Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండేండ్లుగా శతకం లేని విరాట్ కోహ్లి
- కివీస్‌తో టెస్టు సిరీస్‌లో వందపై దృష్టి
443 మ్యాచులు, 23519 పరుగులు, 70 శతకాలు, 118 అర్థ సెంచరీలు, మూడు ఫార్మాట్లలోనూ 50కి పైగా బ్యాటింగ్ సగటు. అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లి వీరోచిత బ్యాటింగ్ గణాంకాలు ఇవి. ఏండ్లుగా పరుగుల వరద పారించిన పరుగుల యంత్రం గత రెండేండ్లుగా శతక మైలురాయిని చేరుకోవటంలో విఫలమవుతోంది. టెస్టు, వన్డే, టీ20ల్లో తిరుగులేని బ్యాటింగ్‌తో ప్రపంచ ఉత్తమ బ్యాటర్‌గా కీర్తి గడించిన విరాట్ కోహ్లి కెరీర్లో తొలిసారి శతక సవాల్ ఎదుర్కొంటున్నాడు.
నవతెలంగాణ క్రీడావిభాగం
నవంబర్ 23, 2019. భారత జట్టు చారిత్రక గులాబీ బంతి టెస్టు మ్యాచ్. వేదిక కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్. ప్రత్యర్థి పొరుగు దేశం బంగ్లాదేశ్. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో మ్యాచ్ రెండో రోజే భారత కెప్టెన్ విరాట్ కోహ్లి శతకబాదాడు. 12 ఫోర్లతో 159 బంతుల్లోనే వంద పరుగుల మైలురాయి చేరుకున్నాడు. 136 పరుగుల శతక ఇన్నింగ్సే విరాట్ కోహ్లికి చివరి సెంచరీగా మారింది. ఆ శతకానికి మంగళవారంతో రెండేండ్లు పూర్తయ్యాయి. ఆధునిక క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్‌గా ప్రపంచ క్రికెట్‌ను ఏలుతున్న విరాట్ కోహ్లి వంద పరుగుల మార్క్ కోసం రెండేండ్లు ఎదురు చూడటం చర్చనీయాంశమైంది. భారత క్రికెట్ వర్గాల్లోనే కాదు ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లి శతక నిరీక్షణ హాట్ టాపిక్‌గా మారింది. ఈ రెండేండ్లలో విరాట్ కోహ్లి బ్యాటింగ్ ప్రదర్శన తీసికట్టుగా ఏమీ లేదు. ఏండ్లుగా పరుగుల వరద పారించి బ్యాటర్‌గా ఉత్తమ ప్రమాణాలను నెలకొల్పిన విరాట్ కోహ్లి నుంచి అభిమానులు శతకం ఆశించటం సాధారణమైంది. తను నెలకొల్పిన ప్రమాణాలను అందుకోవటంలో విరాట్ కోహ్లి గత రెండేండ్లుగా విఫలమవుతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు విరాట్ కోహ్లి శతక నిరీక్షణ మరోసారి తెరపైకి వచ్చింది. తొలి టెస్టుకు విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లి ముంబయిలో రెండో టెస్టు నుంచి అందుబాటులోకి రానున్నాడు. విరాట్ కోహ్లి శతక హోరు పున ప్రారంభానికి వాంఖడే స్టేడియం వేదికగా నిలువనుందనే అంచనాలు భారీగా నెలకొన్నాయి.
