Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు వికెట్లతో పటేల్ మాయజాలం
- న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 296/10
- 63 పరుగుల ఆధిక్యంలో భారత్
యువ మాయగాడు అక్షర్ పటేల్ (5/62) అదరగొట్టాడు. కెరీర్ నాల్గో టెస్టులోనే ఐదోసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. ఓపెనర్ల దూకుడుతో ఆధిక్యం దిశగా సాగిన న్యూజిలాండ్‌కు అక్షర్ పటేల్ కళ్లెం వేశాడు. రెండో సెషన్లో స్వల్ప విరామంలో ముగ్గురు కీలక బ్యాటర్లను పెవిలియన్‌కు చేర్చి భారత్‌ను ముందంజలో నిలిపాడు. 191/1తో పటిష్టంగా ఉన్న న్యూజిలాండ్ అక్షర్ పటేల్ మాయకు 296 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 49 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 14/1తో ఆడుతోంది. నేడు బ్యాటర్లు అంచనాలను అందుకుంటే చివరి రోజు న్యూజిలాండ్ ముందు రికార్డు లక్ష్యాన్ని ఉంచటం లాంఛనమే!.
నవతెలంగాణ-కాన్పూర్
అక్షర్ పటేల్ (5/62) ఐదు వికెట్ల ప్రదర్శనతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో విలవిల్లాడింది. కివీస్ ఓపెనర్లు విల్ యంగ్ (89, 214 బంతుల్లో 15 ఫోర్లు), టామ్ లాథమ్ (95, 282 బంతుల్లో 10 ఫోర్లు) భారీ అర్థ సెంచరీలతో కదం తొక్కారు. తొలి వికెట్‌కు 151 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఓపెనర్ల అసమాన మెరుపులతో కాన్పూర్‌లో కివీస్ పైచేయి సాధించేలా కనిపించింది. కానీ అక్షర్ పటేల్ మాయజాలంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో విలువైన ఆధిక్యం సమర్పించుకుంది. కేన్ విలియమ్సన్ (18), రాస్ టేలర్ (11), హెన్రీ నికోల్స్ (2), టామ్ బ్లండెల్ (13), రచిన్ రవీంద్ర (13)లు విఫలమయ్యారు. చివరి 9 వికెట్లను 99 పరుగులకే కోల్పోయిన న్యూజిలాండ్.. భారత్‌కు 49 పరుగుల ఆధిక్యం కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 14/1తో కొనసాగుతోంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (4 బ్యాటింగ్), వైస్ కెప్టెన్ పుజారా (9 బ్యాటింగ్) అజేయంగా ఆడుతున్నారు. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (1) ఆరంభంలోనే కైల్ జెమీసన్‌కు వికెట్ కోల్పోయాడు. ప్రస్తుతం భారత్ 63 పరుగుల ముందంజలో కొనసాగుతోంది. నేడు భారత బ్యాటర్ల ప్రదర్శన తొలి టెస్టు గమనాన్ని నిర్దేశించనుంది.
పట్టు చిక్కింది! : న్యూజిలాండ్ 197/2
ఓవర్‌నైట్ స్కోరు 129/0తో మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన న్యూజిలాండ్ ఓపెనర్లు తొలి వికెట్‌కు మరిన్ని పరుగులు జోడించారు. సీనియర్ బౌలర్లు ఇషాంత్, అశ్విన్‌లకు తొలి సెషన్లో బంతినిచ్చిన రహానె న్యూజిలాండ్ ఓపెనర్ల పని కఠినం చేశాడు. అశ్విన్, ఇషాంత్ లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి బంతులేయటంతో పరుగులు రావటం గగనమైంది. అశ్విన్‌పై ఎదురుదాడికి ప్రయత్నించిన యంగ్ వికెట్ల వెనకాల తెలుగు తేజం కెఎస్ భరత్ అద్భుత క్యాచ్‌తో నిష్క్రమించాడు. దీంతో 151 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (18, 64 బంతుల్లో 2 ఫోర్లు) తోడుగా టామ్ లాథమ్ (95) ఇన్నింగ్స్‌ను నడిపించాడు. తొలి సెషన్లో చివర్లో ప్రమాదకర విలియమ్సన్‌ను వికెట్ల ముందు ట్రాప్ చేసిన ఉమేశ్ యాదవ్ భారత్‌కు బ్రేక్ అందించాడు. తొలి సెషన్లో 68 పరుగులు చేసిన న్యూజిలాండ్ 2 వికెట్లు కోల్పోయింది. అశ్విన్, ఉమేశ్ యాదవ్‌లు భారత వికెట్ల వేటకు తెరతీశారు.
