Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాథమ్, యంగ్ అజేయ అర్థ సెంచరీలు
- న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 129/0
- అరంగేట్రంలో శ్రేయస్ అయ్యర్ శతకం
- భారత్ తొలి ఇన్నింగ్స్ 345/10
- కాన్పూర్ టెస్టు రెండో రోజు
అనూహ్యంగా స్పందిస్తున్న గ్రీన్‌పార్క్ పిచ్‌పై న్యూజిలాండ్ గట్టిగా ప్రతిఘటిస్తోంది. తొలి రోజు పేసర్లకు పిచ్ నుంచి మంచి బౌన్స్ అందటంతో పట్టు సాధించిన న్యూజిలాండ్.. బ్యాట్‌తో అంచనాకు మించి రాణిస్తోంది. శ్రేయస్ అయ్యర్ (105) అరంగేట్ర ఇన్నింగ్స్‌లోనే శతకం నమోదు చేయటంతో భారత్ 345 పరుగులు చేసింది. ఓపెనర్లు విల్ యంగ్ (75 నాటౌట్), టామ్ లాథమ్ (50 నాటౌట్) అర్థ సెంచరీలతో కదం తొక్కటంతో న్యూజిలాండ్ 129/0తో పటిష్ట స్థితిలో కొనసాగుతోంది.
నవతెలంగాణ-కాన్పూర్
విచిత్ర పిచ్‌పై పర్యాటక జట్టు పట్టుదలగా ఆడుతోంది. విల్ యంగ్ (75 బ్యాటింగ్, 180 బంతుల్లో 12 ఫోర్లు), టామ్ లాథమ్ (50 బ్యాటింగ్, 165 బంతుల్లో 4 ఫోర్లు) అర్థ సెంచరీలతో మెరిశారు. ఆతిథ్య జట్టు ప్రపంచ శ్రేణి స్పిన్ త్రయం రెండు వైపులా మ్యాజిక్ చేసేందుకు ప్రయత్నించినా ఓపెనర్లు గొప్పగా ప్రతిఘటించారు. తొలి ఇన్నింగ్స్‌లో 57 ఓవర్లలో 129/0తో న్యూజిలాండ్ పటిష్ట స్థితిలో కొనసాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి లాథమ్, యంగ్లు అజేయంగా ఆడుతున్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌కు న్యూజిలాండ్ మరో 216 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది. అంతకముందు అరంగేట్ర ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (105, 171 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి శతకం సాధించాడు. టెయిలెండర్లలో రవిచంద్రన్ అశ్విన్ (38, 56 బంతుల్లో 5 ఫోర్లు) రాణించటంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 345 పరుగులు చేసింది. న్యూజిలాండ్ పేసర్లలో టిమ్ సౌథీ (5/69) ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా.. కైల్ జెమీసన్ (3/91), అజాజ్ పటేల్ (2/90) రాణించారు.
అయ్యర్ శతకం : భారత్ 339/8
తొలి రోజును గొప్పగా ముగించిన భారత్ రెండో రోజు ఆ జోరు కొనసాగించలేదు. అర్థ సెంచరీ హీరో, ఓవర్ నైట్ బ్యాటర్ రవీంద్ర జడేజా (50) ఒక్క పరుగూ జోడించకుండానే వెనక్కి వెళ్లాడు. తొలి సెషన్లో టిమ్ సౌథీ నిప్పులు చెరిగే బంతులతో భారత భారీ స్కోరు ఆశలను ఆవిరి చేశాడు. సౌథీ ఓ ఎండ్‌లో వికెట్ల వేట సాగించినా.. శ్రేయస్ అయ్యర్ మరో ఎండ్‌లో స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. 12 ఫోర్లు, రెండు సిక్సర్లతో 157 బంతుల్లో కెరీర్ తొలి టెస్టు ఇన్నింగ్స్‌లో శతక గర్జన చేశాడు. వంద పరుగుల మైలురాయి అనంతరం అయ్యర్ ఎంతోసేపు క్రీజులో నిలువలేదు. సౌథీ ఓవర్లోనే వికెట్ పారేసుకున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్ వృద్దిమాన్ సాహా (1), అక్షర్ పటేల్ (3)లను సైతం సౌథీ వెనక్కి పంపించాడు. దీంతో తొలి సెషన్లో నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. టెయిలెండర్లలో అశ్విన్ (38) ఒక్కడే అంచనాల మేరకు రాణించాడు. అశ్విన్, ఇషాంత్ (0)లను స్పిన్నర్ అజాజ్ పటేల్ అవుట్ చేయటంతో భారత తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఉమేశ్ యాదవ్ (10) అజేయంగా నిలిచాడు. లంచ్ విరామం అనంతరం కొద్దిసేపటికే భారత్ 345 పరుగులకు కుప్పకూలింది. తొలి రోజు ఆరంభంలో వరుస వికెట్లు కూల్చినా.. చివరి రెండు సెషన్లలో పట్టు కోల్పోయిన న్యూజిలాండ్.. తిరిగి రెండో రోజు తొలి సెషన్లోనే రేసులోకి వచ్చింది. టిమ్ సౌథీ ఐదు వికెట్ల ప్రదర్శనతో భారత్‌ను దెబ్బకొట్టాడు. భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ సంయుక్తంగా 41 ఓవర్లు బౌలింగ్ చేసినా.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. నేడు టాప్ ఆర్డర్ జోరుకు మిడిల్ ఆర్డర్ జతకలిస్తే తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ భారీ ఆధిక్యం సాధించాలని భావిస్తోంది. అదే జరిగితే కాన్పూర్‌లో రహానెసేనకు కష్టాలు తప్పవు. టెస్టు మ్యాచ్ మూడో రోజు గ్రీన్‌పార్క్ స్పిన్‌కు చక్కగా సహకరిస్తే టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కించుకున్నా ఆశ్చర్యం లేదు!. నేడు తొలి సెషన్లో న్యూజిలాండ్ ఓపెనర్లు ప్రదర్శన, భారత బౌలర్ల దూకుడు మ్యాచ్ గమనాన్ని నిర్దేశించనుంది.
