Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాన్పూర్‌లో ఇరు జట్లను ఊరిస్తోన్న విజయం
- న్యూజిలాండ్ లక్ష్యం 284, ప్రస్తుతం 4/1
- అయ్యర్, సాహా బాధ్యతాయుత అర్థ సెంచరీలు
- భారత్ రెండో ఇన్నింగ్స్ 234/7 డిక్లేర్డ్
కాన్పూర్ టెస్టు రసకందాయంలో పడింది. భారత్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 51/5తో ఇరకాటంలో పడేసి మ్యాచ్‌పై న్యూజిలాండ్ పట్టు బిగించినా.. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ (65), లోయర్ ఆర్డర్లో వృద్దిమాన్ సాహా (61 నాటౌట్) అర్థ సెంచరీలతో భారత్‌ను తిరుగులేని స్థానంలో నిలబెట్టారు. అయ్యర్, సాహా మెరుపులతో 283 పరుగుల ఆధిక్యంలో నిలిచిన టీమ్ ఇండియా.. చివరి సెషన్లో ఛేదనకు ఆహ్వానించింది. నేడు 90 ఓవర్ల ఆటలో భారత్ విజయానికి 9 వికెట్లు అవసరం కాగా.. న్యూజిలాండ్‌కు 280 పరుగులు కావాలి. అశ్విన్, అక్షర్, జడేజా త్రయాన్ని ఎదుర్కొని కివీస్ ఏ మేరకు నిలబడుతుందో చూడాలి.
నవతెలంగాణ-కాన్పూర్
గ్రీన్‌పార్క్‌లో ఘన విజయానికి టీమ్ ఇండియా రంగం సిద్ధం చేసుకుంది. న్యూజిలాండ్‌కు 284 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన రహానెసేన.. అప్పుడే గెలుపు దిశగా ఓ అడుగు ముందుకేసింది. నాల్గో రోజు చివరి సెషన్లో 4 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 4/1తో కొనసాగుతోంది. ఓపెనర్ విల్ యంగ్ (2)ను అశ్విన్ సాగనంపాడు. టామ్ లాథమ్ (2 నాటౌట్), నైట్ వాచ్‌మన్ సోమర్‌విలె (0 నాటౌట్) అజేయంగా ఆడుతున్నారు. అంతకముందు టీమ్ ఇండియాను రెండో ఇన్నింగ్స్‌లో కష్టాల కడలి నుంచి శ్రేయస్ అయ్యర్ (65, 125 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), వృద్దిమాన్ సాహా (61 నాటౌట్, 126 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలతో ఆదుకున్నారు. అశ్విన్ (32), అక్షర్ పటేల్ (28 నాటౌట్) కీలక భాగస్వామ్యాల్లో పాలు పంచుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌ను భారత్ 234/7 పరుగుల వద్ద డిక్లరేషన్ ప్రకటించింది. తొలి ఇన్నింగ్స్‌లో 49 పరుగుల ఆధిక్యంతో కలుపుకుని భారత్ 283 పరుగుల ముందంజలో నిలిచింది. న్యూజిలాండ్‌కు 284 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టులో నేడు చివరి రోజు ఆట.
కుప్పకూలిన టాప్ ఆర్డర్ : భారత్ 84/5
ఓవర్‌నైట్ స్కోరు 14/1తో నాల్గో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన టీమ్ ఇండియాకు టాప్ ఆర్డర్ బ్యాటర్లు నిరాశే మిగిల్చారు. మయాంక్ అగర్వాల్ (17, 53 బంతుల్లో 3 ఫోర్లు), చతేశ్వర్ పుజారా (22, 33 బంతుల్లో 3 ఫోర్లు) ఆరంభంలో ఆశలు రేకెత్తించారు. ఈ జోడీ క్రీజులో ఉండగా భారత్ మంచి స్కోరుపై కన్నేసింది. పుజారాను జెమీసన్, అగర్వాల్‌ను సౌథీలు సాగనంపటంతో టాప్ ఆర్డర్ ఒక్కసారిగా కుప్పకూలింది. కెప్టెన్ అజింక్య రహానె (4), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (0) చేతులెత్తేశారు. టిమ్ సౌథీ ఇన్నింగ్స్ 20వ ఓవర్లో వరుసగా మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా వికెట్లతో భారత్‌ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 49 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 51 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. 51/5తో భారత్ ఆధిక్యం 150-160 పరుగులకే పరిమితం అయ్యేలా కనిపించింది. న్యూజిలాండ్ పేసర్లు మరోసారి ఆ జట్టుకు తిరుగులేని బ్రేక్ అందించారు. తొలి సెషన్లో మరో వికెట్ పడకుండా అరంగేట్ర శ్రేయస్ అయ్యర్, అశ్విన్‌లు జాగ్రత్త వహించారు. ఉదయం సెషన్లో నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ 70 పరుగులు జోడించింది.