రెండేండ్ల ప్రదర్శన ఎలా ఉందంటే..! : విరాట్ కోహ్లి మూడు ఫార్మాట్లలోనూ 50కి పైగా సగటుతో దూసుకుపోతున్నాడు. ఈ రెండేండ్లలో శతకం బాదకపోయినా విరాట్ కోహ్లి గణాంకాల్లో పెద్ద మార్పులేమీ రాలేదు. ఈ సమయంలో విరాట్ కోహ్లి 12 టెస్టుల్లో ఆడాడు. ఐదు రోజుల ఆటలో విరాట్ కోహ్లి ప్రదర్శన అంచనాలను అందుకోలేదు. ఈ కాలంలో కోహ్లి టెస్టు బ్యాటింగ్ సగటు 26.80 మాత్రమే. మూడుసార్లు సున్నా పరుగులకే వికెట్ కోల్పోయిన విరాట్ కోహ్లి..ఆ మూడు సార్లు ఇంగ్లాండ్‌తో టెస్టులోనే చతికిల పడ్డాడు. ఆస్ట్రేలియాపై ఆడిలైడ్‌లో చేసిన 74 పరుగులే ఈ ఫార్మాట్లో కోహ్లికి అత్యధికం. తొలి ఇన్నింగ్స్‌లో శతకం దిశగా సాగిన విరాట్.. రహానెతో సమన్వయ లోపంతో రనౌట్‌గా నిష్క్రమించాడు. ఆ తర్వాత పితృత్వ సెలవులో మిగతా సిరీస్‌కు దూరమయ్యాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లను సైతం విరాట్ కోహ్లి శతకం లేకుండానే ముగించాడు. వైట్‌బాల్ ఫార్మాట్లో కోహ్లి 15 వన్డేలు, 23 టీ20లు ఆడాడు. రెడ్ బాల్‌తో పాటు వైట్బాల్తోనూ విరాట్ శతకం సాధించటంలో విఫలమయ్యాడు. వన్డేల్లో 43.26 సగటుతో 649 పరుగులు చేశాడు. అయితే పొట్టి ఫార్మాట్లో విరాట్ కోహ్లి ఆకర్షణీయ గణాంకాలు నమోదు చేశాడు. టీ20ల్లో కోహ్లి అత్యధిక స్కోరు సైతం ఈ కాలంలోనే నమోదైంది. హైదరాబాద్‌లో వెస్టిండీస్‌పై అజేయంగా 94 పరుగులతో కోహ్లి శివమెత్తాడు. 59.76 సగటుతో ఏకంగా 777 పరుగులు సాధించాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేయని విరాట్ కోహ్లి.. టెస్టులో 5, వన్డేల్లో 8, టీ20ల్లో 7 అర్థ శతకాలు నమోదు చేశాడు.
దిగ్గజాలతో పోల్చినప్పుడు ఇలా..! : రెండేండ్లుగా విరాట్ కోహ్లి శతకం సాధించలేదనే వాస్తవంలో మరో కోణం విస్మరించలేనిది. కరోనా మహమ్మారి కారణంగా ఈ రెండేండ్లలో పెద్దగా క్రికెట్ చోటు చేసుకోలేదు. షెడ్యూల్ ప్రకారం అన్ని ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించలేదు. లాక్‌డౌన్‌తో క్రికెటర్లు కొంతకాలం ఇంటికే పరిమితమయ్యాడు. ఇదిలా ఉండగా, విరాట్ కోహ్లి వయసు ప్రస్తుతం 33. ఈ వయసులో క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్లతో పోల్చినప్పుడు విరాట్ కోహ్లి గణాంకాలు గొప్పగా కనిపిస్తున్నాయి. రెండు భిన్న తరాలకు చెందిన క్రికెటర్ల ప్రదర్శనలను పోల్చి చూడటం సరైన పద్దతి కాదు.
కానీ, గణాంకాల పరంగా తన ముందు తరం ఉత్తమ బ్యాటర్లతో పోల్చితే కోహ్లి మెరుగ్గానే ఉన్నాడు!. 33 ఏండ్ల వయసు నాటికి సచిన్ టెండూల్కర్ 494 (అన్ని ఫార్మాట్లు) మ్యాచుల్లో 48.35 సగటుతో 24615 పరుగులు సాధించాడు. 113 అర్థ సెంచరీలు, 74 సెంచరీలు బాదాడు. ఇదే వయసులో రికీ పాంటింగ్ 409 మ్యాచుల్లో 49.81 సగటుతో 20524 పరుగులు చేశాడు. ఇందులో 103 అర్థ శతకాలు, 57 సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లి 443 మ్యాచుల్లో 55.14 సగటుతో 23159 పరుగులు బాదాడు. 118 అర్థ సెంచరీలు, 70 శతకాలు కొట్టాడు. రెండేండ్లలో శతకం లేకపోయినా విరాట్ కోహ్లి బ్యాటింగ్ ప్రదర్శన బాగానే ఉంది. మంచి టచ్‌లో ఉన్న విరాట్ కోహ్లి ఒక్కసారి మూడంకెల స్కోరు అందుకుంటే.. ఆ జోరు కొనసాగుతుందనే ఆశాభావం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.
నవంబర్ 23, 2019 నుంచి కోహ్లి
టెస్టులు వన్డేలు టీ20లు
మ్యాచులు 12 15 23
ఇన్నింగ్స్‌లు 21 15 20
పరుగులు 563 649 777
అ.స్కోరు 74 89 94
సగటు 26.8 43.26 59.76
100 0 0 0
50 5 8 7
33 ఏండ్లలో సచిన్, పాంటింగ్, కోహ్లి సచిన్ విరాట్ పాంటింగ్
మ్యాచులు 494 443 409
పరుగులు 24615 23159 20524
అ.స్కోరు 248 254 257
సగటు 48.35 55.14 49.81
100 74 70 57
50 113 118 103