Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాయకత్వంలో అతడి శైలే వేరు
- భారత క్రికెట్‌కు ప్రయోజనకరం
పొట్టి ఫార్మాట్లో భారత జట్టు నాయకత్వం చేతులు మారింది. ఐపీఎల్ అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ చేతికి టీమ్ ఇండియా టీ20 పగ్గాలు దక్కాయి. నాయకుడిగా తొలి సిరీస్‌లోనే రోహిత్ శర్మ మార్క్ చూపించాడు. 3-0తో న్యూజిలాండ్‌పై సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేశాడు.
వ్యూహ చతురతలో రోహిత్ శర్మ సత్తా, సామర్థ్యంపై ఎవరినీ అనుమానాలు లేవు. మైదానంలో వేగంగా, చురుగ్గా నిర్ణయాలు తీసుకోవటంలో హిట్‌మ్యాన్‌కు మరొకరు సాటిరారు. ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ ఐదు టైటిళ్లు సాధించగా, అందులో రెండు టైటిళ్లు కేవలం రోహిత్ శర్మ నాయకత్వ పటిమకే దక్కాయనే వాదన కొట్టిపారేయలేనిది.
మానవ వనరుల సమర్థ నిర్వహణ, స్పష్టమైన కమ్యూనికేషన్, ముక్కుసూటి నిర్ణయాలు, జూనియర్లకు అండదండ, సీనియర్ల సమర్థ వినియోగం రోహిత్ శర్మను నాయకుడిగా తిరుగులేని స్థానంలో నిలుపుతున్నాయి. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో దుమ్మురేపినా, ఐసీసీ టోర్నీల్లో చతికిల పడటం అర్థరహితం. ఆ పద్దతికి రోహిత్ శర్మ ముగింపు పలుకుతాడనే ఆశాభావం భారత క్రికెట్ వర్గాల్లో కనిపిస్తోంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని పలు విశిష్ట లక్షణాలను ఓ సారి చూద్దాం..!
నవతెలంగాణ క్రీడావిభాగం
హైదరాబాద్‌లోనే బీజం :
రోహిత్ శర్మ ప్రతిభావంతుడైన బ్యాటర్‌గానే అందరికీ తెలుసు. కానీ రోహిత్ శర్మలో తెలివైన నాయకుడు ఉన్నాడనే సంగతి డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ ప్రాంఛైజీ గుర్తించింది. రోహిత్ ఐపీఎల్ కెరీర్ డెక్కన్ ఛార్జర్స్‌తో మొదలైంది. రోహిత్ శర్మలోని సహజ నాయకత్వ లక్షణాలను పసిగట్టిన ఆడం గిల్‌క్రిస్ట్.. డీసీ వైస్ కెప్టెన్‌గా నియమించాడు. ' ముంబయి ఇండియన్స్‌తోనే రోహిత్ శర్మ ఏంటో మనకు తెలుసు. కానీ రోహిత్ శర్మ సత్తా, సామర్థ్యం నేను డెక్కన్ ఛార్జర్స్లోనే పసిగట్టాను. జట్టులో ఎంతోమంది సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ, రోహిత్ శర్మలోని నాయకత్వ లక్షణాలు గుర్తించి వైస్ కెప్టెన్‌ను చేసిన గిల్‌క్రిస్ట్‌కు ఈ ఘనత దక్కుతుంది' అని రోహిత్ స్నేహితుడు, డెక్కన్ ఛార్జర్స్ సహచర ఆటగాడు ప్రజ్ఞాన్ ఓజా తెలిపాడు.
అప్పటికి తోచినట్టుగానే :
ఆధునిక క్రికెట్లో వీడియో విశ్లేషకులు, గణాంకాల బేరీజుతో కెప్టెన్లు నిర్ణయాలు తీసుకుంటున్నారు. మ్యాచ్ సమయంలోనూ వీడియో అనలిస్ట్‌ల సూచనల కోసం ఎదురుచూస్తున్న నాయకులను చూస్తున్నాం. గణాంకాలను పట్టించుకోకుండా, మ్యాచ్ పరిస్థితులకు తగినట్టు తోచిన నిర్ణయం తీసుకోవటంలో ఎం.ఎస్ ధోని ముందుంటారు. మహి తర్వాత ఆ స్టయిల్‌ను అంతటి ప్రభావశీలంగా అమలు చేసే నాయకుడు రోహిత్ శర్మ. ఓ బ్యాటర్ రాగానే, పలానా బౌలర్‌ను బరిలోకి దింపాలి. కుడి ఎడమ బ్యాటర్లకు విరుగుడుగా లెఫ్టార్మ్ స్పిన్నర్ లేదా ఆఫ్ స్పిన్నర్‌తో బౌలింగ్ చేయించాలనే మూస పద్దతిని రోహిత్ అనుసరించడు. క్రీజులో నిలిచిన బ్యాటర్ ఎంత ప్రమాదకారుడైనా బౌలర్‌పై నమ్మకం ఉంచి బంతి అందిస్తాడు. బౌలర్లపై రోహిత్ నిలిపే ఆ విశ్వాసమే వికెట్ల రూపంలో విజయాలు పంట పండిస్తోంది.
