Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సురక్షిత బయో బబుల్‌కు సీఎస్ఏ హామీ
న్యూఢిల్లీ : కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం క్రికెట్‌పై పడింది. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ కేసులు గణనీయంగా నమోదవుతున్న నేపథ్యంలో ఈ నెలలో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనపై అనుమానాలు మొదలయ్యాయి. ఒమిక్రాన్ విజృంభణ భయపెడుతున్నా దక్షిణాఫ్రికా పర్యటన యథాతథంగా కొనసాగుతుందని బీసీసీఐ కోశాధికారి అరుణ్ కుమార్ అన్నారు. న్యూజిలాండ్‌తో రెండో టెస్టు అనంతరం భారత జట్టు ప్రత్యేక విమానంలో డిసెంబర్ 9న దక్షిణాఫ్రికాకు వెళ్లనుంది. ' ఆటగాళ్ల భద్రత మాకు అత్యంత ప్రధానం. షెడ్యూల్ ప్రకారం బయో బబుల్‌లో ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో జొహనెస్‌బర్గ్ బయల్దేరతారు. దక్షిణాఫ్రికా క్రికెట్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఆటగాళ్ల భద్రత విషయంలో మినహా సిరీస్‌పై ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పర్యటన ఉంటుంది' అని అరుణ్ కుమార్ తెలిపారు.
ఒమిక్రాన్ దెబ్బకు దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ వన్డే సిరీస్ వాయిదా పడినా.. భారత్-ఏ, సఫారీ- ఏ జట్ల నాలుగు రోజుల మ్యాచులు కొనసాగుతున్నాయి. భారత-ఏ జట్టు పర్యటన షెడ్యూల్ ప్రకారం సాగేందుకు సహకరించిన బీసీసీఐకి సీఎస్ఏ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. భారత జట్టు కోసం పూర్తి స్థాయి బయో సెక్యూర్ ఎన్విరాన్మెంట్ను సృష్టించేందుకు దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రిత్వ శాఖ సైతం హామీ ఇచ్చింది. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20లు ఆడనుంది.