Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి కాన్పూర్‌లో తొలి టెస్టు
- ఫేవరేట్‌గా ఆతిథ్య టీమ్ ఇండియా
- సత్తా చాటేందుకు న్యూజిలాండ్ సిద్ధం
భారత్, న్యూజిలాండ్.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండు అగ్రజట్లు. తొలి ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో తలపడిన చరిత్ర. ఈ రెండు జట్లు పోటీపడిన చివరి మూడు టెస్టుల్లో న్యూజిలాండ్ పైచేయి సాధించింది. ఆ మూడు టెస్టు వేదికల్లోనూ భారత ప్రధాన బలం స్పిన్‌కు కనీస చోటు దక్కలేదు. సొంత పరిస్థితుల్లో న్యూజిలాండ్‌ను ఎదుర్కొనే అవకాశం ఇప్పుడు భారత్‌కు లభించింది. ప్రపంచ టెస్టు చాంపియన్ న్యూజిలాండ్‌కు స్పిన్ దెబ్బ రుచి చూపించాలని టీమ్ ఇండియా చూస్తుండగా.. అగ్ర జట్టుగా ఏ పరిస్థితుల్లోనైనా సత్తా చాటగలమని నిరూపించేందుకు న్యూజిలాండ్ సిద్ధమవుతోంది. కాన్పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టు నేటి నుంచి ఆరంభం.
నవతెలంగాణ-కాన్పూర్
ప్రపంచ క్రికెట్ ఇటీవల అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన సిరీస్ రానే వచ్చింది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనలిస్ట్‌లు భారత్, న్యూజిలాండ్‌లు ద్వైపాక్షిక సిరీస్‌లో తేల్చుకునేందుకు సిద్దమయ్యాయి. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, ట్రెంట్ బౌల్ట్, డీ గ్రాండ్హోమె వంటి స్టార్ క్రికెటర్లు లేకపోయినా టెస్టు సిరీస్‌పై ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. బయో బబుల్ పరిస్థితుల్లో పూర్తి స్థాయి ప్రథమ ప్రాధాన్య జట్టును బరిలో నిలపటం కష్టసాధ్యమే. స్పిన్ గడ్డపై కివీస్‌కు గట్టి దెబ్బ రుచి చూపించాలని భారత్ భావిస్తుండగా.. కీలక ఆటగాళ్లు లేని టీమ్ ఇండియాపై పైచేయి సాధించేందుకు ఇదే తగిన సమయమని న్యూజిలాండ్ ఎదురుచూస్తోంది. స్పిన్నర్లు రాజ్యమేలే కాన్పూర్ పిచ్‌పై మాయజాలం చేసిన జట్టునే విజయం వరించనుంది.
మాయగాళ్ల త్రయం! : ఐసీసీ వరల్డ్ నం.1 టెస్టు జట్టుగా టీమ్ ఇండియా అన్ని పరిస్థితుల్లోనూ ఆడింది. ప్రత్యర్థి గడ్డపై అద్వితీయ విజయాలు సాధించింది. ఈ క్రమంలో టీమ్ ఇండియా పేస్ దళం ఎన్నడూ లేనంత పటిష్టంగా తయారైంది. అదే సమయంలో స్పిన్ విభాగం నాణ్యత ఇసుమంతైనా తగ్గలేదు. స్పిన్ అండతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన భారత్.. తాజాగా న్యూజిలాండ్‌కూ అదే రుచి చూపించాలని అనుకుంటోంది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ రూపంలో ముగ్గురు స్పిన్నర్లను భారత్ బరిలోకి దింపుతోంది. మాయగాళ్ల త్రయానికి ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్‌లలో ఇద్దరు పేస్ తోడ్పాటు అందించనున్నారు. టీమ్ ఇండియా స్పిన్, పేస్ దాడికి ఎదురొడ్డి నిలవటం న్యూజిలాండ్‌కు అతి పెద్ద సవాల్‌గా నిలువనుంది.
