Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భరత్ వికెట్ కీపింగ్‌పై వీవీఎస్
కాన్పూర్ : భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టులో తుది జట్టులో లేకపోయినా, టెస్టు అరంగేట్రం చేయని వికెట్ కీపర్ కెఎస్ భరత్ అందరి దృష్టిని ఆకర్షించాడు. వృద్దిమాన్ సాహా స్థానంలో వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టి విమర్శల ప్రశంసలు పొందాడు. కెఎస్ భరత్ వికెట్ కీపింగ్ నైపుణ్యం గురించి తనకు చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కొన్నేండ్ల క్రితమే చెప్పినట్టు వీవీఎస్ లక్ష్మణ్ వెల్లడించాడు. ' కెఎస్ భరత్ వికెట్ కీపింగ్ నైపుణ్యం గురించి రాహుల్ ద్రవిడ్ చెప్పటం నాకు ఇప్పటికీ గుర్తుంది. భరత్‌కు మంచి కీపింగ్ స్కిల్స్ ఉన్నాయి. భారత క్రికెట్లో సాహా తర్వాత అతడే అత్యుత్తమ వికెట్ కీపర్ అని ద్రవిడ్ అన్నాడు. సెలక్టర్లు, చీఫ్ కోచ్ నమ్మకాన్ని నిలబెట్టే ప్రదర్శన చేసిన భరత్ పట్ల సంతోషంగా ఉంది. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. స్పిన్ పిచ్‌పై నమ్మకమైన వికెట్ కీపర్ లేకుంటే.. ఎన్నో అవకాశాలు చేజారుతాయి. కెఎస్ భరత్ శనివారం చేసిన ప్రదర్శన అమోఘం' అని వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ తరఫున మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి విశేషంగా ఆకట్టుకున్న కెఎస్ భరత్.. తాజాగా కాన్పూర్ టెస్టులో వికెట్ కీపింగ్ స్కిల్స్, టెక్నిక్‌తో భారత క్రికెట్ వర్గాల దృష్టిని తనవైపునకు తిప్పుకున్నాడు.