Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూనియర్ టైటిల్ రేసులో 16 జట్లు
భువనేశ్వర్ (ఒడిశా) : భారత హాకీ హబ్ ఒడిశా మరో ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు వేదికగా నిలిచింది. 2021 ఎఫ్ఐహెచ్ మెన్స్ జూనియర్ ప్రపంచకప్‌కు భువనేశ్వర్ ముస్తాబైంది. 16 జట్లు పోటీపడుతున్న మెగా ఈవెంట్లో ఆతిథ్య భారత్ ఢిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ఒలింపియన్, టోక్యో ఒలింపిక్స్ పతక విజేత వివేక్ సాగర్ ప్రసాద్ యువ భారత్‌కు నాయకత్వ బాధ్యతలు వహిస్తున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో చారిత్రక కాంస్య పతకం సాధించిన భారత జట్టులో ప్రసాద్ సభ్యుడు. అద్భుత విజయంలో పాలుపంచుకున్న ప్రసాద్.. యువ ఆటగాళ్లు టైటిల్ నిలుపుకునేందుకు గొప్ప ప్రేరణ ఇస్తాడనే అంచనాలు ఉన్నాయి. భారత సీనియర్ జట్టు చీఫ్ కోచ్ యువ జట్టుకు సైతం శిక్షణ సారథ్యం వహిస్తుండటం మరో సానుకూలత. లక్నో వేదికగా జరిగిన 2016 జూనియర్ హాకీ వరల్డ్‌కప్‌లో అద్వితీయ విజయం అందుకున్న భారత్ కళింగ స్టేడియంలో ఆ ప్రదర్శన పునరావృతం చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. నవంబర్ 24న జూనియర్ వరల్డ్‌కప్ ఆరంభానికి రంగం సిద్ధమైంది. బెల్జియం, దక్షిణాఫ్రికా మ్యాచ్‌తో వరల్డ్‌కప్‌కు తెరలేవనుండగా.. తొలి రోజు ఆతిథ్య భారత్, ఫ్రాన్స్ తలపడనున్నాయి.