Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అయ్యర్, జడేజా, గిల్ అర్థ సెంచరీలు
- మూడు వికెట్లతో మెరిసిన కైల్ జెమీసన్
- భారత్ తొలి ఇన్నింగ్స్ 258/4
- న్యూజిలాండ్‌తో తొలి టెస్టు తొలి రోజు
భారత బ్యాటింగ్ లైనప్‌లో టాప్-6లో ముగ్గురు స్టార్ బ్యాటర్లు లేరు. టాప్ ఆర్డర్లో శుభ్‌మన్ గిల్ (52) ఒక్కడే అర్థ సెంచరీతో మెరిశాడు. కైల్ జెమీసన్ (3/47) అవుట్ స్వింగ్‌తో ఆతిథ్య జట్టును ఇరకాటంలో పడేశాడు. పుజారా, రహానెలు స్వల్ప స్కోరుకే నిష్క్రమించగా 145/4తో భారత్ ఒత్తిడిలో పడింది. ఈ సమయంలో అరంగేట్ర బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (75 నాటౌట్), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (50 నాటౌట్) అదరగొట్టారు. ఐదో వికెట్‌కు అజేయంగా 113 పరుగులు జోడించి తొలి రోజు ఆటలో భారత్‌ను ముందంజలో నిలిపారు.
నవతెలంగాణ-కాన్పూర్
శ్రేయస్ అయ్యర్ (75 నాటౌట్, 136 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (50 నాటౌట్, 100 బంతుల్లో 6 ఫోర్లు), శుభ్‌మన్ గిల్ (52, 93 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. అనూహ్య బౌన్స్‌తో పేసర్లకు అనుకూలించిన పిచ్‌పై భారత బ్యాటర్లు పోరాట పటిమ చూపించారు. న్యూజిలాండ్ పేసర్ కైల్ జెమీసన్ (3/47) వికెట్‌కు ఆవల బంతిని స్వింగ్ చేస్తూ బ్యాటర్లను ఇరకాటంలో పడేశాడు. రెండో సెషన్లో మూడు కీలక వికెట్లతో కివీస్ మ్యాచ్‌పై పట్టు సాధించినా.. చివరి సెషన్లో అయ్యర్, జడేజా లెక్క సమం చేశారు. 34.4 ఓవర్లలో ఈ జోడీ 113 పరుగులు జోడించి అజేయంగా ఆడుతోంది. ఆరంభంలో స్పిన్నర్ సోమర్విల్లె బౌలింగ్‌లో అయ్యర్ ఇబ్బంది పడినా.. చివరికి అతడిపైనే భారీ సిక్సర్ బాది 75 పరుగుల మార్క్ అందుకున్నాడు. రవీంద్ర జడేజా సైతం క్రీజులో స్వేచ్ఛగా పరుగులు సాధించాడు. అయ్యర్, జడేజా మెరుపులతో చివరి సెషన్లో న్యూజిలాండ్ ఒక్క వికెట్ కూడా దక్కలేదు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 258/4తో పటిష్ట స్థితిలో కొనసాగుతోంది. వృద్దిమాన్ సాహా, అశ్విన్, అక్షర్ పటేల్‌లు సైతం బ్యాట్‌తో రాణించగల సత్తా ఉన్నవారే. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా భారీ స్కోరుపై కన్నేసింది.
శుభ్‌మన్ దూకుడు : భారత్ 82/1
గ్రీన్‌పార్క్‌లో శుభ్‌మన్ గిల్ (52, 93 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) దూకుడు చూపించాడు. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలినా గిల్ తొలి సెషన్లో ఆతిథ్య జట్టును ముందంజలో నిలిపాడు. కైల్ జెమీసన్ అవుట్ స్వింగ్‌తో ఇబ్బంది పడిన మయాంక్ అగర్వాల్ (13) చెత్త షాట్‌తో వికెట్ కోల్పోయాడు. గిల్‌పై స్పిన్నర్ అజాజ్ పటేల్‌ను ప్రయోగించిన విలియమ్సన్కు చేదు అనుభవం ఎదురైంది. అజాజ్‌పై భారీ సిక్సర్ బాదిన గిల్, స్వేచ్ఛగా బౌండరీలు బాదాడు. ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 81 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేశాడు. స్టార్ బ్యాటర్ చతేశ్వర్ పుజారాతో కలిసి రెండో వికెట్‌కు విలువైన 61 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. కీవీస్ పేసర్లు, స్పిన్నర్లు గుడ్ లెంగ్త్ బంతులేసినా శుభ్‌మన్ గిల్ దయ చూపలేదు. గిల్, పుజారా ఆధిపత్య ప్రదర్శనతో తొలి సెషన్లో టీమ్ ఇండియా పైచేయి సాధించింది. 29 ఓవర్లలో భారత్ 82/1తో మెరుగైన స్థితిలో నిలిచింది.