ఆటగాళ్లకు దన్ను :
డ్రెస్సింగ్‌రూమ్‌లో మానవ వనరుల సమర్థ నిర్వహణ, నైపుణ్యాల వినియోగం అత్యంత కఠిన వ్యవహారం. జట్టులోని సీనియర్లు, జూనియర్ల మేళవింపుతో అద్భుతాలు చేయవచ్చని ఎం.ఎస్ ధోని నిరూపించాడు. రోహిత్ శర్మది సైతం దాదాపుగా అదే శైలి. సీనియర్ క్రికెటర్ల అనుభవం, నైపుణ్యం వంద శాతం ఉపయోగించుకోవటం, అదే సమయంలో జట్టులోని యువ క్రికెటర్లకు అవకాశాలు కల్పించటంలో రోహిత్ ముందున్నాడు. అవకాశాలు ఇస్తూ కుర్రాళ్లపై ఒత్తిడి పడనీయకుండా, స్వేచ్చగా ఆడే వాతావరణం కల్పించటంలో రోహిత్ మార్క్ కనిపిస్తుంది. జట్టులోని జూనియర్, సీనియర్ క్రికెటర్లు విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో సైతం వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ మద్దతుగా నిలిచాడు. మెరుగైన ప్రదర్శన చేసేందుకు అవసరమైన వాతావరణం కల్పించటం, ఒత్తిడి లేకుండా ఆడేందుకు దన్నుగా నిలిచాడు.
సాహసోపేత నిర్ణయాలు :
మ్యాచ్‌కు ప్రణాళికలు అమలు చేసేందుకు టెస్టు క్రికెట్లో సమయం ఉంటుంది. కానీ టీ20 ఫార్మాట్లో అది కుదరదు. వేగంగా మార్పులు చోటుచేసుకునే పొట్టి ఫార్మాట్లో కెప్టెన్ అప్పటికప్పుడు కొత్త వ్యూహంతో రావాల్సిందే. అటువంటి సమయంలోనే నాయకుడి నుంచి మూస నిర్ణయాలు కాకుండా సాహసోపేత నిర్ణయాలు ఆశిస్తారు. ఈ విషయంలో రోహిత్ శర్మ ఎవరినీ నిరుత్సాహపరచడు. సీనియర్ బ్యాటర్లను వెనక్కి నెట్టి జూనియర్లను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపించటం, కీలక బౌలర్లు అనుకున్న వారిని పక్కనపెట్టి ఇతర వనరులను వినియోగించుకుని విజయం సాధించటం రోహిత్ శర్మ కెప్టెన్సీ శైలి. ఐపీఎల్లో కీరన్ పొలార్డ్, సౌరభ్ తివారి వంటి ఆటగాళ్ల సేవలను వినియోగించుకోవటంలో రోహిత్ శర్మ అంచనాలను తారుమారు చేశాడు.
కమ్యూనికేషన్ :
కెప్టెన్‌గా రోహిత్ శర్మను మరో మెట్టు ఎక్కించిన లక్షణం ఇది. ధోని మాదిరిగానే రోహిత్ సైతం జట్టు సమావేశాలను సింపుల్‌గా తేల్చేస్తాడు. సమావేశాల్లో మితిమీరిన చర్చలకు తావుండదు. కానీ వ్యక్తిగతంగా ప్రతి ఆటగాడితోనూ రోహిత్ శర్మ స్పష్టమైన కమ్యూనికేషన్ కలిగి ఉంటాడు. దీంతో ఓ ఆటగాడు ఫామ్‌లో ఉన్నా, లేకపోయినా.. అతడి నుంచి నాణ్యమైన ప్రదర్శన ఎలా రాబట్టుకోవాలో అతడికి తెలుసు. ముంబయి ఇండియన్స్ జట్టులో రోహిత్‌కు మంచి స్నేహితులు ఉన్నారు. ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ అందించినా, నాయకుడిగా ప్రాంఛైజీ యాజమాన్యంలో గొప్ప గౌరవం దక్కుతున్నా.. ఎన్నడూ ఓ ఆటగాడి పేరు ప్రస్తావిస్తూ తుది జట్టులో చేర్చాలని రోహిత్ శర్మ కోరలేదని ముంబయి ఇండియన్స్ మాజీ ఆటగాళ్లు చెబుతున్నారు.
ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబాని ఐపీఎల్ ప్రాంఛైజీ ముంబయి ఇండియన్స్ టైటిల్ కల సాకారం చేయటమే కాదు లీగ్‌లోనే అత్యంత విజయవంతమైన ప్రాంఛైజీగా నిలిచాడు రోహిత్ శర్మ. ప్రపంచంలో ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ.. ఐసీసీ టైటిల్ కోసం సుమారు ఎనిమిదేండ్లుగా ఎదురుచూస్తుంది. ఈ నిరీక్షణకు నవ నాయకుడు రోహిత్ శర్మ తెరదించుతాడనే ఆశిద్దాం.