Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముస్తాక్ అలీ టీ20 విజేత తమిళనాడు
- ఉత్కంఠ ఫైనల్లో కర్ణాటక పరాజయం
న్యూఢిల్లీ : ప్రియ ప్రత్యర్థులు తమిళనాడు, కర్ణాటకలు తలపడిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ ఫైనల్ మరోసారి ఉత్కంఠ రేపింది. 2019 ఫైనల్లో తమిళనాడుపై ఒక్క పరుగు తేడాతో కర్ణాటక గెలుపొందగా.. ఈసారి కర్ణాటకకు ఆ ఓటమి బాధ తమిళనాడు రుచి చూపించింది. కర్ణాటక గెలుపు దిశగా సాగుతున్న మ్యాచ్‌లో యువ బ్యాటర్ షారుక్ ఖాన్ (33 నాటౌట్, 15 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఆఖరు బంతికి సిక్సర్‌తో తమిళనాడుకు టైటిల్‌ను అందించాడు. చివరి ఓవర్లో తమిళనాడుకు 16 పరుగులు అవసరం కాగా.. తొలి ఐదు బంతులకు 11 పరుగులు వచ్చాయి. చివరి బంతికి ఐదు పరుగులు అవసరమైన స్థితిలో షారుక్ ఖాన్ భారీ సిక్సర్‌తో తమిళనాడును విజేతగా నిలిపాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో తమిళనాడు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 152 పరుగుల ఛేదనలో జగదీశన్ (41), విజరు శంకర్ (18), హరి నిశాంత్ (23) మెరిసినా..15.1 ఓవర్లలో 95/4తో తమిళనాడు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన షారుక్ ఖాన్ (33 నాటౌట్) మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో కర్ణాటక ఆశలు ఆవిరి చేశాడు. అభినవ్ మనోహర్ (46), ప్రవీణ్ దూబె (33), కరుణ్ నాయర్ (18), జగదీశ్ (18) రాణించటంతో తొలుత కర్ణాటక 151 పరుగులు చేసింది. తమిళనాడు బౌలర్ సాయి కిశోర్ (3/12) మూడు వికెట్లతో కర్ణాటకను కట్టడి చేశాడు. డిఫెండింగ్ చాంపియన్ తమిళనాడుకు ఇది మూడో ముస్తాక్ అలీ టీ20 టోర్నీ టైటిల్.
స్కోరు వివరాలు :
కర్ణాటక ఇన్నింగ్స్ : 151/7 (మనోహర్ 46, ప్రవీణ్ దూబె 33, సాయి కిశోర్ 3/12)
తమిళనాడు ఇన్నింగ్స్ : 153/6 (జగదీశన్ 41, షారుక్ ఖాన్ 33, కరియప్ప 2/23)