అక్షర్ మ్యాజిక్ : న్యూజిలాండ్ 249/6
కెరీర్ నాల్గో టెస్టులోనే అక్షర్ పటేల్ తిరుగులేని మ్యాజిక్ చేస్తున్నాడు. లంచ్ విరామం అనంతరం 11 ఓవర్ల స్పెల్‌లో అక్షర్ పటేల్ న్యూజిలాండ్‌ను విలవిల్లాడించాడు. న్యూజిలాండ్ 214/2తో ఉండగా బంతి అందుకున్న అక్షర్ పటేల్.. 11 ఓవర్లలో 14 పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు కూల్చాడు. 227/5తో కివీస్‌ను కష్టాల్లోకి నెట్టాడు. రాస్ టేలర్ అవుట్‌సైడ్ ఎడ్జ్‌తో భరత్‌కు చిక్కగా.. హిట్టింగ్‌కు క్రీజు వదిలిన టామ్ లాథమ్ (95)ను కీపర్ కెఎస్ భరత్ తిరిగి క్రీజులోకి రానీయలేదు. స్లాగ్ స్వీప్‌కు ప్రయత్నించిన హెన్రీ నికోల్స్ అక్షర్ మాయలో పడిపోయాడు. రచిన్ రవీంద్ర (13)ను రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేయటంతో రెండో సెషన్లో న్యూజిలాండ్ పనైపోయింది. రెండో సెషన్లో 52 పరుగులు చేసిన న్యూజిలాండ్ 4 వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్, జడేజా ఈ సెషన్లో కివీస్‌కు కోలుకోలేని పంచ్ ఇచ్చారు.
ఆధిక్యం భారత్ వశం :
న్యూజిలాండ్ 296/10
ఓపెనర్లు భారీ భాగస్వామ్యంతో రాణించటం, మిడిల్ ఆర్డర్లో ప్రధాన బ్యాటర్లు ఉండటంతో తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ పైచేయి సాధింస్తుందనే అంచనాలు కనిపించాయి. కానీ అక్షర్ పటేల్ ఆ అంచనాలను తలకిందులు చేశాడు. లోయర్ ఆర్డర్లో టెయిలెండర్లు ప్రతిఘటించటంతో న్యూజిలాండ్ విలువైన పరుగులు జోడించింది. కైల్ జెమీసన్ (23, 75 బంతుల్లో 1 ఫోర్) ఎదురు నిలిచాడు. జెమీసన్ పోరాటంతో న్యూజిలాండ్ 296 పరుగులు చేసింది. టామ్ బ్లండెల్ (13), టిమ్ సౌథీ (5) వికెట్లతో అక్షర్ పటేల్ ఐదు వికెట్ల ప్రదర్శన పూర్తి చేసుకున్నాడు. న్యూజిలాండ్ బౌలర్లలో పేసర్ టిమ్ సౌథీ ఐదు వికెట్లు తీయగా..భారత బౌలర్లలో స్పిన్నర్ అక్షర్ పటేల్ ఐదు వికెట్లు పడగొట్టాడు.
కైల్ జెమీసన్ మరోసారి కివీస్‌కు శుభారంభం అందించాడు. తొలి ఇన్నింగ్స్ అర్థ శతక హీరో, యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (1)ను ఇన్నింగ్స్ రెండో ఓవర్ తొలి బంతికే బౌల్డ్ చేశాడు. గిల్ నిష్క్రమణతో మూడో రోజు న్యూజిలాండ్ కొంత మెరుగ్గా ముగించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు ఓవర్లు ఆడిన భారత్ 14 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (4), చతేశ్వర్ పుజారా (9) అజేయంగా ఆడుతున్నారు.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : 345/10
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ : లాథమ్ (సి) భరత్ (బి) అక్షర్ 95, యంగ్ (సి) భరత్ (బి) అశ్విన్ 89, విలియమ్సన్ (ఎల్బీ) ఉమేశ్ 18, టేలర్ (సి) భరత్ (బి) అక్షర్ 11, నికోల్స్ (ఎల్బీ) అక్షర్ 2, బ్లండెల్ (బి) అక్షర్ 13, రవీంద్ర (బి) జడేజా 13, జెమీసన్ (సి) అక్షర్ (బి) అశ్విన్ 23, సౌథీ (బి) అక్షర్ 5, సోమర్‌విలె (బి) అశ్విన్ 6, అజాజ్ నాటౌట్ 5, ఎక్స్‌ట్రాలు : 16, మొత్తం :(142.3 ఓవర్లలో ఆలౌట్) 296.
వికెట్ల పతనం : 1-151, 2-197, 3-214, 4-218, 5-227, 6-241, 7-258, 8-270, 9-284, 10-296.
బౌలింగ్ : ఇషాంత్ 15-3-35-0, ఉమేశ్ 18-3-50-1, అశ్విన్ 42.3-10-82-3, జడేజా 33-10-57-1, అక్షర్ 34-6-62-5.
భారత్ రెండో ఇన్నింగ్స్ : మయాంక్ బ్యాటింగ్ 4, గిల్ (బి) జెమీసన్ 1, పుజారా బ్యాటింగ్ 9, మొత్తం :(5 ఓవర్లలో 1 వికెట్) 14.
వికెట్ల పతనం : 1-2.
బౌలింగ్ : సౌథీ 2-1-2-0, జెమీసన్ 2-0-8-1, అజాజ్ 1-0-4-0.