జెమీసన్ జోరు : భారత్ 154/4
తొలి టెస్టు రెండో సెషన్‌ను పూర్తిగా న్యూజిలాండ్ శాసించింది. మూడు కీలక వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా 27 ఓవర్లలో 72 పరుగులే చేసింది. ఆసియాలో తొలి టెస్టు ఆడుతున్న కైల్ జెమీసన్ కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. అనూహ్య బౌన్స్ లభించిన పిచ్‌పై పరిస్థితుల అనుకూలతను సొమ్ము చేసుకున్నాడు. సెషన్ తొలి ఓవర్లోనే శుభ్‌మన్ గిల్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన జెమీసన్.. పుజారా (26, 88 బంతుల్లో 2 ఫోర్లు) క్రీజులో ఇబ్బంది పెట్టాడు. సౌథీ వరుసగా మూడు ఇన్స్వింగర్లతో ఊరించి..ఓ అవుట్ స్వింగర్‌తో పుజారాను తప్పుడు షాట్ ఆడేలా ఉసిగొలిపాడు. దూకుడుగా ఆడతాడనే అంచనాలను పుజారా అందుకోలేదు!. సాధికారిక ఇన్నింగ్స్‌తో మెరిసిన కెప్టెన్ అజింక్య రహానె (35, 63 బంతుల్లో 6 ఫోర్లు) క్రీజులో సౌకర్యవంతంగా కనిపించాడు. జెమీసన్ ఓవర్లో అనూహ్య రీతిలో బంతిని వికెట్లపైకి ఆడి నిష్క్రమించాడు. గిల్, పుజారా, రహానె వికెట్లతో న్యూజిలాండ్ పట్టు సాధించగా.. కీలక బ్యాటర్ల నిష్క్రమణతో ఆతిథ్య జట్టు ఒత్తిడిలో పడింది. శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా ఈ సెషన్లో మరో వికెట్ పడకుండా జాగ్రత్త వహించారు.
అయ్యర్, జడేజా అదుర్స్ : భారత్ 258/4
అరంగ్రేట అయ్యర్, ఆల్‌రౌండర్ జడేజా తొలి రోజును టీమ్ ఇండియా వశం చేశారు!. ఐదో వికెట్‌కు శతక భాగస్వామ్యంతో చెలరేగిన ఈ జోడీ బాధ్యతాయుత అర్థ సెంచరీలతో కదం తొక్కింది. శ్రేయస్ అయ్యర్ ఎంతో పరిణితి చూపించాడు. కివీస్ బౌలర్లను ముందుండి ఎదుర్కొన్నాడు. ఓ ఎండ్‌లో అయ్యర్ పరుగుల వేటలో మెరవటంతో జడేజాపై ఒత్తిడి తగ్గింది. ఆరు ఫోర్లతో 97 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన అయ్యర్.. అజాజ్‌పై అదిరే సిక్సర్ బాదాడు. డ్రింక్స్ విరామం అనంతరం దూకుడు పెంచిన జడేజా వేగంగా పరుగులు సాధించాడు. ఆరు ఫోర్ల సాయంతో 99 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. సోమర్విల్లె ఓవర్లో మిడ్ వికెట్లో భారీ సిక్సర్ బాదిన అయ్యర్ ఇన్నింగ్స్‌కు ఊపు తీసుకొచ్చాడు. వెలుతురు లేమితో తొలి రోజు ఆటను మరో 6 ఓవర్లు ఉండగానే నిలిపివేశారు. ఆట ముగిసే సమయానికి భారత్ 258/4తో పటిష్ట స్థితిలో నిలిచింది.
ద్రవిడ్ మార్క్! : చీఫ్ కోచ్‌గా తొలి టెస్టు సిరీస్‌లోనే రాహుల్ ద్రవిడ్ తన మార్క్ చూపించాడు!. భారత జట్టులో తిరిగి సమ్మిళిత సంస్కృతికి శ్రీకారం చుట్టాడు. ఇన్నాండ్లూ టీమ్ ఇండియా ఓ బృందంగా ఉంటూ బయటి వ్యక్తులను ప్రాధాన్యం ఇవ్వలేదు. కాన్పూర్ టెస్టులో అరంగ్రేటం చేసిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు టెస్టు క్యాప్ అందించేందుకు దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌ను ద్రవిడ్ ఆహ్వానించాడు. మాజీ ఆటగాళ్లను పిలిచి అరంగ్రేట ఆటగాళ్లకు క్యాప్ అందించే సంస్కృతిని ద్రవిడ్ పున ప్రారంభించాడు.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : మయాంక్ అగర్వాల్ (సి) బ్లండెల్ (బి) జెమీసన్ 13, శుభ్‌మన్ గిల్ (బి) జెమీసన్ 52, చతేశ్వర్ పుజారా (సి) బ్లండెల్ (బి) సౌథీ 26, అజింక్య రహానె (బి) జెమీసన్ 35, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ 75, రవీంద్ర జడేజా బ్యాటింగ్ 50, ఎక్స్‌ట్రాలు : 07, మొత్తం : (84 ఓవర్లలో 4 వికెట్లకు) 258.
వికెట్ల పతనం : 1-21, 2-82, 3-106, 4-145.
బౌలింగ్ : టిమ్ సౌథీ 16.4-3-43-1, కైల్ జెమీసన్ 15.2-6-47-3, అజాజ్ పటేల్ 21-6-78-0, సోమర్విల్లె 24-2-60-0, రచిన్ రవీంద్ర 7-1-28-0.