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్.. ఈ ముగ్గురు లేని టీమ్ ఇండియా తుది జట్టును ఊహించలేం. స్టార్ బ్యాటర్లు లేకుండానే భారత్ నేడు బరిలోకి దిగుతోంది. ఫామ్‌లో ఉన్న కెఎల్ రాహుల్ సైతం గాయంతో దూరమయ్యాడు. దీంతో బ్యాటింగ్ భారం పూర్తిగా అజింక్య రహానె, చతేశ్వర్ పుజారాలపైనే పడనుంది. న్యూజిలాండ్ చివరగా భారత్‌కు వచ్చినప్పుడు మూడో టెస్టులో 188 పరుగుల మెగా శతకం బాదిన అజింక్య రహానె.. ఇప్పుడు అదే ప్రదర్శన పునరావృతం చేయటంపై దృష్టి పెట్టాడు. దూకుడుగా ఆడనున్న పుజారాపై ఆసక్తి నెలకొంది. మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్‌లకు ఓపెనర్లుగా మంచి రికార్డుంది. దీంతో ఆరంభంలో ఈ ఇద్దరు సైతం భారీ స్కోర్లతో కదం తొక్కగలరు. మిడిల్ ఆర్డర్ శ్రేయస్ అయ్యర్‌కు తొలి అవకాశం దక్కనుంది. అయ్యర్ ఈ అవకాశం ఏ మాత్రం సద్వినియోగం చేసుకుంటాడనేది చూడాలి. జడేజా, సాహా, అశ్విన్, అక్షర్ పటేల్‌లు సైతం బ్యాట్‌తో మెరువగలరు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో కీలక ఆటగాళ్లు లేకపోయినా భారత్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది.
స్పిన్ పాచిక పారేనా? : భారత్‌లో టీమ్ ఇండియాను ఓడించాలంటే నాణ్యమైన స్పిన్నర్లు తుది జట్టులో ఉండాలి. కాన్పూర్‌లో న్యూజిలాండ్ సైతం ముగ్గురు స్పిన్నర్లతో ఆడే అవకాశం కనిపిస్తోంది. పాకిస్థాన్‌పై యుఏఈలో టెస్టు సిరీస్‌లో అజాజ్ పటేల్ 29.61 సగటుతో 13 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకలో 26.88 సగటుతో 9 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఈ గణాంకాలు అద్భుతం. కానీ ఆసియాలో రాణించటం వేరు, భారత పిచ్‌లపై మెరవటం వేరు. ఈ విషయం దిగ్గజ స్పిన్నర్లు షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్‌లకు సైతం తెలుసు. ఇక్కడి పిచ్‌లకు తగినట్టుగా బౌలింగ్ చేయగలిగితేనే వికెట్ల వేటలో ముందుకెళ్లగలరు. అజాజ్ పటేల్‌కు తోడు మిచెల్ శాంట్నర్, విల్ సోమర్విల్లెలు సైతం తుది జట్టులో ఉండనున్నారు. న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ ప్రమాదకారులు. ఈ ఇద్దరు క్రీజులో ఉన్నంతసేపు మ్యాచ్‌ను భారత గుప్పిట్లోకి రాకుండా చూడగలరు. టామ్ లాథమ్, విల్ యంగ్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్ సైతం సత్తా చాటేందుకు ఎదురు చూస్తున్నారు.
పిచ్, వాతావరణం : భారత్, న్యూజిలాండ్ చివరగా కాన్పూర్‌లో ఆడిన టెస్టులో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ జోడీ 16 వికెట్లు పంచుకుంది. తొలి టెస్టుకు సైతం కాన్పూర్‌లో ఆ తరహాలోనే స్పిన్ పిచ్‌ను ఆశించవచ్చు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై ఇటు భారత్, అటు న్యూజిలాండ్ ముగ్గురు స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకోనున్నాయి. టాస్ నెగ్గిన తొలుత బ్యాటింగ్ చేసేందుకు ఇష్టపడే అవకాశం కనిపిస్తోంది. వాతావరణం అనుకూలంగా ఉంది. ఎటువంటి వర్ష సూచనలు లేవు!.
తుది జట్లు (అంచనా) :
భారత్ : మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, వృద్దిమాన్ సాహా (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్/ఇషాంత్ శర్మ.
న్యూజిలాండ్ : టామ్ లాథమ్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మిచెల్ శాంట్నర్/కైల్ జెమీసన్, టిమ్ సౌథీ, నీల్ వాగర్, విల్ సోమర్విల్లె, అజాజ్ పటేల్.