ఆదుకున్న అయ్యర్ : భారత్ 167/7
టాప్ ఆర్డర్ బ్యాటర్లను కోల్పోయిన భారత్ తీవ్ర ఒత్తిడిలో కూరుకుంది. న్యూజిలాండ్ రెట్టించిన ఉత్సాహంతో లంచ్ విరామం అనంతరం జోరు పెంచింది. ఈ పరిస్థితుల్లో తొలి ఇన్నింగ్స్ శతక హీరో, అరంగేట్ర ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (65) జట్టును ఆదుకున్నాడు. టెయిలెండర్ రవిచంద్రన్ అశ్విన్ (32, 62 బంతుల్లో 5 ఫోర్లు)తో కలిసి అయ్యర్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఓ ఎండ్‌లో అశ్విన్ సైతం పూర్తి స్థాయి బ్యాటర్‌ను తలపించే ఇన్నింగ్స్‌ను నమోదు చేశాడు. అశ్విన్, అయ్యర్లు ఆరో వికెట్‌కు 52 పరుగులు జోడించారు. జెమీసన్ మరోసారి బ్రేక్ సాధించి అశ్విన్‌ను వెనక్కి పంపించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ వృద్దిమాన్ సాహాతో కలిసి అయ్యర్ పోరాటం కొనసాగించాడు. ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 109 బంతుల్లో అయ్యర్ అర్థ సెంచరీ నమోదు చేశాడు. టీ విరామానికి ఆఖరు ఓవర్లో శ్రేయస్ అయ్యర్ నిష్క్రమించాడు. దీంతో భారత్ రెండో సెషన్ ముగిసే సమయానికి 167/7తో నిలిచింది. లంచ్ అనంతరం రెండు వికెట్లే కోల్పోయిన భారత్ 83 పరుగులు సాధించింది.
మెరిసిన సాహా : భారత్ 234/7 డిక్లేర్డ్
ప్రతికూల పరిస్థితుల్లో ఎదురీదిన టీమ్ ఇండియా రెండో సెషన్ ముగిసే సరికే మంచి స్థితికి చేరుకుంది. వికెట్ కీపర్ బ్యాటర్ వృద్దిమాన్ సాహా (61 నాటౌట్) అర్థ సెంచరీతో భారత్ ఆధిక్యాన్ని మరింత పెంచాడు. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (28 నాటౌట్)తో కలిసి అభేద్యమైన ఎనిమిదో వికెట్‌కు 67 పరుగులు జోడించాడు. మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో వృద్దిమాన్ సాహా 115 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. అక్షర్ పటేల్ సైతం రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో కదం తొక్కాడు. మూడో సెషన్లో భారత బ్యాటింగ్ వ్యూహం విమర్శలకు దారితీసింది. మ్యాచ్‌లో చివరి రోజే మిగిలి ఉన్న నేపథ్యంలో టెయిలెండర్లు ధనాధన్ పరుగులపై దృష్టి నిలపకుండా, సావధానంగా ఆడటం ఆశ్చర్యానికి గురి చేసింది. పిచ్ నుంచి బౌలర్లకు సహకారం లభించకపోవటంతో భారత్ ఈ వ్యూహం అనుసరించినట్టు తెలిసింది. సెషన్ చివర్లో భారత్ ఇన్నింగ్స్‌ను 234/7 వద్ద డిక్లరేషన్ ప్రకటించింది. 94 ఓవర్ల ఆట మిగిలి ఉన్న టెస్టులో న్యూజిలాండ్‌కు 284 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
మాయ మొదలైంది : 284 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు నాల్గో రోజే గట్టి షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ విల్ యంగ్ (2)ను వికెట్ల ముందు ట్రాప్ చేశాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ టామ్ లాథమ్ (2 నాటౌట్), నైట్‌వాచ్‌మన్ విలియం సోమర్‌విలె (0 నాటౌట్) క్రీజులో కొనసాగుతున్నారు. చివరి రోజు ఆటలో న్యూజిలాండ్ విజయానికి మరో 280 పరుగులు అవసరం. ఇదే సమయంలో భారత్ విజయానికి మరో 9 వికెట్ల దూరంలో నిలిచింది. చివరి రోజు పిచ్ స్పిన్‌కు గొప్పగా సహకరించే అవకాశాలు ఉన్నాయి. తొలి నాలుగు రోజులు పిచ్ అంచనాలకు భిన్నంగా స్పందించినా.. చివరి రోజు ఆటలో స్పిన్‌కు అనుకూలించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. 9 వికెట్లు కాచుకుని అవసరైమైతే విజయం దిశగా సాగేందుకు దీటైన బ్యాటర్లు న్యూజిలాండ్‌కు అందుబాటులో ఉన్నప్పటికీ.. భారత్ నేడు ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది.
భారత్ తొలి ఇన్నింగ్స్ : 345/10
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ : 296/10
భారత్ రెండో ఇన్నింగ్స్ : మయాంక్ (సి) లాథమ్ (బి) సౌథీ 17, గిల్ (బి) జెమీసన్ 1, పుజారా (సి) బ్లండెల్ (బి) జెమీసన్ 22, రహానె (ఎల్బీ) అజాజ్ 4, అయ్యర్ (సి) బ్లండెల్ (బి) సౌథీ 65, జడేజా (ఎల్బీ) సౌథీ 0, అశ్విన్ (బి) జెమీసన్ 32, సాహా నాటౌట్ 61, అక్షర్ నాటౌట్ 28, ఎక్స్‌ట్రాలు : 4, మొత్తం :(81 ఓవర్లలో 7 వికెట్లకు) 234 డిక్లేర్డ్.
వికెట్ల పతనం : 1-2, 2-32, 3-41, 4-51, 5-51, 6-103, 7-167.
బౌలింగ్ : సౌథీ 22-2-75-3, జెమీసన్ 17-6-40-3, అజాజ్ 17-3-60-1, రచిన్ 9-3-17-0, సోమర్‌విలె 16-2-38-0.
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ : లాథమ్ నాటౌట్ 2, యంగ్ (ఎల్బీ) అశ్విన్ 2, సోమర్‌విలె నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 0, మొత్తం :(4 ఓవర్లలో ఒక వికెట్) 4.
వికెట్ల పతనం : 1-3.
బౌలింగ్ : అశ్విన్ 2-0-3-1, అక్షర్ 2-1-1-0.