర్లలో ఆలౌట్) 111.
వికెట్ల పతనం : 1-21, 2-22, 3-30, 4-69, 5-76, 6-76, 7-84, 8-93, 9-95, 10-111.
బౌలింగ్ : భువనేశ్వర్ 2-0-12-0, దీపక్ 2.2-0-26-1, అక్షర్ 3-0-9-3, చాహల్ 4-0-26-1, వెంకటేశ్ 3-0-12-1, హర్షల్ 3-0-26-2.