ఓపెనర్ల శుభారంభం : న్యూజిలాండ్ 72/0
భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశామనే ఆనందాన్ని న్యూజిలాండ్ ఓపెనర్లు రెట్టింపు చేశారు. భారత ఇన్నింగ్స్ చివర్లో కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే స్పిన్ మ్యాజిక్ మొదలవుతుందనే అంచనాలు నెలకొన్నాయి. కానీ, న్యూజిలాండ్ ఓపెనర్లు టామ్ లాథమ్ (50), విల్ యంగ్ (75)లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. భారత పేస్ ద్వయం ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ సహా స్పిన్ త్రయం అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్‌లు సమిష్టిగా దాడి చేసినా న్యూజిలాండ్ ఓపెనింగ్ జోడీని విడదీయలేదు. రెండో సెషన్లో 26 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన లాథమ్, యంగ్ జోడీ 72 పరుగులు చేసింది. ఈ ఇద్దరి భాగస్వామ్యంతో న్యూజిలాండ్ టెస్టుపై మరింత పట్టు సాధించింది.
పనిచేయని మ్యాజిక్! : న్యూజిలాండ్ 129/0
న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ ఓపెనింగ్ గోడను బద్దలు కొట్టేందుకు టీమ్ ఇండియా చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. లాథమ్, యంగ్లు ఇద్దరూ అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ క్రీజులో కొనసాగగా.. భారత సమీక్షలు విజయవంతం కాలేదు. దీంతో రెండో రోజు మూడు సెషన్ల పాటు న్యూజిలాండ్ జోరు కనిపించింది. విల్ యంగ్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఎనిమిది ఫోర్ల సాయంతో 88 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. సీనియర్ బ్యాటర్ టామ్ లాథమ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడాడు. నాలుగు ఫోర్లతో 157 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేశాడు. ఓ ఎండ్‌లో దూకుడు, మరో ఎండ్‌లో సహనం మేళవింపుతో న్యూజిలాండ్ ఆతిథ్య జట్టుకు గట్టి సవాల్ విసిరింది. చివరి సెసన్లో 31 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన యంగ్, లాథమ్ జోడీ భారత బౌలర్లకు వికెట్ నిరాకరించింది. ఓపెనర్ల అజేయ అర్థ సెంచరీలతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 129/0తో పటిష్ట స్థితిలో నిలిచింది. భారత తొలి ఇన్నింగ్స్‌కు న్యూజిలాండ్ మరో 216 పరుగుల వెనుంకంజలో కొనసాగుతోంది. ప్రధాన బ్యాటర్లు కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ బ్యాటింగ్‌కు రావాల్సి ఉండటంతో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధనపై గురి పెట్టింది.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : మయాంక్ (సి) బ్లండెల్ (బి) జెమీసన్ 13, శుభ్‌మన్ (బి) జెమీసన్ 52, పుజారా (సి) బ్లండెల్ (బి) సౌథీ 26, శ్రేయస్ (సి) యంగ్ (బి) సౌథీ 105, జడేజా (బి) సౌథీ 50, సాహా (సి) బ్లండెల్ (బి) సౌథీ 1, అశ్విన్ (బి) అజాజ్ 38, అక్షర్ (సి) బ్లండెల్ (బి) సౌథీ 3, ఉమేశ్ నాటౌట్ 10, ఇషాంత్ (ఎల్బీ) అజాజ్ 0, ఎక్స్‌ట్రాలు : 12, మొత్తం : (111.1 ఓవర్లలో ఆలౌట్) 345.
వికెట్ల పతనం : 1-21, 2-82, 3-106, 4-145, 5-266, 6-288, 7-305, 8-313, 9-339, 10-345.
బౌలింగ్ : సౌథీ 27.4-6-69-5, జెమీసన్ 23.2-6-91-3, అజాజ్ 29.1-7-90-2, సోమర్‌విలె 24-2-60-0, రచిన్ 7-1-28-0.
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ : టామ్ లాథమ్ బ్యాటింగ్ 50, విల్ యంగ్ బ్యాటింగ్ 75, ఎక్స్‌ట్రాలు : 04, మొత్తం : (57 ఓవర్లలో) 129.
బౌలింగ్ : ఇషాంత్ 6-3-10-0, ఉమేశ్ 10-3-26-0, అశ్విన్ 17-5-38-0, జడేజా 14-4-28-0, అక్షర్ 10-1-26-0.