Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీకాంత్, సాయిప్రణీత్ ముందంజ
- ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్
జకర్తా (ఇండోనేషియా) : అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, మూడో సీడ్ పి.వి సింధు ఇండోనేషియా ఓపెన్ ప్రీ క్వార్టర్స్‌లో ప్రవేశించింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో జపాన్ షట్లర్ అయా ఒహోరితో మూడు గేముల హోరాహోరీ పోరులో తెలుగు తేజం విజయం సాధించింది. 70 నిమిషాల సాగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో 17-21, 21-17, 21-17తో పి.వి సింధు విజయం సాధించింది. మూడో సీడ్ సింధుకు తొలి గేమ్‌లో జపాన్ చిన్నది గట్టి షాకిచ్చింది. 6-6 నుంచి అయా రూట్ మార్చింది. 11-7తో విరామ సమయానికి ఆధిక్యంలో నిలిచిన అయా దూకుడు కొనసాగించింది. 15-15, 16-16తో సింధు స్కోరు సమం చేసినా.. చివర్లో వరుస పాయింట్లతో తొలి గేమ్ సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ సింధు తొలుత వెనుకంజలో నిలిచింది. 7-10 నుంచి 11-10తో విరామ సమయానికి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 14-11, 18-14తో జోరు చూపించింది. రెండో గేమ్ గెల్చుకుని మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లింది. చివరి గేమ్‌లోనూ నెమ్మదిగా మొదలైన సింధు దూకుడు క్లైమాక్స్‌లో టాప్‌గేర్‌కు చేరుకుంది. 11-6తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచిన సింధును 15-15తో అయా నిలువరించింది. చివర్లో వరుసగా పాయింట్లు కొల్లగొట్టిన సింధు మూడో గేమ్‌ను, ప్రీ క్వార్టర్‌ఫైనల్ బెర్త్‌ను కైవసం చేసుకుంది.
పురుషుల సింగిల్స్‌లో మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లో సహచర షట్లర్ హెచ్.ఎస్ ప్రణరుపై విజయం సాధించాడు. 21-15, 19-21, 21-12తో 56 నిమిషాల పాటు సాగిన మూడు గేముల మ్యాచ్‌లో శ్రీకాంత్ పైచేయి సాధించాడు. మరో మ్యాచ్‌లో బి. సాయిప్రణీత్ 21-19, 21-18తో తోమ జూనియర్ పొపొవ్ (ఫ్రాన్స్)పై వరుస గేముల్లో గెలుపొందాడు. మిక్స్డ్ డబుల్స్‌లో దృవ్ కపిల్, సిక్కి రెడ్డి జంట 7-21, 12-21తో ఓటమి చెందగా, మహిళల డబుల్స్‌లో అశ్విని, సిక్కి రెడ్డి 27-29, 18-21తో పోరాడి ఓడారు.